Friday, May 3, 2024

పరీక్ష తప్పితే తప్పినట్లే

- Advertisement -
- Advertisement -

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో
కనీస మార్కుల కేటాయింపు ఉండదు
70 శాతం సిలబస్‌కే పరీక్షలు….
ప్రశ్నాపత్రంలో ఛాయిస్ పెంపు
అమలులో నిమిషం నిబంధన
పాజిటివ్ ఉంటే అనుమతి ఉండదు
జ్వర లక్షణాలు ఉంటే ప్రత్యేక గది కేటాయింపు
పరీక్షల సన్నద్ధతకు బేసిక్ లెర్నింగ్ మెటీరియల్
కొవిడ్ జాగ్రత్తలతో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం
ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్
25 నుంచి నవంబర్ 3 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

Inter exams start from 25th
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల 25 నుంచి నవంబరు 3 వరకు జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. కొవిడ్ జాగ్రత్తలతో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి జరిగే పరీక్షలకు 1,768 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ పరీక్షలకు 4,59,228 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. విద్యార్థులు పరీక్ష తప్పితే తప్పినట్లే అని,ఈ పరీక్షలో కనీస మార్కుల కేటాయింపు ఉండదని స్పష్టం చేశారు. ఈ పరీక్షలో తప్పినవారికి పరిస్థితులు అనుకూలిస్తే మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని లేదంటే వార్షిక పరీక్షల సమయంలో మరోసారి పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మహమ్మారి దృష్ట్యా ఈసారి పరీక్ష కేంద్రాలు పెంచామని, పరీక్షా కేంద్రాలలో భౌతిక దూరం పాటించేలా విద్యార్థులు సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలకు 25,258 మంది ఇన్విలేటర్లు విధులు నిర్వహిస్తారని అన్నారు. ఇప్పటివరకు 3,74,903 మంది(82 శాతం) విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని వివరించారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై శనివారం ఉమర్ జలీల్ మీడియాతో మాట్లాడారు. గతేడాది కరోనా కారణంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ప్రమోట్ చేశామని, పరిస్థితులు అనుకూలించిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని అదే సమయంలో ప్రకటించామని అన్నారు. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పదవ తరగతిలో కూడా కూడా పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులయ్యారని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ప్రభుత్వ అనుమతితో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. పారదర్శంగా పరీక్షలు జరిగే ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి. –
మాస్క్ తప్పనిసరి
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఉమర్ జలీల్ తెలిపారు. విద్యార్థులు వాటర్ బాటిల్‌ను వెంట తెచ్చుకోవచ్చని స్పష్టం చేశారు. గతంలో ప్రకటించిన విధంగా 70 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహిస్తున్నందున.. ఆ సిలబస్‌కు పరిమితమయ్యే పరీక్ష ఉంటుందని చెప్పారు. మూడు సెట్ల పరీక్ష పత్రాలను ఎంపిక చేశామని అన్నారు. విద్యార్థులు పరీక్షల సన్నద్ధత కోసం బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ అందుబాటులోకి తీసుకువచ్చామని, వెబ్‌సైట్‌లో ఎంపిసి, బైపిసి, సిఇసి, హెచ్‌ఇసి గ్రూపులకు సంబంధించిన బేసిక్ లెర్నింగ్ మెటీరియల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అన్నారు. అలాగే ఇంటర్మీడియట్ యూట్యూబ్ ఛానల్‌లో ఆన్‌లైన్ క్లాసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ పెంచామని, విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని కోరారు. విద్యార్థుల కోసం మానసిక నిపుణులను అందుబాటులో ఉంచామని, అవసరమైన వారు వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమల్ జలీల్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు.
శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే ప్రత్యేక గది కేటాయింపు
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద థర్మోమీటర్లతో శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించి లోపలికి అనుమతిస్తామని ఉమర్ జలీల్ పేర్కొన్నారు. ఎవరికైనా అధిక శరీర ఉష్ణోగ్రతలు ఉన్నట్లు గుర్తించినా, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా వారికి ప్రత్యేక గది కేటాయిస్తామని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రంలో రెండు ఐసోలేషన్ గదులను కేటాయించామని అన్నారు. కొవిడ్ పాజిటివ్ ఉన్న విద్యార్థులను మాత్రం పరీక్షలకు అనుమతించమని స్పస్టం చేశారు.
ఆదివారమూ పరీక్ష
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న ఉన్న కారణంగా.. ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షను మరుసటి రోజు నిర్వహిస్తున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. ఈనెల 31 ఆదివారమైనా పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈ నెల 31 ఆదివారం కావడంతో ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News