Saturday, April 27, 2024

వరంగల్‌పై వరుణుడి పగ

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి జిల్లాను మరోసారి ముంచెత్తిన వానలు

బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు పలుచోట్ల కుండపోత
నగరంలో జలమయమైన లోతట్టు ప్రాంతాలు, 20 కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు
ములుగు హైవేను ముంచిన రామప్ప బ్యాక్ వాటర్, కూలిన దొడ్ల జంపన్న వాగు బ్రిడ్జి
బారీ వర్షంలోనూ సహాయక చర్యలు
పర్యవేక్షించిన మంత్రి ఎర్రబెల్లి, ఎంఎల్‌ఎలు, అధికారులు

Etela meeting with health officials on seasonal diseases

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ జిల్లాను మరోసారి వర్షాలు, వరదలతోలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి గురువారం ఉదయం వరకు కురిసిన కుండ పోత వర్షానికి మళ్లీ వాగులు, వంకలు ఉప్పొంగాయి. జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. దీంతో ప్రధానంగా గురువారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు జిల్లాల్లో 15 నుండి 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావడం ఈ జిల్లాలను వరదలు ముంచెత్తి తీవ్ర నష్టాన్ని చేశాయి. ములుగు జిల్లాలో వరదల తాకిడి అధికం కా వడం ఏజెన్సీ ప్రాంతాలంతా అల్లకల్లోలమవుతోంది. గోదావరి ఉప్పొంగడం వల్ల కాళేశ్వరం లక్ష్మిబ్యారేజీలో 56 గేట్లు ఎత్తివేయగా గేట్ల నుండి నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీరు ది గువకు విడుదల కావడం రామన్నగూడెం, ఏటూరునాగారం పుష్కరఘాట్లను వరద తాకి రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ములుగు జిల్లాలోని రామప్ప, లక్నవరం సరస్సులు భారీగా మత్తడి దుంకుతున్నాయి. అయినప్పటికి సరస్సులోకి వస్తున్న వరదల తాకిడికి రామప్ప సరస్సులోని రెస్టారెంట్లు సగం వరకు మునిగిపోయాయి. వేలాడే వంతెనలు కనిపించ కుండానే నీటిలో మునిగిపోయాయి.

Etela meeting with health officials on seasonal diseases

రామప్ప సరస్సు మత్తడి దుంకడం అధిక వరద తాకిడి ఉండడం వల్ల దాని బ్యాక్ వాటర్ ములుగు జిల్లా కేంద్రంతో పాటు దానిపక్కనే ఉన్న జంగాలపల్లి గ్రామాలను ముంపుకు గురి చేసింది. ఈ వరద ములుగు నుండి ఏటూరునాగారం వెళ్లే నేషనల్ హైవేను కూడా ముంచేసి నేషనల్ హైవే రోడ్డు ఒకపక్క కొట్టుకుపోయి ధ్వంసమైంది. మేడారం జంపన్నవాగు బ్రిడ్జిపై నుండి వరద ఉప్పొంగుతుంది. ఆ వరద తాకిడి కొండాయి, దొడ్ల గ్రామాలకు వెళ్లే వాగుపై నిర్మించిన హైలెవెల్ బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తుండడం వల్ల ఆ బ్రిడ్జి వరద తాకిడికి వాగులో కుంగిపోయి కాసేపటికి కూలిపోయింది. చినబోయినపల్లికి వెళ్లే రహదారిలోని కాజ్‌వేపై వరద ఉధృతి పెరగడం వల్ల కాజ్‌వేకు బుంగ పడి రెండు వక్కలైపోయింది. మొత్తంమ్మీద ములుగు జిల్లాను రాత్రంతా కురిసిన భారీ వర్షం అల్లకల్లోలం చేసింది. అర్బన్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి మళ్లీ లోతట్టు ప్రాంతాలన్ని జలమయమైపోయాయి. దాదాపుగా 20 కాలనీల్లో మోకాళ్ల లోతు వరకు నీరు చేరి ఇండ్లలోకి నీరు చేరింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో లోతట్టు కాలనీ ప్రజలు ఉన్నారు. గురువారం ఉదయం వర్షం కురుస్తున్నప్పుడే పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, వరంగల్ మేయర్ గుండా ప్రకాష్‌రావు, ఎంఎల్‌ఎ నన్నపునేని నరేందర్, కలెక్టర్, కమిషనర్, కార్పొరేటర్లతో కలిసి ముంపు ప్రాంతాలైన మైసయ్యనగర్, రామన్నపేట, సంతోషిమాతగుడి, భద్రకాళి గుడి, ములుగురోడ్డు తదితర ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకునే చర్యలను చేపట్టారు.

వర్షాలు తగ్గుముఖం పట్టే పరిస్థితి లేకపోవడంతో మళ్లీ ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలను రంగంలోకి దించుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపురం, భట్టుపల్లి, ధర్మసాగర్, వేలేరు, హసన్‌పర్తి, ఐనవోలు, ఖిలావరంగల్ తదితర మండలాల్లోని గ్రామాలన్ని కూడా వరద ముంపుకు గురయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ప్రధానంగా నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట పట్టణం, నల్లబెల్లి, దుగ్గొండి ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఈ మండలాల్లో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు మళ్లీ ఉప్పొంగడం వల్ల ఎక్కడికక్కడే రాకపోకలు స్తంభించాయి. వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల్లోని మండలాల్లో కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల పరిధిలోని కటాక్షపూర్ చెరువు మత్తడి ఉప్పొంగడం, హన్మకొండ-ములుగు రాకపోకలు రద్దయిపోయాయి.
భారీ వర్షంలోనే సహాయక చర్యలు..
వరంగల్ ఉమ్మడి జిల్లాను మళ్లీ వరదలు ముంచెత్తినప్పటికి మంత్రులు, ఎంపి, ఎంఎల్‌ఎలు జిల్లా అధికార యంత్రాంగం వర్షంలోనే సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మంత్రితో పాటు ప్రభుత్వచీఫ్ విప్, స్థానిక ఎంఎల్‌ఎలు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌లు సహాయక చర్యలు చేపట్టారు. కూలిన ఇండ్లకు నష్టపరిహారం చెల్లించడం లోతట్టు ప్రాంతాల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం యుద్ధప్రాతిపదికన చేపట్టారు. వరంగల్ రూరల్ జిల్లాలో నర్సంపేట ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాల్‌తో కలిసి స్థానిక ఎడిఎ శ్రీనివాసరావుతో పంటల నష్టం ఏమేరకు ఉందో చర్చించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. నర్సంపేట పట్టణంలో ముంపుకు గురైన ఎన్‌టిఆర్‌నగర్, కుమ్మరికుంట కాలనీలను పరిశీలించారు. ఎంఎల్‌ఎలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్‌లు వారి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలను చేపట్టారు. ఇదిలా ఉంటే మహబూబాబాద్ జిల్లాలో ఎంఎల్‌ఎ శంకర్‌నాయక్ ముంపు కాలనీలను పర్యటించి సహాయక చర్యలు చేపట్టగా ములుగు నియోజకవర్గంలో ఎంఎల్‌ఎ సీతక్క అడుగడుగునా ముంపు బాధితుల వెంట ఉండి అన్నిరకాల సహాయక చర్యలు చేపడుతూ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.

Heavy floods in Warangal due to Rain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News