Saturday, April 27, 2024

తెలంగాణలో ప్రగతి పరుగులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు అందరినీ ఆకట్టుకుంటాయి
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ ప్రశంసలు
న్యూజిలాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా, దీపావళి సంబురాలు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుందని, అక్కడి సంస్కృతీ, సంప్రదాయాలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ ప్రశంసించారు. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ (ఎన్‌జెడ్‌టిసిఏ) వ్యవస్థాపకుడు కళ్యాణ్ రావు కాసుగంటి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ, దసరా, దీపావళి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్‌తో పాటు మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ న్యూజిలాండ్‌లో నివసించే తెలుగువారు సంస్కృతీ, సంప్రదాయాలను మరిచిపోకుండా ఇలాంటి పండుగలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా హైదరాబాద్ పేరు వినపడుతుందని, దీనికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన కితాబునిచ్చారు. భారత ప్రభుత్వంతో వాణిజ్య ఒప్పందాన్ని ప్రారంభిస్తానని ఆయన ఉద్ఘాటించారు. ప్రధాని రాకను పురస్కరించుకొని సంప్రదాయక హంగులతో ఉత్సవాలను ప్రారంభిస్తూ, ప్రధానమంత్రికి ‘పూర్ణ కుంభం‘ ఆచారంతో స్వాగతం పలికారు. కమ్యూనిటీ స్వచ్ఛంద రంగం మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ మాట్లాడుతూ న్యూజిలాండ్‌లోని తెలంగాణ సమాజంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ప్రదర్శనలతో ప్రేక్షకుల ఉర్రూతలు
వండర్ గర్ల, సంస్కృతీ గ్రూప్, అనురాధ స్కూల్ ఆఫ్ డ్యాన్స్, రిథమ్ డ్యాన్స్ గ్రూపులతో సహా ప్రముఖ నృత్య బృందాలు తెలంగాణ జానపద బాణీలు, బాలీవుడ్ హిట్లు, మరిన్నింటికి సెట్ చేసిన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఉత్తరాఖండ్, మరాఠీ అసోసియేషన్‌లు ఆకర్షణీయమైన ప్రదర్శనలతో సాంస్కృతిక గొప్పతనాన్ని మరింత విస్తరించాయి. ఐశ్వర్య కొక మాస్టర్ అఫ్ సెరిమొనిస్‌గా ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.
ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన కళ్యాణ్ రావు కాసుగంటి
ప్రధాన మంత్రి హిప్కిన్స్, మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌లు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు కళ్యాణ్ రావు కాసుగంటి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సమాజం , విస్తృత భారతీయ ప్రవాసుల మధ్య ఐక్యత యొక్క సారాంశాన్ని ఆయన నొక్కిచెప్పారు, ఈ వేడుకలు సంస్కృతీ, సంప్రదాయాల సంఘీభావానికి ప్రతిరూపంగా నిలిచాయన్నారు. ‘బ్రాండ్ తెలంగాణ‘ వ్యవస్థాపకురాలు నీతా విజయ్ ‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ‘, ‘ఇన్సర్ అవార్డు‘తో న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్ సత్కరించారు. ఈ కార్యక్రమం రామ్ మోహన్ దంతాల హృదయపూర్వక కృతజ్ఞతలతో ముగిసింది.

New-Zealand-3

New-Zealand-4

New-Zealand-1

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News