Tuesday, May 7, 2024

ఇండియా కాదు..భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మన దేశం పేరును ఆంగ్లంలోనూ‘ ఇండియా’నుంచి ‘ మార్చబోతున్నారా? ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించి తీర్మానం చేయనున్నారా? ప్రస్తుతం చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాలతో ఈ ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. అసలు ఈ ఊహాగానాలకు కారణమేంటి? భారత్ అధ్యక్షతన ఈ వారాంతంలో ఢిల్లీలో జి20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న వీరికి ప్రత్యేక విందుఏర్పాటు చేశారు. ఈ విందు కోసం ఇప్పటికే రాష్ట్రపతి భవన్‌నుంచి అతిథులకు ఆహ్వానాలు అందాయి. అయితే ఈ ఆహ్వానంపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించి ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమకు అందిన ఆహ్వానంలో ఈ మార్పును గుర్తించిన కాంగ్రెస్ పారీ ్టట్విట్టర్ వేదికగా కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.

‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇంతకు ముందు ‘ఇండియా: అది భారత్’ అని ఉంటుంది. కానీ ఇప్పుడు మోడీ సర్కార్ వల్ల ‘ భారత్, అది ఇండియా , రాష్ట్రాల సమాఖ్య’ అని చదవాలి. ఇది రాష్ట్రాల సమాఖ్యపైనా జరుగుతున్న దాడి’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్రంపై ధ్వజమెత్తారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సహా ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు కూడా కేంద్రం తీరుపై మండిపడ్డారు. అటు జి20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లో కూడా దేశం పేరును ‘భారత్’గా పేర్కొన్నారు. ‘ భారత్, మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అని అందులో రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశం పేరు మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి.ఆంగ్లంలోనూ ‘ఇండియా’నుంచి ‘భారత్’గా పేరు మారుస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో ‘ఇండియా: దట్ ఈజ్ భారత్’అని ఉండగా.. ఇకపై ‘ భారత్’ అని మాత్రమే ఉండేలా సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 18నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా మంగళవారం ఉదయం దీనిపై ఓ ట్వీట్ చేశారు.‘ రిపబ్లిక్ ఆఫ్ భారత్..మన నాగరికత అమృత్‌కాల్ వైపు వేగంగా అడుగులు వేస్తుండడం గర్వంగా ఉంది’ అని రాసుకొచ్చారు. దేశం పేరు మార్పుపై వస్తున్న ఊహాగానాలకు ఈ ట్వీట్ మరింత బలం చేకూర్చినట్లయింది. కేంద్రంలోని అధికార ఎన్‌డిఎ కూటమిపై పోరుకు జట్టు కట్టిన విపక్షాలు తమ కూటమి పేరును ‘ ఇండియా’ అని ప్రకటించిన విషయం తెలిసిందే.దేశం పేరు మీద తమ కూటమికి పేరు పెట్టుకోవడంపై అప్పట్లో బిజెపి నేతలనుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత దేశం పేరును ‘భారత్’అని మార్చాలంటూ డిమాండ్లు కూడా వినిపించాయి.ఈ క్రమంలోనే దేశం పేరు మార్పుపై ఊహాగానాలు రావడంతో దేశ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మరో వైపు బిజెపి నేతలు దేశం పేరును భారత్‌గా మారిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News