Tuesday, April 30, 2024

వరుణుడి ప్రకోపం

- Advertisement -
- Advertisement -

ఉరకలెత్తుతున్న గోదావరి, శ్రీశైలానికి భారీ వరద
భద్రాద్రి నిండింది.. ఓరుగల్లు మునిగింది…
వేలాది ఎకరాల్లో పంటలకు అపారనష్టం
సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
రానున్న 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం
హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Heavy water flood to Godavari River due to Rains

మన తెలంగాణ/హైదరాబాద్: వరుణుడి ప్రకోపం కొనసాగుతోంది. గోదావరి ఉరకలెత్తుతోంది. మన్యం వణుకుతోంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదలతో అత్యంత ప్రమాదకర స్థాయిలో గోదావరి భద్రాచలం వద్ద ప్రవహిస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 61.5 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ఏడేళ్ల తర్వాత ఈ స్థాయిలో నీరు చేరడం ఇదే తొలిసారి. వరద ప్రమాదం ఇంకా పెరిగే అవకాశం ఉందని సిడబ్లూసి అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు నాలుగు సార్లు 60 అడుగులు దాటిన గోదావరి. 1976, 1983, 2006, 2013 సంవత్సరాల్లో 60 అడుగులు దాటిన గోదావరి. రెండుసార్లు 70 అడుగులు దాటిన గోదావరి. 1986 ఆగస్టు 16న గోదావరి నీటిమట్టం 75.65 అడుగులు నమోదైంది. 1990 ఆగస్టు 20న గోదావరి నీటిమట్టం 70.8 అడుగులు నమోదైంది. ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉద్ధృతి పెరగడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి నీటిమట్టం పెరగడం వల్ల భద్రాచలంలోని కల్యాణకట్ట, స్నానఘట్టాలు, శ్మశానవాటిక దిగువన ఉన్న విస్టా కాంప్లెక్స్, కొత్తకాలనీ, ఎఎంసి కాలనీ వరదనీటిలో మునిగిపోయాయి. భద్రాద్రి రాముడి సన్నిధి వద్ద తూర్పు మెట్లకు వరద పోటెత్తింది. అన్నదాన సత్రం వరద నీటితో నిండిపోయింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన సుభాష్‌నగర్ కాలనీ, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, రామాలయం సెంటర్లలో వరద నీరు చేరింది. భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులన్నీ నీరు రావడం వల్ల ఏజెన్సీ మండలాలకు, విలీన మండలాలకు మధ్య పూర్తిగా సంబంధాలు నిలిచిపోయాయి. జిల్లాలోని పాల్వంచ వద్ద నాగారం వంతెనపై గండి పడటం వల్ల భద్రాచలం నుంచి ఖమ్మంకు ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపివేశారు. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం నుంచి ఇంకా భారీ ఎత్తున నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ప్రాంతమైన పేరూర్‌లో వరద నీరు ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఏజెన్సీ మండలాలైన చర్ల, దమ్ముగూడలో ముంపునకు గురైన కాలనీ ప్రజలను అధికారులు దగ్గర్లోని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరదనీరు పెరగడం వల్ల భద్రాచలం ఏజెన్సీ ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది.

