గాజులరామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగింపు
నేతలు, అధికారులు, రియల్టర్ల చెరలోని భూములకు విముక్తి
పేదల ఇళ్ల జోలికి వెళ్లలేదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
మన తెలంగాణ/సిటీ బ్యూరో/జగద్గిరిగుట్ట: కుత్బుల్లాపూర్ పరిధిలో బడా బాబుల కబ్జాలపై హైడ్రా ఆదివారం ఉక్కుపాదం మోపింది. గాజులరామారం రెవెన్యూ పరిధిలోని రూ. 15,000 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారం సర్వే నెం. 307తో పా టు పలు ఇతర సర్వే నంబర్లలో ఉన్న 317 ఎకరాలకు పైచిలుకు ప్రభుత్వ భూమిని కబ్జాల చెర నుం చి హైడ్రా విముక్తి కల్పించింది. ప్రభుత్వ భూమిలో వెలిసిన వెంచర్లను, లే ఔట్లను తొలగించింది. స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు ప్రభుత్వం ఇచ్చిన భూమి లో తిష్టవేసిన కబ్జాదారుల భరతం పట్టింది. ఇదే సర్వే నంబరు చుట్టూ కబ్జాలు జరగగా.. ప్రగతినగర్ వైపు ఏకంగా లే ఔట్లు, వెంచర్లను ఆక్రమణదారులు ఏర్పాటుచేశారు. ఇందులో రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది అధికారులు, డెవలపర్లు ఉన్నారు. 12 ఎకరాలలో వెలిసిన వెంచర్‌తో పాటు.. 20 ఎకరాల మేర ఉన్న లే ఔట్‌ను హైడ్రా తొలగించింది. అందులో తాత్కాలికంగా బడాబాబులు వేసిన షెడ్డులను, ప్రహరీ గోడలను కూల్చివేసింది. ఆక్రమణలను, తాత్కాలిక ఏర్పాట్లను తొలగించిన తర్వాత ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ హైడ్రా ఏర్పా టు చేసింది.
317 ఎకరాలు.. రూ. 15,000 కోట్లు..
గాజులరామారంలోని సర్వేనంబరు 307తో పా టు.. ఆ పక్కనే ఉన్న సర్వే నంబర్లలో 444 ఎకరాలకు పైగా ప్రభుత్వభూమి ఉంది. ఇందులో సర్వే నంబరు 307లోనే 317 ఎకరాల ప్రభుత్వ భూమి సుమారు రూ.15వేల కోట్ల విలువ చేస్తుది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు అప్పటి ప్రభుత్వం ఈ భూమిని అప్పగించింది. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం.. ఫైనాన్స్ కార్పోరేషన్‌కు చెందిన ఆస్తుల పంపకాల్లో జరిగిన జాప్యాన్ని ఆసరాగా తీసుకుని ఎవరికి వారు ఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ విషయమై హైడ్రాకు స్థానికుల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అం దాయి. ఆ ఫిర్యాదుల మేరకు సర్వే నంబర్ల వారీ గా.. విచారణను చేపట్టిన హైడ్రా… రెవెన్యూ అధికారులు, జీహెచ్‌ఎంసీ, ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో 5-6 సార్లు సమావేశం ఏర్పాటు చేసి పూ ర్తిస్థాయిలో విచారణ జరిపింది. 6 నెలలుకు పైగా ఆ భూమికి సంబంధించిన అన్ని విభాగాలు, ఫైనాన్స్ కార్పోరేషన్‌లతో పూర్తి స్థాయిలో విచారించిన అనంతరం ప్రభుత్వ భూమి అని హైడ్రా నిర్థారించుకుని చర్యలు తీసుకుంది.
పేదల పేరిట కబ్జాలు..
ప్రగతి నగర్ వైపు రాజకీయంలో పేరున్న బడాబాబులు ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు, లే ఔట్లు వేస్తే… గాజులరామారం సర్వే నంబర్లు 329/1, 342లలో ఉన్న ప్రభుత్వ భూమిని 60చ.గ.లు, 120చ.గ.ల ప్లాట్లుగా చేసి విడివిడిగా పేదలే లక్ష్యంగా పెట్టుకుని అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు. జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్ ఉన్న షేక్ అబిద్ ఏకంగా లక్ష్మి మురళి హుస్సేన్ పేరుమీద ప్లాట్ల విక్రయాలు జరిపారని ఫిర్యాదు చేసింది. బోడాసు శ్రీనివాస్ (డాన్ సీను), ఏసుబాబు, సయ్యద్‌గౌస్ బాబు, మనీష్, దేవా ఇలా ఎవరికి వారు ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి ప్లాట్లుగా అమ్మేసుకున్న వారందరికి హైడ్రా హెచ్చరించింది. స్థానిక రెవెన్యూ అధికారులు కూడా వీరికి సహకరించినట్టు కొన్ని విషయాలు స్పష్టంచేస్తున్నట్టు హైడ్రా అధికారుల సమాచారం. దీనిపై పూర్తి స్థాయిలో హైడ్రా విచారణ చేపట్టింది.
ఈపాటికే శాశ్వత నిర్మాణం చేసుకుని అందులోనే వాస్తవంగా యజమానులు నివాసం ఉంటున్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లలేదని మరోసారి కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు. రౌడీల, కబ్జాదారుల ఆధీనంలో ఉండి అమ్మకానికి సిద్ధంగా ప్రహరీలు నిర్మించి ఉన్న ప్లాట్లను మాత్రమే హైడ్రా తొలగించిందని కమిషనర్ స్పష్టంచేశారు. అక్కడ నివా సం ఉంటున్న పేదల ఇంటింటికీ వెళ్లిన హైడ్రా అధికారులు పదేపదే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిలో ప్లాట్లు చేసి తెరవెనుక నుండి అక్రమంగా విక్రయాలు జరిపే ప్లాన్ వేసిన వారిని, ఆప్లాన్‌లో భాగస్వాములైన వారిని, దౌర్జన్యంగా ఆక్రమించిన వారిని, నకిలీ పత్రాలు సృష్టించి విక్రయాలు జరిపినవారిని వదిలిపెట్టమని, పూర్తి విచారణ జరిపిన అనంతరం చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
Also Read: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు