Sunday, April 28, 2024

నడ్డా.. ఇది కెసిఆర్ అడ్డా

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: తెలంగాణ గడ్డ సిఎం కెసిఆర్ అడ్డా అని ఎందరు నడ్డాలు వచ్చినా బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి నట్టేమేమి లేదని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నిన్న ఒక బిజెపి నాయకుడు ఒకరొచ్చారని తెలంగాణ గురించి ఏవేవో మాట్లాడుతున్నాడని కానీ రాష్ట్రాల్లో సాగినట్టు వారి ఆటలు ఇక్కడ సాగవని అది గుర్తుపెట్టుకోవాలని హరీశ్‌రావు హితవు పలికారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా తన సొంత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లోనే బిజెపి గెలిపించుకోలేకపోడని ఇప్పుడు తెలంగాణలో ఏం చేస్తావని ప్రశ్నించారు. మొదట నువ్వు ఇంట గెలువు ఆ తరువాత రచ్చ గెలుచుకోవటం గురించి ఆలోచన చురకలు అంటించారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, శాసన మండలి సభ్యులు దండే విఠల్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు,

దుర్గం చిన్నయ్యలతో కలిసి హాజీపూర్ మండలంలోని దొనబండ ప్రాంతంలో 3 కోట్ల రూపాయలతో 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు శంఖుస్థాపన చేసి పడ్తనపల్లి ఎత్తి పోతల పథకాన్ని మంత్రి ప్రారంభించారు. అదే విధంగా చెన్నూరులో పది కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. మండలంలోని సుద్దాల వాగుపై రూ. 15 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనను, 55 కోట్లతో నిర్మించే పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. చెన్నూరు పట్టణం పాత బస్టాండ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ బిజెపి గెలుపు కోసం కమిటీలు వేస్తుందని ఆ కమిటీలు గెలుపు కోసం కాదని డిపాజిట్ల కోసం అయితే బాగుంటుందని అన్నారు. కొందరు తెలంగాణలో హంగ్ వస్తుందని అంటున్నారని హంగు బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టిస్తుందని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని, జాతీయ ముఖ చిత్రంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమని,

రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధ్ది సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశం దృష్టిని ఆకర్షిస్తుందని రాష్ట్ర ఆర్థ్దిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డకౌట్ అవుతుందని, కాంగ్రెస్ రన్ ఔట్ అని, బిఆర్‌ఎస్ పార్టీ సెంచరీ కొడుతుందన్నారు. బిజెపి నాయకుడు నడ్డా వచ్చి ఏదో మాట్లాడుతున్నావు నడ్డా ఇది తెలంగాణ అడ్డా, కేసీఆర్ అడ్డా అని హెచ్చరించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా సెంచరీ కొట్టేది కెసిఆర్ అని, వంద సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌వాళ్ల్లు కర్ణాటక అవినీతి సొమ్ము తెచ్చి ఇక్కడ పంచి గెలవాలని చూస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే స్థాయికే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. రూ. 85 కోట్ల రూపాయలతో నిర్మించిన పడ్తనపల్లి ఎత్తి పోతల పథకం ద్వారా 18 గ్రామాలకు సాగు నీరు అందు తుందన్నారు. తద్వారా సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉండడంతో రెండు పంటలు పండుతాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దొనబండ ప్రాంతంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు 3 కోట్ల రూపాయలతో 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఉద్యమ సమయంలో మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. మంచిర్యాల జిల్లాకు రూ. 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 600 పడకల ఆసుపత్రి నిర్మించడం జరుగుతుందని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఆడపడుచుల ఇబ్బందులను పరిష్కరిస్తూ ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాల ద్వారా పెండ్లి కానుకగా లక్ష రూపాయలను అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల 70 మందికి 11 వేల కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు. మహిళల సంక్షేమం దిశగా కెసిఆర్ కిట్, అమ్మ ఒడి వాహనం, ఆరోగ్య లక్ష్మి, న్యూట్రిషియన్ కిట్ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.

ప్రభుత్వంలో గర్బిణిలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ప్రసవాలు చేసి కిట్‌లు అందించి అమ్మ ఒడి వాహనం ద్వారా ఇంటి వద్దకు చేర్చడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేసి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయానికి 200 ఉన్న పెన్షన్‌ను 2 వేలకు పెంచి ఇస్తున్నామని, రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 5 వేల పెట్టుబడి సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమాలతో ప్రగతి సాధించడం జరిగిందన్నారు. 60 ఏండ్లలో సాధించని అభివృద్దిని కేవలం పదేండ్లలో చేసి చూపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కాగా మంత్రి హరీష్‌రావు రోడ్డు షోలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేసేందుకు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

పది నుంచి 15 మంది కాంగ్రెస్ నాయకులు రోడ్డు షోలో ప్రత్యక్షం కాగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులపై దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు గమనించి వారిని స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News