Friday, May 3, 2024

కుర్రాళ్లు కుమ్మేశారు !

- Advertisement -
- Advertisement -
under-19-world-cup
అండర్19 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్,  దాయాది పాక్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం

పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్ 19 వరల్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో అద్భుతంగా రాణించి అలవోకగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. పాక్ నిర్దేశించిన 173 పరుగుల లక్షాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనాలు చెలరేగి పోవడంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయం సాధించి వరసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది.

ఇప్పటికే నాలుగుసార్లు ఈ టైటిల్‌ను సాధించిన భారత్ ఆదివారం (ఈ నెల 9న)ఫైనల్లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఇదే మైదానంలోనే తలపడుతుంది. జైస్వాల్ సెంచరీతో కదం తొక్కగా, అతనికి చక్కటి తోడ్పాటు అందించిన సక్సేనా అర్ధసెంచరీతో రాణించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు పాక్ బౌలర్లు చెమటోడ్చినా ఫలితం లేకపోయింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఇంకా 14.4 ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. దివ్యాంశ్ 99 బంతుల్లో 6 ఫోర్లతో 59 పరుగులు చేశాడు. 99 పరుగుల వద్ద మిడ్‌వికెట్ మీదుగా లాంగాన్‌లోకి సిక్స్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించిన జైస్వాల్ భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన జైస్వాల్ 113 బంతులు ఎదుర్కొని నాలుగు సిక్స్‌లు, 8 బౌండరీలు బాదాడు.

భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన పాక్

అంతకు ముందు టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న పాక్ భారత బౌలర్ల ధాటికి కుదేలై 43.1 ఓవరల్లో 172 పరుగులకే ఆలౌటైంది. ఆది నుంచే టీమిండియా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టుదిట్టమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి జట్టును ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా సుశాంత్ మిశ్రా 8.1 ఓవర్లు బౌల్ చేసి కేవలం 28 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. భారత యువ బౌలర్ల ధాటికి పాక్ జట్టులో ముగ్గురు బ్యాట్స్‌మెన్ తప్ప మిగతావారెవరూ రెండంకెల స్కోరు నమోదు చేయలేకపోయారు.

ఇది చూస్తే భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారనేది అర్థమవుతుంది. పాక్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ హైదర్ అలీ, కెప్టెన్ రోహైల్ నాజిర్‌లు అర్థ శతకాలతో రాణించడంతో పాక్ జట్టు ఆ మాత్రం స్కోరైనాసాధించగలిగింది. వీరిద్దరు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాగా భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా 3 వికెట్లతో రాణించగా , రవి బిష్ణోయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు, అంకోల్కెర్, యశస్వి జైస్వాల్‌లు ఒక్కో వికెట్ తీశారు.
కాగా పాక్‌పై అది కూడా ప్రపంచకప్ సెమీఫైనల్లో సెంచరీ చేయడం మాటల్లో చెప్పలేనంత స్పెషల్ అని ‘మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్’గా ఎంపికైన జైస్వాల్ అన్నాడు.

india beat pakistan by 10 wickets in under 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News