Sunday, April 28, 2024

అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

అయోధ్య : తరతరాల నిరీక్షణ తరువాత అయోధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అయోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణంలో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల జవాన్లు పహారాకాస్తున్నారు. ఉగ్రవాద బెదిరింపుల నేపథ్యంలో బాంబు విచ్ఛిత్తి దళాలు సర్వం సన్నద్ధం అయ్యాయి. భద్రతా బలగాలో ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు, యాంటిబాంబు స్కాడ్స్ వీటికి తోడుగా సుశిత శిక్షణ పొందిన జాగిలాల బృందాలు, ఆర్‌పిఎఫ్ సిబ్బంది పారాహుషార్‌గా ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తం అయ్యారు.

అయోధ్య రామాలయ ముఖద్వారం వద్ద పోలీసు సిబ్బంది కాపలాకాస్తోంది. బహుళ అంచెల భద్రతా వ్యవస్థ నడుమ ఇప్పుడు అయోధ్య సోమవారం నాటి కనులపండువ ప్రతిష్టాపనకు సిద్ధమైంది. ఇప్పటికే బాంబు స్కాడ్స్ తనిఖీలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ బలగం (ఎన్‌డిఆర్‌ఎఫ్) క్యాంప్ ఒకటి అయోధ్య క్షేత్రం వద్ద ఏర్పాటు అయింది. అవాంఛనీయ శక్తుల కదలిలకను పసిగడుతూ , వీటిని తిప్పికొట్టేందుకు సమాయత్తం అయింది.

10000ల ఎఐ సిసిటీవీలు ..24/7 పర్యవేక్షణ
యుపి లా అండ్ ఆర్డర్ డిజి వెల్లడి
ఆలయం వద్ద, ఇతర చోట్లా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఉత్తరప్రదేశ్ శాంతిభద్రతల డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ ఆదివారం మీడియాకు తెలిపారు. భద్రతా బలగాల ఏర్పాట్లు, కృత్రిమ మేధతో పనిచేసే సిసిటీవీలు పదివేల వరకూ వివిధ ప్రాంతాలలో ఏర్పాటు అయినట్లు చెప్పారు. ఇక ఇరవైనాలుగు గంటల నిరంతర పర్యవేక్షణ సాగుతుంది. పలుచోట్ల కంట్రోలురూంలు నెలకొల్పారు. యాంటీ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం కూడా వినియోగిస్తున్నారని డిజి వివరించారు. కాగా కీలకమైన లతా మంగేష్కర్ చౌక్ వద్ద ఆర్‌పిఎఫ్‌ను సిద్ధంగా ఉంచారు.

సరయూ నదులు తరచూ పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్ల వద్ద పలు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సోమవారం ఉదయం నుంచి అయోధ్యలోకి కేవలం నిర్ణీత అనుమతి ఉన్న వాహనాలనే అనుమతిస్తారు. అయోధ్యలోని ప్రతి క్రాస్‌రోడ్‌లోనూ ముళ్లకంచెలను అమర్చారు. ట్రాఫిక్ పోలీసు విభాగం పట్టణంలో రాకపోకల నియంత్రణకు , ట్రాఫిక్ క్రమబద్థీకరణకు పలు ఏర్పాట్లు చేసింది.

మధ్యాహ్నం 12.20 గంటలకు ముహుర్తం
అయోధ్యలో కీలకమైన విగ్రహ ప్రాణప్రతిష్ట ఘట్టానికి ముహుర్తం మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో ఖరారు అయింది. ఇది మధ్యాహ్నం ఒంటిగంటకు సంపూర్తి అవుతుంది. ఆ తరువాత ప్రధాని మోడీ వేదిక నుంచి అక్కడ ఆహుతులై ఉండే దాదాపు 7000 మందిని ఉద్ధేశించి ప్రసంగిస్తారు. ఆహుతులలో సాధువులు, పండితులు, వివిధ రంగాల ప్రముఖులు ఉంటారు. ప్రధాని సందేశం దేశవిదేశాలలో ప్రత్యక్ష ప్రసారం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయ అంతర్జాతీయ మీడియా ఇప్పటికే ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించింది.

