Thursday, May 2, 2024

ఆక్రమణలకు ప్రయత్నిస్తే కాల్పులే: చైనాకు భారత్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

ఎల్‌ఎసి వద్ద ఆక్రమణలకు ప్రయత్నిస్తే మా సైన్యం కాల్పులు జరుపుతుంది
బలగాల ఉపసంహరణ మీవైపు నుంచే ప్రారంభించాలి -చైనాకు భారత్ హెచ్చరిక

న్యూఢిల్లీః వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వద్ద ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా-భారత్ మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో తాజాగా జరిగిన మిలిటరీస్థాయి చర్చలపై అధికార వర్గాలు పలు అంశాల్ని వెల్లడించాయి. చైనా ఓవైపు శాంతి వచనాలు పలుకుతూనే ఎల్‌ఎసి వద్ద పెద్ద సంఖ్యలో తమ బలగాలను మోహరించడం, గాలిలోకి కాల్పులు జరపడంలాంటి సంఘటనలతో బెదిరింపులకు పాల్పడటం వెనుక కఠినమైన వ్యూహం ఉన్నదని, దానిని అంతే కఠినంగా తిప్పి కొట్టామని అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎచైనా సైన్యం) మా శిబిరాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే మా బలగాలు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరుపుతాయని భారత్ తన తాజా చర్చల్లో స్పష్టం చేసింది. ఎల్‌ఎసి వద్ద ఇకముందు కర్రలు, రాళ్లతో ఆటవిక పోరాటాలు ఉండబోవని చైనాను గట్టిగా హెచ్చరించింది. బలగాల ఉపసంహరణపై తాజాగా మాల్డోలో(ఎల్‌ఎసి వద్ద చైనా భూభాగం) జరిగిన మిలిటరీస్థాయి చర్చల్లో చైనా చేసిన వ్యూహాత్మక ప్రతిపాదనను, అంతే ప్రతివ్యూహంతో భారత్ తిరస్కరించింది. పాంగాంగ్ సరస్సు వద్ద భారత్‌కు పట్టున్న దక్షిణ రేవు నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభిద్దామన్న చైనా ప్రతిపాదనను తిరస్కరించింది. ఉద్రిక్తత నెలకొన్న అన్ని ప్రాంతాల(ఎ టు జెడ్) నుంచి ఏకకాలంలో బలగాల ఉపసంహరణ చేపడ్దామని భారత్ ప్రతిపాదించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాస్‌పాంగ్ మైదాన ప్రాంతం నుంచి దక్షిణాన పాంగాంగ్ సరస్సు వరకు బలగాల ఉపసంహరణ జరగాల్సిందేనని స్పష్టం చేసింది. చైనా ఎంపిక చేసిన ప్రాంతాలకే బలగాల ఉపసంహరణ జరగాలన్న దుందుడుకు ప్రతిపాదనను అంతే నిర్దంద్వంగా భారత్ తిరస్కరించింది.
జూన్ 15న గల్వాన్ లోయ వద్ద జరిగిన బాహాబాహీ పోరులో ఇరు వైపులా పలువురు సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చైనాతో చర్చల్లో భారత్ తరఫున దౌత్య నిపుణులు దృఢంగా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాల క్రితం జరిగిన ఒప్పందాను ఉల్లంఘిస్తూ ఎల్‌ఎసిలోని వివాదాస్పద ప్రాంతాల్లోకి చైనా మొదట తన బలగాలను పంపింది. బలగాల ఉపసంహరణపై చర్చల్లో మాత్రం భారత్‌కు పట్టున్న ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడి నుంచే ప్రారంభించాలంటూ పీటముడి వేస్తోంది. దీంతో, చర్చల్లో ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదని అర్థమవుతోంది. చైనా దుందుడుకు చర్యల వల్లే ఎల్‌ఎసి వద్ద ఇరు దేశాల సైన్యం మధ్య ఉద్రిక్తతలు తలెత్తి ప్రతిష్టంభన నెలకొన్నదని భారత్ స్పష్టం చేసింది. బలగాల ఉపసంహరణ విషయంలో చైనా ముందుగా చర్యలు ప్రారంభించాలని భారత్ తేల్చి చెప్పింది. అయితే, తాజాగా జరిగిన ఆరో దఫా మిలిటరీస్థాయి చర్చల్లో ఇరుపక్షాలు ఓ అంగీకారానికి రాలేకపోయినా, వివాదాస్పద అంశాలపై త్వరలోనే మరోసారి చర్చించుకునేందుకు సుముఖత చూపాయి. మరోవైపు ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన సంప్రదింపులు, సహకారంపై కార్యాచరణ యంత్రాంగం(డబ్లూఎంసిసి) త్వరలోనే సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

India warns to China over border dispute

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News