Sunday, April 28, 2024

నిబంధనలు బేఖాతర్!

- Advertisement -
- Advertisement -

illegal-Buildings

111 జిఓ పరిధిలో యధేచ్ఛగా అక్రమ కట్టడాలు
ప్రభుత్వానికి రెవెన్యూ అధికారుల నివేదిక

హైదరాబాద్: 111 జిఓ పరిధిలో భూ ములు, ఇళ్లను కొనుగోళ్లు చేయాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూతోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 111జిఓ పరిధిలోని పలు ప్రాంతాల్లో అసలు నిర్మాణాలు చేపట్టరాదన్న ప్ర భుత్వ ఉత్తర్వులను కొంతమంది బిల్డర్లు యథేచ్ఛగా ఉల్లఘిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఔటర్‌కు దగ్గరుందని, త్వరలో మెట్రో నిర్మాణం జరగనుందని కొం దరు రియల్ వ్యాపారులు అనుమతిలేనిచోట ఇళ్లను, ఇళ్ల స్థలాలను అక్రమంగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము కొన్న ప్రాపర్టీ బయోకన్జర్వేషన్ జోన్ పరిధిలోకి వస్తుందని ప్రస్తుతం ఈ జిఓ పరిధి లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని తెలుసుకున్న కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎఫ్‌టిఎల్ 10 కి.మీ. చుట్టూ నిర్మాణాలకు అనుమతించవద్దని…

నగరంలోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను కాపాడుకోవడంతో పాటు నీటి పరివాహక ప్రాంతాలను పరీరక్షించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలోని 84 గ్రామాలను జీవ పరిరక్షణ ప్రాంతం (బయో కన్జర్వేషన్ జోన్) పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం 2006 మార్చిలో ప్రభుత్వం జీఓ నంబర్ 111ను అమల్లోకి తీసుకొచ్చింది. జీఓ పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు, లే-అవుట్లు చేయకూడదని స్పష్టం చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం 90 శాతం భూమిని బయో కన్జర్వేషన్ జోన్ కిందకు ప్రభుత్వం తీసుకొచ్చింది. మిగిలిన 10 శాతంలో నిర్మాణాలుండాలని ఆ జీఓలో పేర్కొంది. రెండు చెరువుల్లోని ఫుల్ ట్యాం క్ లెవల్ (ఎఫ్‌టిఎల్) 10 కి.మీ. చుట్టూ కాలుష్య పరిశ్రమలు, హోటళ్లు, నివాస, వాణిజ్య సముదాయాలు తదితర నిర్మాణాలను అనుమతించవద్దని ఆ జీఓలో ప్రభు త్వం పేర్కొంది. 84 గ్రామాల్లోని 90 శాతం భూమి రిక్రియేషనల్, కన్వర్జేషన్ కింద ఉంటుంది. మిగిలిన 10 శాతం స్థలంలో గ్రౌండ్+2 అంతస్తుల వరకే అనుమతి ఇవ్వాలన్న నిబంధనను ఈ జీఓలో పొందుపరిచారు.

ఇప్పటికే 10 శాతం భూమిలో కట్టడాలు పూర్తి

అందులో భాగంగానే మాస్టర్ ప్లాన్ ప్రకారం జీఓ పరిధిలోని మొత్తం స్థలంలో 10 శాతం భూమిలో నిర్మాణాలకు అనుమతిచ్చారు. ఇప్పటికే 10 శాతం భూమిలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ పట్టణం, 84 గ్రామ కంఠాలు, ఇతర అభివృద్ధి పనులకు ఈ స్థలాన్ని కేటాయించారు. కానీ, రియల్టర్లు మాత్రం 111 జీఓ పరిధిలోని ప్రతి లే-అవుట్‌లో 10 శాతం స్థలాన్ని నివాస సముదాయాలకు కేటాయించుకోవచ్చని కొనుగోలుదారులను తప్పుదారి పట్టిస్తూ అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దశాబ్దకాలంగా వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు

దశాబ్దకాలంగా 111 జీఓ పరిధిలో సుమారు వేల సం ఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశాయని అధికారులు పేర్కొంటున్నారు. చాలావరకు వీటికి అనుమతులు లేవని, రియల్టర్లు అలాగే నిర్మాణాలు చేపట్టారని అధికారులు పేర్కొంటున్నారు. 111 జీఓ పరీవాహక ప్రాం తాల్లో చాలావరకు ఫాంహౌస్‌లు, రిసార్టులు వెలిశాయి. ఈ అక్రమ నిర్మాణాలను కొనుగోలు చేసిన వారిలో సామాన్యులే కాదు ఉన్నత ఉద్యోగులు, ఎన్‌ఆర్‌ఐలు కూడా ఉన్నారు. ఇక్కడ ఆకాశహర్మ్యాలు నిర్మించడానికే అనుమతి లేదు. ఎఫ్‌ఎస్‌ఐ (బిల్టప్ స్పేస్ ఏరియా), పరీవాహక ప్రాంతం (క్యాచ్‌మెంట్ ఏరియా) 1:0.5 నిష్పత్తిలో ఉండాలి. కానీ ఇక్కడ చాలా నిర్మాణాలు జీ+3 అం తస్తులు దాటిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ కొనుగోళ్లు చేసిన పలువురు రెవెన్యూ అధికారులతో పాటు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.

111 జీఓపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని…

ఎఫ్‌టిఎల్ 10కి.మీ. చుట్టూ ఉన్న పలు గ్రామాల్లో ఎలాంటి కట్టడాలు నిర్మించవద్దని ఆదేశాలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అక్రమ కట్టడాలపై దృష్టి సారించిన అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. త్వరలో ప్రభుత్వం కూడా 111 జీఓపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టుగా సమాచారం. అయితే 111 జిఓ అమల్లో ఉన్న గామాల్లో, మండలాల్లో ప్లాట్‌ను, ఇళ్లను కొనుగోలు చేసే సందర్భాల్లో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

illegal Buildings and Layouts in GO 111 limits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News