Thursday, May 2, 2024

కొవాగ్జిన్ ప్రయోగానికి కోతుల వేట ఎలా సాగిందంటే ?

- Advertisement -
- Advertisement -
How monkeys were tracked for Covaxin trial
ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ బార్గవ గ్రంధంలో వెల్లడి

న్యూఢిల్లీ : స్వదేశీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ ప్రయోగం కోసం రిసాస్ మకాక్ తెగకు చెందిన ఇరవై కోతులను గాలించడంలో ఎన్ని శ్రమలు పడాల్సి వచ్చిందో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్ )డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తమ అనుభవాలు ‘గోయింగ్ వైరల్ : మేకింగ్ కొవాగ్జిన్ ది ఇన్‌సైడ్‌స్టోరీ ’అనే గ్రంథ రూపంలో వివరించారు. ఈ పుస్తకాన్ని రూపా ప్రచురించారు. నగరాల్లో సాధారణంగా వాటికి లభించే ఆహార అవసరాలు 2020 లో లాక్‌డౌన్ కారణంగా కరువు కావడంతో అవి మహారాష్ట్ర అడవుల్లో చాలా దూరంగా వెళ్లి పోయాయని, చివరకు నాగపూర్ సమీపాన వాటిని పట్టుకోగలిగామని ఆయన వివరించారు. కొవాగ్జిన్ విజయ గాధలో మానవులు ఒక్కరే హీరోలు కాదని, 20 వానరాలు కూడా ఉన్నాయన్న సంగతిని తప్పకుండా గుర్తు చేసుకోవాలన్నారు.

చిన్న జంతువుల్లోని యాంటీబాడీల నుంచి కూడా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయవచ్చని తమకు తెలిసిన వెంటనే మనుషులను పోలిన వానరాలు వంటి వాటిపై ప్రయోగాలకు సిద్దమయ్యామని, వానరాల శరీర, ఇమ్యూన్ వ్యవస్థలు మనుషులతో పోలి ఉంటుందని వివరించారు. వైద్య పరిశోధనలకు మానవేతర ఆదిమానవులుగా రిసస్ మకాక్ వానరాలే ఉత్తమమని ప్రపంచం మొత్తం మీద ఉపయోగిస్తుంటారని పేర్కొన్నారు. భారత దేశంలో వానరాలపై అధ్యయనం చేయడానికి అత్యంత ఆధునిక సౌకర్యాలున్న లేబొరేటరీ ఐసిఎంఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన జీవ భద్రత 4 వ స్థాయి లేబొరేటరీ ఒకటేనని వివరించారు. ప్రయోగశాలలో పెంచే రిసస్ మకాక్ వానరాలు దేశంలో లేనందున వాటిని ఎలా సంపాదించాలన్నది ఒక సవాలుగా తయారైందని చెప్పారు.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) పరిశోధకులు ఈ వానరాల కోసం దేశం లోని అన్ని జంతుప్రదర్శన శాలలను, సంస్థలను సంప్రదించినా సాధ్యం కాలేదని పేర్కొన్నారు. ఎన్‌ఐవి వద్ద వయసు మళ్లిన వానరాలు ప్రయోగాలకు పనికి రానందున ఇమ్యూనిటీ బాగా ఉన్న యువ వానరాలు అవసరమైందన్నారు. చివరకు నాగపూర్ అడవుల్లో చాలా దూరం వెళ్లి కనుక్కున్నామని చెప్పారు. ప్రయోగాలు ప్రారంభించే ముందు అవి సార్స్ కొవిడ్‌కు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చిందని, సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేసి పరీక్షలు చేశామని చెప్పారు. అత్యంత ఆధునిక బ్రాంకోస్కోప్, ఎక్స్‌రే మెషిన్ సాధనాలతో వైరస్ నియంత్రణ గదుల్లో 10 నుంచి 12 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ప్రయోగాలు చేసినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News