టీవీలు, ఆన్‌లైన్ వేదికలు రిలేకు ఏర్పాట్లు చేసుకున్నాయి. పలు రాష్ట్రాలలో సోమవారం సెలవు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఓ పూట సెలవు ప్రకటించింది. ఈ నెల 16వ తేదీన ప్రాణప్రతిష్ట పూర్వపు క్రతువులు ఆరంభమయ్యాయి. ఇవి సోమవారంతో ముగుస్తాయి. ఇక ఆ తరువాత అయోధ్య రాముడు అందరి దర్శనానికి మంగళవారం నుంచి సిద్ధం అవుతాడు. ఇప్పటికే గర్భగుడిలో బాలరాముడు (రామ్ లల్లా) విగ్రహం నెలకొల్పారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజు రూపొందించిన ఈ 51 అంగుళాల విగ్రహం తొలి చిత్రాలు విడుదలై అందరి మన్నన్నలు పొందాయి.

ఆలయ అంతర్భాగ చిత్రాలు విడుదల
ఆదివారం రామమందిర ప్రతిష్టాపన్ ట్రస్టు వారు రామాలయ అంతర్భాగం తెలియచేసే వీడియో దృశ్యాలను వెలువరించారు. వీటితో పాటు సంపూర్ణరీతిలో ఈ ఆలయ సముదాయానికి గావించిన అలంకరణలు, దైదీప్యమాన విద్యుద్దీపాల శోభలను తెలిపే చిత్రాలు కూడా పొందుపర్చారు.ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి పలువురు తరలివస్తున్నారు. అతిధుల జాబితాలోని కొందరు ఇప్పటికే పట్టణానికి చేరుకున్నారు. రాజకీయ, ఆర్థిక, వ్యాపార, క్రీడా, సాంస్కృతిక, సినీరంగాలకు చెందిన వారు, టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు,

వీరితో పాటు రామాలయ నిర్మాణంలో కరసేవకులుగా మెదిలిన వారు, ఉద్యమంలో పాలు పంచుకున్న వారు ఎందరెందరో తరలివస్తున్నారు. అత్యంత కీలక ఘట్టానికి ప్రధాని మోడీ ఇతర ప్రముఖులు రానుండటంతో భద్రతా బలగాలకు ఇప్పటి బాధ్యత గురుతరమైంది. అమితాబ్ బచ్చన్, అదానీ, అంబానీ వంటి పలువురు పారిశ్రామికవేత్తలు, సచిన్ టెండూల్కర్ , వివిధ రంగాలకు చెందిన వారు తరలివస్తున్నారు. ఇప్పటికే విశిష్ట అతిధుల జాబితాలోని వారి గురించి ప్రకటన వెలువడింది.

అయోధ్యలో వెలిసిన రామకాలపు చెట్లు
అయోధ్యలో ఇప్పుడు పలుచోట్ల వెలిసిన దాదాపు 7500 పూలచెట్లు అందరిని కనువిందు చేస్తున్నాయి. రామాయణ కాలం నాటి చెట్లుగా భావిస్తున్న వీటిని మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. అటవీశాఖ ప్రత్యేక శ్రద్ధతో వీటిని ఏర్పాటు చేసింది. నిండుగా విరబూసి ఉన్న ఈ చెట్లతో అయోధ్య ఇప్పుడు మరింత సుందరమయింది. వీటితో పాటు పలు విదేశీ చెట్లు వెలిశాయి. వీటిలో రెడ్ లిప్‌స్టిక్, రెడ్‌కాంగో, రింగ్ ఆఫ్ ఫైర్ బిర్కిన్, పింక్ ఫైర్, పింక్ ప్రిన్సెస్ , డ్రాకానా మహాత్మా, అర్జున్ , గులార్, సల్, బన్యాన్ వంటివి వెలిసి మెరుస్తున్నాయి. రామజన్మభూమి ఆవరణలో నెలకొన్న నక్షత్రవాటికలో పలు రకాల చెట్లు అలరించేలా ఏర్పాట్లు చేసినట్లు స్థానిక అటవీ అధికారి సీతాంషు పాండే తెలిపారు.

