Sunday, April 28, 2024

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ఈ తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందిందని, తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ది సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. సిఎం సహాయ నిధి ద్వారా పట్టణంలోని తస్లీమా సుల్తానాకు రూ.1.25 లక్షలు, ఎరవేని రాజవ్వకు రూ.22 వేలు, చందా జమునకు రూ.18 వేలు, కడార్ల రాజేశ్వరికి రూ.22 వేలు మంజూరు కాగా, ఆర్థిక సాయం చెక్కులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ శుక్రవారం లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఇంటికి లబ్ది చేకూర్చుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ వినూత్న పథకాలు తీసుకొచ్చి దేశమే అబ్బురపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డు ప్రకటించినా అది తెలంగాణ రాష్ట్రానికే దక్కుతోందని, ఇప్పటికే పదుల సంఖ్యలో అవార్డులు దక్కించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు సత్ఫలితాలనిస్తుండగా, ఆయా పథకాలను తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వచ్చి పథకాలను పరిశీలించి వెళ్తున్నారన్నారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమాన్ని దేశమంతా మెచ్చుకుంటుండగా ఇక్కడి ప్రతిపక్ష నేతలు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎవరెన్ని కుయుక్తులు చేసినా రాష్ట్రంలో తిరిగి రానున్నది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంబాల రాంకుమార్, మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, నాయకులు హజారి, రాజేశ్, గణేశ్, నరేశ్, శ్రీకాంత్, మణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News