Sunday, April 28, 2024

దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

రైల్వే స్టేషన్‌లో చిక్కుకున్న 500 మంది ప్రయాణికులు

చెన్నై: దక్షిణ తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పాలయంకోటైలో 26 సెంటీమీటర్లు, కన్యాకుమారిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరునల్వేలి జిల్లాలో వరదల్లో చిక్కుకున్న పునరావాస కేంద్రాలకు తరలించారు. షెల్టర్ మోం వద్ద ఆహారం కోసం ప్రజలు బారులు తీరి నిలబడ్డారు. తూత్తుకుడి జిల్లాలోని శ్రీవైకుంఠం తాలూకాలో 525 మిల్లీమీటర్ల వర్షపాతం ఆదివారం నమోదైంది. వర్షం తెరపినిచ్చే అవకాశం కూడా కనపడడం లేదు. తిరుచెందూరు, సర్తాన్‌కులం, కాయతర్, ఒట్టిపడరం తాలూకాలలో సోమవారంభారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆస్తి నష్టం గురించి వార్తలు రానప్పటికీ తూత్తుకుడిలో భారీ వర్షం కారణంగా పశువులు, ఇతర జంతువులు నీట కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. పాలయంకోటై, తిరునల్వేలిలో ఆదివారం సాయంత్రం వరకు 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తిరునల్వేలి, తేత్తుకుడి, కన్యాకుమారి, తెంకాశి జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. తూత్తుకుడి జిల్లాలో ఆదివారం రాత్రి ఏకధాటిగా వర్షం కురిసింది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం జిల్లాలలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పుదుచ్చేరి, కారైకల్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షం కారణంగా కోవిల్‌పట్టి చుట్టుపక్కల ఉన్న నదులు, చెరువులు పూర్తి సామర్ధానికి చేరుకున్నాయి. చెరువులు కట్టలు తెగి ప్రవహిస్తున్నాయి. కోసలిపట్టి, ఇనాం మనియాచ్చి సమీపంలో నది పొంగి ప్రవహించకుండా ఇసుక బస్తాలు, జెసిబి యంత్రాలను సిద్ధంగా ఉంచారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆదేశించారు.

రైల్వే స్టేషన్‌ను చుట్టుముట్టిన వరద
భారీ వర్షం ముంచెత్తడంతో సోమవారం తమిళనాడులోని ఒక రైల్వే స్టేషన్‌లో దాదాదాపు 500 మంది ప్రయాణికులు చిక్కుపడిపోయారు. తూత్తుకుడి జిల్లాలోని శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు నిలిచిపోయారు. భారీ వర్షాల కారణంగా అన్ని వైపులా వర్షం నీరు రైల్వే స్టేషన్‌ను చుట్టుముట్టింది. ట్రాకులు ధ్వంసం కావడంతో రైళ్లు ముందుకు కదిలే పరిస్థితి లేదు. రైల్వే స్టేషన్‌లోనే రైలు నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు నిస్సహాయ స్థితిలో అక్కడే చిక్కుపడిపోయారు.

తిరుచెందూరు నుంచి చెన్నై వస్తున్న రైలు స్టేషషన్‌లోనే నిలిచిపోయింది. స్టేషన్‌కు వెళ్లే రోడ్డు తెగిపోవడంతో సహాయక పనులు కూడా స్తంభించిపోయాయి. రైలులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, స్టేషన్‌ను చేరుకోవడానికి జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎడిఆర్‌ఎఫ్) ప్రయత్నిస్తోందని దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. హెలికాప్టర్ ద్వారా స్టేషన్‌లోని ప్రయాణికులకు ఆహారాన్ని జారివిడచడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లు రైల్వే తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News