Sunday, April 28, 2024

అజేయ భారతం

- Advertisement -
- Advertisement -

టీమిండియా చేతిలో పాక్ చిత్తు
ప్రపంచకప్‌లో దాయాదిపై 8వ గెలుపు
హ్యాట్రిక్ విజయంతో అగ్రస్థానంలో రోహిత్ సేన

ప్రపంచకప్‌లో భాగంగా శనివారం దాయాది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌కు పాకిస్థాన్‌పై ఇది 8వ విజయం కావడం విశేషం. ప్రపంచకప్‌లో పాక్‌పై ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లోనూ భారతే విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 30.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (86), శ్రేయస్ అయ్యర్ 53 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా మూడో విజయం. ఈ గెలుపుతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

అహ్మదాబాద్ : సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్ వరుస విజయాలతో అదరగొడుతోంది. శనివారం ఇక్కడి నరేం ద్ర మోడీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికె ట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయం సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అంతేగాక ప్రపంచకప్‌లో దాయాది పాకిస్థాన్‌పై తన అజేయ రికార్డును భారత్ మళ్లీ కాపాడుకుంది. వన్డే వరల్డ్‌కప్ లో పాకిస్థాన్‌పై 8వ విజయాన్ని టీమిండియా నమోదు చేసింది. ఈ క్రమంలో శ్రీలంకపై పాకిస్థాన్‌కు ఉన్న 8 విజయాల అజేయ రికార్డును భారత్ సమం చేసింది. అహ్మదాబాద్‌లో క్రిక్కిరిసి ప్రేక్షకుల సమక్షంలో జరిగిన మ్యాచ్‌లో దాయాది పాక్‌పై భారత్ ఏకపక్ష విజ యం సాధించింది. భారత్ ధాటికి ఎదురునిలువలేక పాక్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 30.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
రోహిత్ జోరు..
కెప్టెన్ రోహిత్ శర్మ తన జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన రోహిత్ స్కోరును పరిగెత్తించాడు మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (16) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. గిల్ ఔటైనా రోహిత్ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి అండతో స్కోరును పరిగెత్తించాడు. కోహ్లి 3 ఫోర్లతో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ అండతో రోహిత్ మరింత చెలరేగి పోయాడు. పాక్ బౌలర్లను హడలెత్తించిన రోహిత్ 63 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మరో 6 సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 53 పరుగులు సాధించాడు. కెఎల్ రాహుల్ 19 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో భారత్ మరో 19.3 ఓవర్లు మిగిలివుండగానే ఘన విజయాన్ని అందుకుంది.
శుభారంభం లభించినా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫిక్, ఇమామ్ ఉల్ హక్ శుభారంభం అందించారు. ఇద్దరు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. అయితే 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన షఫిక్‌ను సిరాజ్ వెనక్కి పంపాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజమ్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. ధాటిగా ఆడిన హక్ ఆరు ఫోర్లతో 36 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట కీపర్ మహ్మద్ రిజ్వాన్ కూడా మెరుగైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఇటు బాబర్ అటు రిజ్వాన్ కుదురుగా ఆడడంతో పాకిస్థాన్ కోలుకుంది. వీరి అద్భుత సమన్వంతో ఆడుతూ జట్టును కష్టాల్లో నుంచి గట్టెక్కించారు. కానీ కీలక సమయంలో బాబర్ (50), రిజ్వాన్ (49)లు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత భారత బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. ఒక దశలో 154/2తో పటిష్టస్థితిలో కనిపించిన పాక్ చివరి 8 వికెట్లను 37 పరుగుల తేడాతో కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లలో బుమ్రా 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. సిరాజ్, హార్దిక్, కుల్దీప్, జడేజాలకు కూడా రెండేసి వికెట్లు లభించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News