అయోధ్య ఆకాశవీధిలో కాషాయఛాయలు
అయోధ్య ఆకాశవీధి ఇప్పుడు నీలం బదులుగా కాసాయ రంగు అలుముకున్నట్లుగా ఉంది. భవనాలు, టవర్లు ఇతర చోట్ల పెద్ద చిన్న కాషాయ జెండాలు అమర్చడంతో ఇప్పుడు ఎవరు చూసినా చాలా దూరం వరకూ కాషాయరంగుల్లో ఆకాశం కన్పిస్తోంది. ప్రత్యేక అలంకృత రామపథం, ధర్మపథం వద్ద గుర్రాలపై వెళ్లుతున్న భక్తులు కాషాయజెండాలతో సాగుతున్నారు. జెండాలపై, శ్రీరాముడు, రామాలయం, హనుమాన్ బొమ్మలు కళకళలాడుతున్నాయి. గృహాలు, మఠాలు, దుకాణాలు , హోటళ్లపై కూడా కాషాయ జెండాలు ఎగురుతున్నాయి.

కేవలం ప్రధాన వీధులే కాకుండా , పలు గల్లీల్లో కూడా కాషాయజెండాలు ఎగురుతున్నాయి. విద్యుద్దీపాలపై రామబాణం పోలిన గుర్తులు వెలిసి ఉన్నాయి. ప్రజలందరికి కాషాయజెండాలను ఉచితంగా అందించినట్లు స్థానిక బిజెపి మాజీ కౌన్సిలర్ బీర్‌చంద్ మాంజీ తెలిపారు. అయోధ్య పూర్వపు రాజు నివాసం రాజసౌధం, వివిధ ఇతర దేవాలయాలు ఇప్పుడు విద్యుద్దీపాల కాంతులతో జిగేలు మంటూ జనవరిలో దీవాళి కాంతులను ప్రతిఫలిస్తున్నాయి. ప్రాచీన అయోధ్య నగరి ఇప్పుడు సంపూర్ణస్థాయి ఆధ్యాత్మిక అంతకు మించిన భక్తి భావనను సంతరించుకుందని స్థానికులు తెలిపారు. భారీ పొడవైన అగరుబత్తి వెలిగించారు. ప్రధాన ద్వారం వద్ద విద్యుద్దీపాలంకరణలు అలరిస్తున్నాయి.

ముఖద్వార అలంకరణ ముచ్చటేసింది
తెలంగాణ విద్యార్థి గడ్డమీది తేజ
ఇక్కడ ప్రతి ఒక్కచోట అలంకరణలు తనను కట్టిపడేస్తున్నాయని తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన ఎంబిఎ విద్యార్థి గడ్డమీది తేజ అనే యువకుడు తెలిపారు. ఆరంభంలోనే ఉన్న ముఖద్వారం, స్వాగత ద్వారాలు అందరిని ఆకట్టుకుంటున్నాయని వివరించారు. తాను అయోధ్యకు వచ్చి రెండు మూడు రోజులు అయిందని తెలిపారు. ఇప్పుడు చేపట్టిన విద్యుద్దీపాలంకరణలను చాలారోజులు కొనసాగిస్తామని ఇక్కడి పలు అతిధి గృహాలు, హోటళ్ల యాజమానులు తెలిపారు.

సాయంత్రం పదిలక్షల ప్రమిదలజ్యోతులు
అయోధ్యలో సోమవారం సాయంత్రం ప్రాణప్రతిష్ట శుభసంకేతంగా పదిలక్షల మట్టి ప్రమిదల జ్యోతులు వెలిగిస్తారు. దియాలుగా వెలుగొందే ఇవి అయోధ్యలో ప్రతి దీపావళి రాత్రి సరయూ తీరంలో వెలిగించడం ఆనవాయితి. ప్రధాన రామాలయం, రామ్ కి పిడి, కనక్‌భవన్, గుప్తార్ ఘాట్, సరయూ ఘాట్, లతామంగేష్కర్ చౌక్ వంటి పలు చోట్ల ఈ దీపాలు వెలిగిస్తారని అధికారులు తెలిపారు. సోమవారం ప్రతి ఇల్లు దివాలీ సంబరాల కాంతులతో విలసిల్లాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News