Tuesday, April 30, 2024

నెట్‌బంద్ రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -
- Advertisement -

InterNet

 

సుప్రీంకోర్టు స్పష్టీకరణ
వారం రోజుల్లోగా కశ్మీర్‌లోని అన్ని ఆంక్షలపై సమీక్షించండి
జమ్మూ, కశ్మీర్ పాలనా యంత్రాంగానికి ఆదేశం
సుప్రీం తీర్పుపై సర్వత్రా హర్షం

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో నిరవధిక ఇంటర్నెట్ నిషేదం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లఘించడమేనని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో విధించిన అన్ని ఆంక్షలను వారం రోజుల్లోగా సమీక్షించాలని జమ్మూ కశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేసిన తర్వాత రాష్ట్రంలో విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్ ఎన్‌వి రమణ తీర్పు ప్రతులను చదివి వినిపించారు. ‘ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవడం కూడా భాగం. కశ్మీర్ చాలా హింసను ఎదుర్కొంది. మానవ హక్కులు, భద్రతా సమస్యలను సమతుల్యం చేయడం మా పని. జమ్మూ, కశ్మీర్‌లో విధించిన అన్ని ఆంక్షలను వారం రోజుల్లోగా సమీక్షించాలి.

ఇంటర్నెట్ సేవలను శాశ్వతంగా నిలిపివేయడాన్ని అనుమతించబోము. ఇంటర్నెట్ సేవలను పరిమితం చేయడం లేదా నిలిపి వేయడం న్యాయసమీక్షకు లోబడి ఉండాలి. ఇంటర్నెట్ ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయలేం. ఇటీవలి కాలంలో భావప్రకటనకు అదొక సాధనంగా మారింది’ అని జస్టిస్ ఎన్‌వి రమణ పేర్కొన్నారు. 144 సెక్షన్‌ను ఎక్కువగా విధించడం అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లేనని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. బెంచ్ ఈ వ్యాఖ్యలను మీడియాకు కూడా వర్తింపజేస్తూ పత్రికా స్వేచ్ఛ ఒక విలువైన, పవిత్రమైన హక్కని పేర్కొంది. ఆస్పత్రులు, విద్యాసంస్థలు లాంటి అత్యవసర సేవలకు తక్షణమే ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని న్యాయమూర్తులు బిఆర్ గవాయి, ఆర్ సుభాష్ రెడ్డి కూడా ఉన్న ధర్మాసనం ఆదేశించింది. నిషేధాజ్ఞలకు సంబంధించి ఆదేశాలు జారీ చేసేటప్పుడు జిల్లా మేజిస్ట్రేట్లు విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలని కోర్టు అభిప్రాయపడింది.

అయితే మిగతా రంగాలకు, కశ్మీర్ లోయలోని ప్రజలకు ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు ఎలాంటి గడువునూ పేర్కొనలేదు. కశ్మీర్‌లో ఆంక్షలకు సంబంధించిన అన్ని ఉత్తర్వులను ప్రజల ముందుంచాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. తాము ఇచ్చే ఆదేశాలపై వచ్చే రాజకీయ ఉద్దేశాలను తాము పట్టించుకోబోమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై ప్రతిపక్షాలతో పాటుగా అయిదు నెలలుగా ఇంటర్నెట్ సేవలు లేకుండా గడుపుతున్న కశ్మీర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు 2020లో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ అని ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.

చరిత్రాత్మకం: గులాం నబీ ఆజాద్
సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఆజాద్ ఉన్నారు. ‘జమ్మూ, కశ్మీర్ ప్రజల మనోభావాల మేరకు సుప్రీం కోర్టు తీర్పునివ్వడం ఇదే మొదటిసారి. ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించినందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ తీర్పు కోసమే దేశ ప్రజలు ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్ ప్రజలు ఎదురు చూస్తున్నారు’ అని ఆజాద్ అన్నారు.

కాగా సుప్రీంకోర్టు ప్రకటించిన చాలా ముఖ్యమైన తీర్పు ఇదని పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఒకరైన ‘కశ్మీర్ టైమ్స్’ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనూరాధా బాసిన్ తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ అన్నారు. ‘ ఇంటర్నెట్ మౌలిక హక్కని పేర్కొనడం ద్వారా సుప్రీంకోర్టు 2020లో మోడీ ప్రభుత్వ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తొలి చావు దెబ్బ కొట్టింది. 144 సెక్షన్ విధించడం ద్వారా అసమ్మతిని అణచివేయకూడ రాదని చెప్పడం ద్వారా మోడీ షా ద్వయానికి డబుల్ షాక్ ఇచ్చింది. జాతి రాజ్యాంగం ముందు తల వంచుతుందే తప్ప తన ముందు కాదని మోడీజీకి గుర్తు చేసింది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.

InterNet bandh is unconstitutional
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News