రాష్ట్ర విభజనలో భద్రాచలం నుంచి విడిపోయిన చింతూరు, కూనవరం, వీఆర్.పురం మండలాల్లో రెండు రోజుల నుంచి విద్యుత్ నిలిపివేశారు. ఆయా మండలాలకు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వీఆర్.పురం మండలంలోని వడ్డిగూడెం చింతరేవుపల్లి, రాజుపేట, ధర్మతాళ్లగూడ, శ్రీరామగిరి, సీతంపేట, మలకలపల్లి, జీడిగొప్ప గ్రామాలు వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి. చింతూరు, కూనవరం మండలాల్లో చాలా గ్రామాలు వరదనీటి ప్రవాహంలోనే ఉన్నాయ. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సుమారు 100 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంటగంటకు గోదావరి ఉద్ధృతి పెరుగుతుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను కొన సాగిస్తున్నారు.
జలవిలయం నుంచి తేరుకోని ఓరుగల్లు
వరంగల్ నగరం జలవిలయం నుంచి తేరుకోలేదు. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. హన్మకొండలోని పలు రోడ్లు, కాలనీలు నీటిలోనే ఉండిపోయాయి. ఇంకా కేయూ వంద ఫీట్ల రోడ్‌లో వరద ప్రవాహం బీభత్సంగా కొనసాగుతోంది. ప్రధాన రోడ్లు దెబ్బతిన్నాయి. రాకపోకలు స్తంభించాయి. హన్మకొండలోని సమ్మయ్యనగర్, టీవీ టవర్ కాలనీ, హనుమాన్ నగర్, దీన్‌దయాల్ నగర్, పోచంకుంట.. తదితర కాలనీలు వరద నీటిలోనే ఉండిపోయాయి. గత నాలుగు రోజులు నుంచి వరదనీటిలోనే ఉండిపోయామమని బయటకు రావాలంటే భయమవుతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలు, కూరగాయలకు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ప్రతి వర్షాకాలం ఈ విధంగానే ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వరదప్రవాహం నుంచి కాపాడాలని కోరుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు నీరు చేరడం, చెట్లు విరిగిపడినందున నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వరంగల్ నగరంలోని హంటర్ రోడ్.. సాయినగర్ కాలనీ, సంతోషిమాత కాలనీ, సరస్వతినగర్, ములుగు రోడ్డు.. అండర్ రైల్వే గేటు, దేశాయిపేట, నజరత్‌పురం, వడ్డేపల్లి, కేయూ 100 ఫీట్ల రోడ్‌తో సహా మరికొన్ని ప్రాంతాలు వరద తాకిడికి గురయ్యాయి. డాక్టర్స్ కాలనీ, కాకతీయ కాలనీ, ప్రశాంత్‌నగర్, రాజాజీనగర్, లష్కర్ సింగారం, గోపాల్‌పూర్, విద్యానగర్, సమ్మయ్యనగర్, వాజ్‌పేయి నగర్, ఫారెస్టు కాలనీ, పోచమ్మకుంట, ప్రేమనగర్ కాలనీల్లో నయితే ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. డాబా, రెండు, మూడు అంతస్తుల్లో నివసించే వారు సైతం గ్రౌండ్‌ఫ్లోర్‌ను వదిలేసి పై అంతస్తులో ఉండాల్సిన స్థితి ఉంది. ఇటువంటి వారిని పడవల ద్వారా రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలాంటి స్థితి వరంగల్ చరిత్రలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు.

