Friday, May 10, 2024

జడ్డూ రికార్డు సెంచరీ.. భారత్ 574/8 డిక్లెర్డ్

- Advertisement -
- Advertisement -

జడ్డూ రికార్డు సెంచరీ
తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు
574/8 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లెర్డ్
నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
మొహలీ: శ్రీలంకతో సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో భారత అన్ని విభాగాల్లో రాణిస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా శనివారం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 574/8 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లెర్డ్ చేసింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక జట్టును ఇటు పేసర్లు, అటు స్పిన్నర్లు ఓ ఆట ఆడుకున్నారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే (28), లహీరు తిరుమణ్ణే (17), అంజెలో మ్యాథ్యూస్ (22) మూడు కీలక వికెట్లను వెంటవెంటనే కోల్పోయి 446 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.

జడేజా, అశ్విన్ కీలక భాగస్వామ్యం..
అంతకుముందు 357/6 పరుగులతో రెండోరోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆల్‌రౌండర్లు జడేజా, అశ్విన్ లంక బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. మరోవైపు ఈ జంటను విడదేసేందుకు లంక బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ దశలో అశ్విన్ (61) పరుగుల వద్ద లక్మల్ బౌలింగ్‌లో డిక్వెలాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జయంత్ యాదవ్ (2) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మ ద్ షమీ (20, నాటౌట్)తో కలిసి జడేజా (175, నాటౌట్) డబుల్ సెంచరీకి చేరువలో ఉండగానే టీమిండియా సెకండ్ సెషన్ టీ బ్రేక్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రవీంద్ర జడేజా డబుల్ చేసే అవ కాశం చేజారినట్లయింది. శ్రీలంక బౌలర్లలో లక్మల్, ఫెర్నాండో, ఎంబుల్దేని యా రెండేసి వికెట్లు పడగొట్టగా, కుమార, డిసిల్వా ఒక్కో వికెట్ తీశారు.

రోహిత్, ద్రవిడ్‌పై అభిమానుల ఆగ్రహం
ఇదిలాఉంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాటిగా ఆడుతున్న రవీంద్ర మరో 25 పరుగులు చేస్తే డబుల్ సెంచరీ తన పడేదని, కావాలనే ఇలా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారని మండిపడ్డారు. భారత్‌కు ఇంకా చాలా సమయం ఉందని, ఇది రెండో రోజేనని, అందులోనూ సెకండ్ సెషన్ మాత్రమేనంటూ సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే కొందరు అభిమానులు మాత్రం ఇదంతా కోచ్ ద్రవిడ్ కావాలనే చేశారని ఆరోపించారు. గతంలోనూ (2004) పాకిస్తాన్ వేదికగా ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో సచిన్ టెండూల్కర్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు ద్రవిడ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారంటూ అప్పటి ఫొటోలను షేర్ చేశారు. నాడు జట్టుకు ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.

35ఏళ్ల రికార్డు బ్రేక్
ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 35 ఏళ్ల పాటు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో (175, నాటౌట్) సెంచరీ చేయడంతో ఈ రికార్డును బద్దలు కొట్టినట్లయింది. గతంలో కపిల్ దేవ్ ఏడో స్థానంలో దిగి 163 పరుగులు చేశాడు. అదే ఇప్పటివరకు కొనసాగగా, దీనిని జడేజా 35ఏళ్ల తర్వాత తిరగరాశాడు.

IND vs SL 1st Test: India declared at 574/8

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News