Sunday, April 28, 2024

అదరగొట్టిన గబ్బర్ సేన

- Advertisement -
- Advertisement -

 India win by 7 wickets in 1st ODI against SL

కొలంబో: శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 36.4 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ సమష్టి బ్యాటింగ్‌తో జట్టు ఘన విజయం సాధించి పెట్టారు.
పృథ్వీషా దూకుడు..
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీషాలు శుభారంభం అందించారు. పృథ్వీషా మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు లంక బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయిన షా వరుస బౌండరీలతో అలరించాడు. దూకుడుగా ఆడుతూ 24 బంతుల్లోనే 9 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. అయితే జోరుమీదున్న షాను ధనంజయ పెవిలియన్ బాట పట్టించాడు. అప్పటికే పృథ్వీషా 5.3 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించాడు.
ఇషాన్ విధ్వంసం..
తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. తొలి బంతి నుంచే దూకుడును ప్రదర్శించిన ఇషాన్ పరుగుల వరద పారించాడు. అతనికి కెప్టెన్ ధావన్ అండగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసిన ఇషాన్ స్కోరును పరిగెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు లంక బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో కనువిందు చేశాడు. ధాటిగా ఆడిన కిషన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు.
ధావన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్..
మరోవైపు ధావన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టుకు విజయం సాధించి పెట్టాడు. ఇషాన్ ఔటైన తర్వాత జట్టును గెలిపించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. అతనికి మనీష్ పాండే (26), సూర్యకుమార్ యాదవ్ 31 (నాటౌట్) అండగా నిలిచారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన ధావన్ 95 బంతుల్లో ఆరు ఫోర్లు, సిక్స్‌తో 86 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. ఇక తొలి మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ ఐదు ఫోర్లతో అజేయంగా 31 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు.
సత్తా చాటిన బౌలర్లు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్య, యజువేంద్ర చాహల్‌లు అద్భుత బౌలింగ్‌తో అలరించారు. కృనాల్ కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి లంక బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. అద్భుత ప్రతిభను కనబరిచిన కృనాల్ 10 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ పడగొట్టాడు. చాహల్, కుల్దీప్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ఇక లంక బ్యాట్స్‌మెన్‌లలో కరుణరత్నె 43 (నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతావారిలో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (33), అసలంకా (38), కెప్టెన్ షనకా (39) మాత్రమే కాస్త రాణించారు. చివర్లో కరుణరత్నె రాణించడంతో లంక ఆ మాత్రమైన స్కోరును సాధించింది.

 India win by 7 wickets in 1st ODI against SL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News