Tuesday, April 30, 2024

గుజరాత్ ఓటమి ప్రభావం జోడో యాత్రపై ఉండదు

- Advertisement -
- Advertisement -

బుండి(రాజస్థాన్): గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్రపై ఉండబోదని రాహుల్ యాత్ర ఎన్నికలు గెలిచేందుకు చేపట్టిన యాత్ర కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంపై కాక రాహుల్ భారత్ జోడో యాత్రపైనే తన దృష్టిని నిమగ్నం చేయడంపై పార్టీలోని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకురాహుల్ సాగిస్తున్న భాత్ జోడో యాత్రను గట్టిగా సమర్థించింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ఒక రోజు మాత్రమే రాహుల్ ప్రచారం చేపట్టగా పార్టీ గెలుపొందిన హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి రాహుల్ దూరంగా ఉన్నారు. గుజరాత్ కాంగ్రెస్‌లో సంస్థాగతంగా ఉన్న కొన్ని లోపాలు, బిజెపి ప్రోద్బలంతో పోటీచేసిన ఆప్, ఎంఐఎం పార్టీల కారణంగా చీలిన ఓట్లు కాంగ్రెస్ ఓటమికి కారణాలుగా జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు. గుజరాత్ ఫలితాలపై లోతుగా విశ్లేషించి తగిన చర్యలు తీసుకుంటామని, ఏ చర్యలు తీసుకోవాలో పార్టీ అధ్యక్షుడికి తెలుసునని ఆయన అన్నారు.

గుజరాత్ ఫలితాలు పార్టీకి నిరాశ కలిగించినప్పటికీ హిమచల్ ఫలితాలు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని ఆయన చెప్పారు. గుజరాత్‌లో పార్టీ ఓటు శాతం 40 నుంచి 27కి పడిపోయినప్పటికీ రానున్న ఐదేళ్లలో మళ్లీ పుంజుకోవడం అసాధ్యమేమీ కాదని ఆయన అన్నారు. ప్రస్తుతం రాజస్థాన్‌లోనే ఉన్న పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం ఇక్కడ భారత్ జోడో యాత్రలో పాల్గొంటారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News