Sunday, April 28, 2024

రైతు బీమాతో రైతు కుటుంబాలకు భరోసా

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: దేశానికి అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ రైతుబంధు పథకం తీసుకొచ్చారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం బాలపెల్లి గ్రామానికి చెందిన రైతు గుంటి చిన్న మల్లయ్య ఇటీవల మరణించగా శుక్రవారం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల రైతు బీమా ప్రోసిడింగ్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతు దేశానికి వెన్నెముక అని, ఏదేని కారణం చేత రైతు చనిపోతే ఆ రైతుపై ఆధారపడ్డ కుటుంబాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం తీసుకొచ్చిందన్నారు. రైతుల పేరిట ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తోందని, రైతు మరణించిన వారం రోజుల లోపు బీమా పరిహారాన్ని నామిని ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు. రైతును రాజుగా చేయాలనే లక్షంతో సిఎం కెసిఆర్ ముందుకు సాగుతున్నారన్నారు.

సాగు నీటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు అభివృద్ది చేయడంతో పాటు వేలాది కోట్లు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మించడం జరిగిందన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు పథకం ద్వారా పంట పెట్టుబడి సాయం అందిస్తున్నామని అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని చెత్తులెత్తేస్తే, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తానని సిఎం కెసిఆర్ ఊరురా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు.

వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలకు నీరందించేందుకు రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పిలోకి నీటిని తరలించే ఏర్పాట్లు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. రైతుల క్షేమాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలు తీసుకొస్తుంటే, రైతన్నను ఆగం చేయాలనే దుర్బుద్దితో కాంగ్రెస్ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారన్నారు.

కాంగ్రెస్ హాయాంలో రైతులు అరిగోస పడ్డారని, 40 ఏళ్లు పాలించినప్పుడే రైతాంగానికి ఏమి చేయలేని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది చేస్తాం… ఇది చేస్తామంటూ నమ్మించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎన్ని కుయక్తులు చేసినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరని, రానున్న ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారెడ్డి, గుంటి రవి, గంగమల్లయ్య, గంగరాజం, శశి, మహేశ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News