Sunday, April 28, 2024

సర్కార్ ఉద్యోగులు సమాజ హితం కోసం తమ విధులను సమర్ధంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : ప్రభుత్వ ఉద్యోగులు సమాజ హితం కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం కోరారు. సర్కార్ కొలువంటే పెద్ద బాధ్యత అని ప్రభుత్వం నిర్దేశించిన లక్షాలు, సంక్షేమ పథకాలను సమర్ధతతో అమలుచేయాలన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం రవీంధ్రభారతి కాన్ఫరెన్స్‌హాల్ వేదికగా రా్రష్ట్ర బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశానికి, ఉద్యోగుల డైరీని ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగం అంటే అవినీతి చర్యలు, అక్రమాలకు పాల్పడటం కాదని, వారు నిజాయితీతో తమ విధులను సమర్ధంగా నిర్వహించి సర్కార్‌కు వన్నె తేవాలని ఆకాంక్షించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలంటే వెనకబడిన సమాజం కానేకాదని, బ్రిలియంట్ క్యాస్ట్ అని, వారు అదృష్ఠవంతులుగా భావించాలని పేర్కొన్నారు. బీసీల్లో అనేకమంది నైపుణ్యత, సృజాన్మాతక భావాలు, ప్రతిభావంతులున్నారని, ఒక కులం వారు ఐదు వృత్తులను నిర్వహిస్తూ సమాజ బాగుకోసం తన వంతు కీలక భూమిక పోషిస్తున్నారని ఆయన వివరించారు.

ఎస్సీ, ఎస్టీల తరహాలోనే ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లను తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. బీసీలలో క్రిమిలేయర్‌ను పూర్తిగా ఎత్తివేయాలి, కొందరు బీసీ ఉద్యోగుల పట్ల కక్ష, ఈర్షాతోనే ఎస్సీ చట్టం కింద కేసులు పెడుతున్నారని, కులం దూషిస్తే, భౌతికంగా దాడులు చేసినవారిపై కేసులు నమోదు చేయవచ్చన్నారు. బీసీల్లో ఐక్యత ద్వారానే తమ లక్షాలను సాధించడానికి వీలుందని, ఈ దిశగా వారిలో సంఘటిత శక్తి ఎంతో అవసరమని, త్వరలో ఉద్యోగుల గర్జన తలపెట్టనున్నాట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బాలాచారి, ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కుల్కచర్ల శ్రీనివాస్ వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News