Saturday, April 27, 2024

తల తిక్క బట్టికి మధిర తప్ప రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏమున్నాయో తెలియదు..

- Advertisement -
- Advertisement -
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై మండలి చైర్తన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్..

నల్గొండ : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాను, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఏమి చేయలేదంటూ, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై కేసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన విమర్శలు ఆయన అవగాహన రాయిత్య విమర్శలని , తిక్కల భట్టికి ఆయన మధిర నియోజకవర్గo తప్ప రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని ప్రాజెక్టులు, నదులు, వాగులు, వంకలు ఉన్నాయో తెలియదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం నల్గొండలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు పాదయాత్రలు చేసి అలసిపోయారని, భట్టికి కూడా అలుపు తప్ప మరేమీ మిగలదన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని, కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న డిండి ప్రాంతంలో రెండు పంటలకు నీరు ఇచ్చింది ఆయనకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఎన్నో సాంకేతిక సమస్యలతో నాలుగేళ్లుగా శ్రీశైలం నీటితో నిండుతోందన్నారు.

జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, 600 గ్రామాలకు తాగునీటి వసతితో పాటు హైదరాబాదులో భట్టి నివాసానికి అందుతున్న కృష్ణ జలాలు కూడా తాను మంజూరు చేయించానన్నారు. ఏఎంఆర్పీ ఎత్తిపోతల పథకం పుణ్యమేనని భట్టి గ్రహించాలన్నారు. ఆయన పాదయాత్ర చేస్తున్న రోడ్లు కేసీఆర్ ప్రభుత్వ హాయాంలో అభివృద్ధి చేసినవేనని, జడ్చర్ల–-కల్వకుర్తి, సిరి వెంచ-సాగర్ రహదారుల విస్తరణ కూడా నా కృషితోనే జరిగాయన్నారు. కాంగ్రెస్ అసంపూర్తిగా వదిలేసిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి డిండి ప్రాజెక్టు కింద రెండు పంటలకు నిరందిస్తున్నామని, మా కృషితో వచ్చిన రోడ్ల పైన, సాగు కాబడిన పంటల వెంట భట్టి పాదయాత్ర సాగుతుందన్నారు. నడిచే దారిలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం, తాను చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే చూసి చూడనట్లుగా భట్టి రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. పాతికేళ్లుగా పంచాయతీ వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ దాకా, మండలి చైర్మన్ దాకా ప్రజా జీవితంలో ఉన్న తాను నిత్యం ప్రజలతో మమేకమై, ప్రజా సమస్యల పరిష్కారానికి , జిల్లా ప్రగతికి నిరంతరాయంగా పని చేస్తున్నానన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని భట్టి విమర్శించడం అర్ధరహితమన్నారు. టీబీఎం మిషన్ల మరమ్మతులు, టన్నెల్ లో వరద నీరు, కేంద్ర అటవీ పర్యావరణ శాఖల షరతుల మధ్య సాగాల్సిన పనులతో, సాంకేతిక ఇబ్బందులతో పనులు ఆలస్యం అయితే ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డురమన్నారు. సీఎం కేసీఆర్ సమీక్ష చేసి సొరంగం ప్రాజెక్టు గుత్తేదారులకు వందల కోట్ల అడ్వాన్స్ నిధులు ఇచ్చి పనులు చేయించారని, ఇప్పటికే 20 కిలోమీటర్ల సొరంగం పూర్తికాగా మరో తొమ్మిది కిలోమీటర్లు పెండింగ్ లో ఉందన్నారు. రెండో టన్నెల్ లో 7.30 కిలోమీటర్లు పూర్తవడంతో తుది దశకు చేరుకుందన్నారు . నక్కల గండి ప్రాజెక్టు గేట్లు బిగింపు ఒకటే మిగిలిందన్నారు. ప్రాజెక్ట్లు, రోడ్ల భూసేకరణ సంబంధించి 2013 భూసేకరణ కంటే మెరుగైన చట్టం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చి నిర్వాసితులకు పరిహారం అందిస్తుందన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 6,190 కోట్లతో డిండి ఎత్తిపోతల చేపట్టి రిజర్వాయర్లు, కాలువల నిర్మాణంకు ఇప్పటికే 2,221 కోట్ల తో పనులు జరిపించారన్నారు. కాంగ్రెస్ మాత్రం ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు పెట్టి స్టేలు తెచ్చి పనులకు అడ్డం పడిందన్నారు. కాంగ్రెస్ అసంపూర్తిగా వదిలేసిన కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ పనులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు అందిస్తుందన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పాలనలో నామామాత్రంగా మిగిలిన ఎస్సారెస్పీ రెండో దశ కాలువలకు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానీదేనన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి వనరుల అభివృద్ధికి చేపట్టిన చర్యలతో ఉమ్మడి జిల్లాలో గత యాసంగిలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి, నేడు 6.76 లక్షల టన్నులకు చేరిందన్నారు. ఉమ్మడి జిల్లాకు మూడు మెడికల్ కళాశాలలు, దేవరకొండకు వంద పడకల ఆసుపత్రి, సాగర్ ఏరియా ఆసుపత్రి విస్తరణ, మిర్యాలగూడ కు 250 పడకల ఆసుపత్రి కేసీఆర్ పాలనలో వచ్చాయన్నారు. 24 గంటల విద్యుత్తు అమలవుతుందన్నారు. మరి కాంగ్రెస్ పాలనలో అవన్నీ ఎందుకు చేయలేదో భట్టి సమాధానం చెప్పాలన్నారు. అభివృద్ధి ఎలా చేయాలో సీఎం కేసీఆర్ వద్ద కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాలన్నారు. వైఎస్సార్ మాదిరిగా పంచే, అంగీ వేసుకొని పగటివేషగాడిగా భట్టి పాదయాత్ర చేసినంత మాత్రాన వైయస్సార్ అయిపోడని గుత్తా ఏద్దేవా చేశారు.

అసలు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే సీఎం ఎవరో తెలియదని, దమ్ముంటే ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. జిల్లా కాంగ్రెస్ లోనే ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారన్నారు. భట్టి పాదయాత్రలోనే కాంగ్రెస్ వర్గాలు తన్నుకున్నాయన్నారు. పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చించిన విస్తరి అవుతుందన్నారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలన శ్రీరామరక్ష అన్నారు. రాష్ట్రం మత ఘర్షణలు, అస్థిర, అవినీతి లేకుండా ప్రశాంతంగా అభివృద్ధి చెందాలంటే బిజెపి, కాంగ్రెస్ లను అధికారానికి దూరం పెట్టాలని, వచ్చే ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News