మణుగూరులో గోదావరి నది ఉగ్రరూపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. అన్నారం, కమలాపురం, కొండయిగూడెం గ్రామాల సమీపంలోకి వరద నీరు వచ్చి చేరింది. చిన్నరాయి గూడెంలోని కొన్ని కుటుంబాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మణుగూరు మండలంలోని కొండయిగూడెం శివాలయాన్ని గోదావరి నది చుట్టుముట్టింది. గుడిని ఆనుకొని నది ప్రవహిస్తోంది. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇంటెక్ వెల్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. పరిస్థితిని సీఈ బాలరాజ్, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. వరద ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రంలో అధికారులు దగ్గరుండి భోజన సదుపాయం కల్పించారు.
మహబూబాబాద్ జిల్లాలో పొంగుతున్న వాగులు.. రాకపోకలు బంద్..
గత ఐదు రోజులుగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. సోమవారం వానలు కాస్త తగ్గుముఖం పట్టినా.. వరద ప్రవాహం మాత్రం కొనసాగుతోంది. వాగులు, వంకలు ఉద్ధృతంగా పొంగిపొర్లుతున్నాయి. వాగులు, చెరువులన్నీ నిండుకుండలా మారాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. మహబూబాబాద్‌లో ప్రవహించే మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, బంధం వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు పొంగి పొర్లడం వల్ల నీరంతా రహదారులపైకి చేరుతోంది. కేసముద్రం, నెక్కొండ, గార్ల మండలం నుంచి రాంపురం, మద్దివంచల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.
ఆపరేషన్ థియేటర్‌లో ఊడిపడ్డ పైకప్పు పెచ్చులు
ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కానీ థియేటర్‌లోని కొంత సామాగ్రి స్వల్పగా ధ్వంసమైంది.
మత్తడి పోస్తున్న వాగులు.. మత్సకారుల ఆనందహేళ..
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని పెద్ద చెరువు మత్తడి పోస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పాలనురగలా పై నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు బారులు తీరుతున్నారు. చిన్నా, పెద్దా అంతా చేరి నీటిలో కేరింతలు కొడుతున్నారు. మహిళలు చీరకొంగుతో చేపలు పడుతూ మురిసిపోతున్నారు. అలుగుతో పాటు పై నుంచి కిందకు దూకుతున్న చేపలను మత్స కారులు వలలో ఒడిసిపడుతున్నారు. ఒక్కో చేప ఐదు నుంచి ఆరు కిలోల బరువు తూగుతుండటం వల్ల జాలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారి అలుగు పారుతుండటం వల్ల చేపలు పట్టడం సులువవుతోందని మత్సకారులు ఆనందపడుతున్నారు.
వరదలో టిఆర్‌ఎస్ నేత గల్లంతు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి టిఆర్‌ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్ వరద నీటిలో గల్లంతయ్యారు. సిద్ధిపేట జిల్లా శనిగరం, బద్దిపల్లి రోడ్డులోని మద్దికుంట వాగులో శ్రీనివాస్ నడుపుతోన్న ఇన్నోవా కొట్టుకుపోయింది. ఆదివారం రాత్రి శ్రీనివాస్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో మంథనికి బయల్దేరి వేళ్లారు. ఈ క్రమంలో మద్దికుంట వాగులో గల్లంతయ్యారు. వెంటనే గమనించిన స్థానికులు ముగ్గురని రక్షించగా.. కారుతో పాటు శ్రీనివాస్ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. ఈ ఘటనపై మంత్రి కెటిఆర్ స్పదించారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో సిద్ధిపేట ఆర్డీవో వాగు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
వరదలో చిక్కుకున్న కూలీలు.. సాయం చేసిన ఎంఎల్‌ఎ గండ్ర
భూపాలపల్లి జిల్లా గుడాడ్‌పల్లి మండలం ఎస్.యం. కొత్తపల్లిలోని వరదలో ఆరుగురు కూలీలు చిక్కుకున్నారు కొత్తగా నిర్మిస్తున్న వంతెనను వరద చుట్టుముట్టింది. గుడాడ్‌పల్లి-ఎస్‌ఎం కొత్తపల్లి మధ్య వంతెన నిర్మాణ పనుల్లో ఈ కూలీలు పాల్గొన్నారు. నిర్మాణ పనులు చేస్తుండగా ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. ఆ కారణంగా వంతెనపైన ఆరుగురు కూలీలు ఉండిపోయారు. ఎటూ పోలేకక ఫోన్‌లో పలువురికి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఎంఎల్‌ఎ గండ్ర వెంకటరమణారెడ్డి సంఘటనాస్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. వరంగల్ నుంచి ఒక బృందాన్ని పంపిస్తామని అధికారులు ఎంఎల్‌ఎ గండ్రకు హామీ ఇచ్చారు. వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని మంత్రి గండ్ర పేర్కొన్నారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఏఈ సాహసం
విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, వైర్లు కిందికి వేలాడుతున్నాయని ప్రజలు ఎన్నిసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కానీ విద్యుత్ శాఖకు చెందిన ఓ అధికారి సతీష్ తన ప్రాణాలకు తెగించి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఈతకొడుతూ అవతలి ఒడ్డుకు వెళ్లి కంబాలపల్లి సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చేశారు. అంధకారంలో ఉన్న గ్రామాలకు వెలుగును నింపారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో సుద్ధవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కంబాలపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు వెళ్లే లైన్ బ్రేక్ కావడంతో పలు గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. అయితే కంబాలపల్లి సబ్‌స్టేషన్‌కు వెళ్లాలంటే మధ్యలో ఉన్న సుద్ధ వాగును దాటాల్సిందే. వాగుదాటి అవతలికి పోయేందుకు టెక్నీషియన్లు సాహసించడం లేదు. దీంతో ఏఈ సాహసం చేశారు. సుద్ధవాగులో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లారు. మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఏఈ సతీష్ సాహసాన్ని గ్రామాల ప్రజలు అభినందించారు.
సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
సింగరేణి సంస్థకు కరోనా నాటి నుంచి కష్టాలు తప్పడం లేదు. పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన బొగ్గు నిల్వలతో ఇబ్బందుల పడుతున్న సింగరేణి సంస్థకు వర్షాల రూపంలో మరో ఇబ్బందులు ఎదురయ్యాయి. భద్రాద్రి కొత్తడూఎం జిల్లాలో భారీ వర్షం కారణంంగా గత ఐదు రోజులుగా ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయమేర్పడింది. ఇల్లందు నుంచి 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, కోయగూడెం ఉపరితల గని నుంచి 7 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. వర్షం కారణంగా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు ఉపరితల గనులు కావడం వల్ల ఓవర్ బర్డెన్ పనులు సైతం వర్షం కారణంగా నిలిచిపోయాయి. మరోవైపు కరోనా నాటి నుంచి బొగ్గు కొనుగోలు సరిగ్గా లేకపోవడం వల్ల భారీగా ఇల్లందు ఏరియాలో నిల్వలు పేరుకుపోయాయి. సోమవారం 1800 టన్నుల బొగ్గు ఎగుమతి మాత్రమే జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కొనసాగుతున్న వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 50045 క్యూసెక్కులు. ఔట్‌ఫ్లో 881 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టిఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1078.10 అడుగులు, 47.449 టీఎంసీలకు చేరింది.
మ్మడి ఖమ్మం జిల్లా వరద పరిస్థితిపై మంత్రి పువ్వాడ సమీక్ష
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై, వరద పరిస్థితిపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారిగా అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్న మంత్రి ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి పువ్వాడ.. సహాయ చర్యలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన నివేదిస్తున్నారు.

Heavy water flood to Godavari River due to Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News