Sunday, April 28, 2024

క్లీన్ స్వీప్‌పై టీమిండియా కన్ను

- Advertisement -
- Advertisement -

పరువు కోసం అఫ్గాన్
నేడు చివరి టి20

బెంగళూరు: అఫ్గానిస్థాన్‌తో బుధవారం బెంగళూరు వేదికగా జరిగే మూడో, చివరి టి20 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్‌స్వీప్ సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన అఫ్గాన్ కనీసం ఆఖరి పోటీలోనైనా గెలిచి కాస్తయినా పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. అయితే వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాను ఓడించడం అఫ్గాన్‌కు శక్తికి మించిన పనిగానే చెప్పాలి.

శివమ్ దూబె అద్భుత ఆటతో అదరగొడుతున్నాడు. రెండు మ్యాచుల్లోనూ జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూబె ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్ కూడా ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసి వచ్చే అంశమే. అయితే రోహిత్ శర్మ వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం ఆందోళన కలిగించే అంశమే. ఈ ఒక్క లోపాన్ని సరిదిద్దుకుంటే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగే ఉండదు.

రింకు సింగ్, కోహ్లి, అక్షర్ పటేల్, జితేష్ శర్మ తదితరులతో భారత బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక అక్షర్, అర్ష్‌దీప్, ముకేశ్ కుమార్, సుందర్, దూబె, బిష్ణోయ్‌తో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మరోవైపు అఫ్గాన్ రెండు మ్యాచుల్లోనూ బాగానే ఆడినా విజయం మాత్రం సాధించలేక పోయింది. ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా తదితరులు రెండో టి20లో విఫలమయ్యారు. గుల్బాదిన్ ఒక్కడే కాస్త పోరాటం చేశాడు.

ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాక బౌలర్లు కూడా గాడిలో పడక తప్పదు. కీలక సమయంలో బౌలర్లు ఒత్తిడికి గురై భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. జట్టు పరాజయాలకు ఇది కూడా ప్రధాన కారణంగా చెప్పాలి. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా ఆటగాళ్లు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News