Saturday, April 27, 2024

కావాలనే చిన్నపీటపై కూర్చున్నా…

- Advertisement -
- Advertisement -

నాకు ఎలాంటి అవమానం జరగలేదు
సోషల్ మీడియాలో అర్థం లేని వ్యాఖ్యలు

సింగరేణిలో ఈ ఏడాది 1900 ఉద్యోగాలు భర్తీ : డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

మన తెలంగాణ /హైదరాబాద్ : డిప్యూటీ సిఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నాను, నేనెవరికో తల వంచే వాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కాదని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్డు నం. 12లో జరిగిన సింగరేణి గెస్ట్ హౌస్ శంకు స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం యాదాద్రి దేవాలయంలో జరిగిన సంఘటనపై ఆయన స్పందిస్తూ.. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు. నేను కావాలనే యాదాద్రి దేవాలయంలో వేద పండితుల ఆశీర్వచన సమయంలో చిన్న పీట మీద కూర్చునట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నా నిర్ణయాలే కీలకమన్న ఆయన ఆర్థిక విద్యుత్తు ప్రణాళిక శాఖలకు ఉప ముఖ్యమంత్రి తాను వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఆ ఫోటోతో కావాలనే ట్రోల్ చేస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు. సింగరేణి కాలరీస్‌కి సంబంధించి 134 సంవత్సరాల చరిత్ర గల సింగరేణి సంస్థకు హైదరాబాద్‌లో సొంత గెస్ట్ హౌస్ లేదని, రాష్ట్ర ప్రభుత్వం వారు సొంత గెస్ట్ హౌస్ కోసం వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించడమే కాక శంకుస్థాపనకు విచ్చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సింగరేణి కాలరీస్‌కి సంబంధించిన జిల్లా అయిన ఖమ్మం చెందిన వ్యక్తి గా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాదిలో సింగరేణిలో 1900 ఉద్యోగాలు భర్తీ చేస్తాం
సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఏడాదిలో సింగరేణి ఆధ్వర్యంలో దాదాపు 1900 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తెలిపారు.ఇందులో భాగంగా గత వారంలో 489 ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ అయ్యాయని.. మరో 1352 ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు ఆయన ప్రకటించారు. సింగరేణి విస్తరణ చర్యల్లో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జైపూర్ లో నిర్వ హిస్తున్న ప్రస్తుత 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో త్వరలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

అదే విధంగా రామగుండంలో ఉన్న జెన్ కో ఆధ్వర్యంలో దశాబ్దాల క్రితం నిర్మించిన ప్లాంట్ ఆవరణలో 800 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో సింగరేణి థర్మల్ సామర్థ్యం 2800 మెగావాట్లకు చేరుతుందన్నారు. అలాగే సింగరేణి సుస్థిర భవిష్యత్ కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం కొత్త గనులను ఏర్పాటు చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలోని రాష్ట్రంలోని భారీ జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, ఓపెన్ కాస్ట్ లపై పవన విద్యుత్ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. సింగరేణి సమస్యలపై మానవీయ కోణంలో ముందుకు వెళ్తున్నామని… తాము తీసుకునే నిర్ణయాలన్నీ సింగరేణి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసేవిగానే ఉంటాయన్నారు. సింగరేణి సంపదను పెంచడమే తమ లక్ష్యమని.. అలా పెంచిన సంపదను కార్మికులకు పంచడమే ధ్యేయమని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందనీ, ఈ సంస్థను అభివృద్ధి చేయడం, కొత్త ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ లైజన్ ఆఫీసర్లు ఉన్న మాదిరిగానే బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. గత 100 రోజుల్లో సింగరేణిలో కార్మికుల సంక్షేమానికి, సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సంస్థను దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలబెడతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్ సాగర్ రావు, సింగరేణి ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్, మాజీ ఎంపీ, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్, ప్రాతినిథ్య సంఘ నాయకులు జనక్ ప్రసాద్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News