Sunday, April 28, 2024

డేంజర్ బెల్స్

- Advertisement -
- Advertisement -

8 శాతానికి దగ్గర్లో రిటైల్ ద్రవ్యోల్బణం
ఆర్‌బిఐ మరోసారి వడ్డీ రేట్లను పెంచొచ్చు: నిపుణులు

Interest rates increased with Inflation
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం ప్రభావం సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఎనిమిదేళ్ల గరిష్ఠానికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణంతో రాబోయే పరిస్థితులు ఎలా ఉండనున్నాయి? అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. గురువారం ప్రభుత్వం ప్రకటించిన ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆహార పదార్థాలు, చమురు ధరల పెరుగుదల కారణంగా ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 7.79 శాతానికి పెరిగింది. 2014 మే నెలలో 8.33 శాతం తర్వాత మళ్లీ ఇంతలా పెరగడం ఇదే. ద్రవ్యోల్బణం రేటు వరుసగా నాలుగో నెల ఆర్‌బిఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతాన్ని దాటింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2022 మార్చిలో 6.95 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, జనవరిలో 6.01 శాతం నమోదయ్యాయి. అంటే 6 శాతం పైనే కొనసాగుతోంది. ఏడాది క్రితం 2021 ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.23 శాతంతో కనిష్ట స్థాయిలో ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి చమురు ధరల పెరుగుదల, ఇతర కారణాల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 8.38 శాతానికి పెరగ్గా, అంతకుముందు మార్చి నెలలో ఇది 7.68 శాతంగా ఉంది. గతేడాది ఇది అత్యంత కనిష్ట స్థాయిలో 1.96 శాతంగా ఉంది. ఇంధనం, విద్యుత్ ధరల విషయానికొస్తే 7.52 శాతం నుంచి 10.80 శాతానికి పెరిగాయి.

ఇక వడ్డీ రేట్లు పైపైకేనా..

రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగానే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వ్ బ్యాంక్) వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. ఆర్‌బిఐ ఈ నెల ప్రారంభంలో అత్యవసర ద్రవ్య విధాన సమావేశం నిర్వహించి, వడ్డీ రేట్లను పెంచింది. ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగా వడ్డీ రేట్లను 0.40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రుణాలు, ఇఎంఐలు మరింత భారం అయ్యాయి. అయితే ఏప్రిల్‌లో 7.79 శాతానికి ద్రవ్యోల్బణం పెరగడంతో ఆర్‌బిఐ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి డబ్లుపిఐ(టోకు ధర సూచీ)ని తమ ప్రాతిపదికగా పరిగణిస్తాయి. ఇది భారతదేశంలో జరగదు. భారత్‌లో డబ్ల్యుపిఐతో పాటు వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ముడి చమురు, వస్తువుల ధరలు, తయారీ వ్యయం వంటి అనేక ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఇవి రిటైల్ ద్రవ్యోల్బణం రేటును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

పరిమాణం తగ్గిస్తున్న కంపెనీలు

ఆహార వస్తువుల నుంచి దుస్తులు, పాదరక్షల వరకు రేట్లు పెరిగాయి. ఎడిబుల్ ఆయిల్, ఆహార ధాన్యాలు, ఇంధనం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఎఫ్‌ఎంసిజి సంస్థలు హిందుస్తాన్ యూనిలీవర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాబర్ ఇండియా వంటి కంపెనీలు ధరలను స్థిరంగా కొనసాగించే ప్రయత్నంలో భాగంగా ప్యాకెట్లలో నిల్వ ఉంచే వస్తువుల పరిమాణాన్ని తగ్గిస్తూ, రేట్లను పెంచకుండా చూస్తున్నాయి. ఇది ఒక్క భారతదేశంలోనే జరగడం లేదు. అమెరికాలోని అనేక కంపెనీలు వస్తువుల పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి. ప్రముఖ విమ్ బార్ 10 రూపాయలకు 155 గ్రాములు ఇస్తే, ఇప్పుడు దాని బరువు 135 గ్రాములకు తగ్గింది. హల్దీరామ్ ఆలూ భుజియా ప్యాక్ బరువు 55 గ్రాముల నుంచి 42 గ్రాములకు తగ్గింది. లైఫ్‌బాయ్ సబ్బుల కొత్త సైజు ప్యాక్‌ను రూ. 10, రూ. 35 మధ్య ధరతో పరిచయం చేసింది. పార్లే-జీ బిస్కెట్ల ధర ఫిబ్రవరిలో రూ.5 ఉండగా ఇప్పటికీ రూ.5 ఉండగా, 64 గ్రాముల నుంచి 55 గ్రాములకు బరువు తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News