Tuesday, May 14, 2024

ఫైనల్‌కు చేరేదెవరో?

- Advertisement -
- Advertisement -

ఫైనల్‌కు చేరేదెవరో?
ముంబైతో సమరానికి ఢిల్లీ సిద్ధం, నేడు క్వాలిఫయర్1

దుబాయి: ఐపిఎల్‌లో లీగ్ దశ ముగిసే రేపటితో నాకౌట్ సమరానికి తెరలేవనుంది. యూఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లతో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. ముంబై అగ్రస్థానంలో నిలువగా ఢిల్లీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. గురువారం దుబాయి వేదికగా ఇరు జట్ల మధ్య క్వాలిఫయర్1 సమరం జరుగనుంది. ఇందులో గెలిచే జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టుకు కూడా మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఈ జట్టు క్వాలిఫయర్2లో తలపడాల్సి ఉంటుంది. హైదరాబాద్‌బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ సమరం జరుగనుంది.
ఫేవరెట్‌గా ముంబై
ఇక క్వాలిఫయర్1లో ముంబై ఇండియన్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. పొలార్డ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక రోహిత్ శర్మ, క్వింటాన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కిషన్, సూర్యకుమార్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. డికాక్ కూడా జోరు మీదున్నాడు. ముంబై విజయాల్లో ఈ ముగ్గురు చాలా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా కిషన్, డికాక్, సూర్యకుమార్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రోహిత్ శర్మ కూడా బ్యాట్ ఝులిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక పొలార్డ్, హార్దిక్ వంటి ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్లు కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇక బంతితో మెరుపులు మెరిపించేందుకు బుమ్రా, బౌల్ట్, రాహుల్ చాహర్ ఉండనే ఉన్నారు. ఈ త్రయం అసాధారణ బౌలింగ్‌తో ముంబైకి అండగా నిలిచింది. ప్లేఆఫ్‌లో కూడా జట్టుకు అండగా నిలువాలని తహతహలాడుతోంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న ముంబై మరోసారి ఫైనల్‌కు చేరాలనే లక్షంతో మ్యాచ్‌కు సిద్ధమైంది.
సమరోత్సాహంతో ఢిల్లీ
మరోవైపు అద్భుత ఆటతో రెండో స్థానాన్ని సంపాదించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ సమరోత్సాహంతో ప్లేఆఫ్ సమరానికి సిద్ధమైంది. శిఖర్ ధావన్ అద్భుత ఫామ్‌లో ఉండడం ఢిల్లీకి ఊరటనిచ్చే అంశం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన ధావన్ కిందటి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే మరో ఓపెనర్ పృథ్వీషా ఫామ్‌ను కోల్పోవడం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఆరంభ మ్యాచుల్లో అద్భుతంగా ఆడిన పృథ్వీషా ప్రస్తుతం ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. కాగా, సీనియర్ ఆటగాడు అజింక్య రహానె గాడిలో పడడం ఢిల్లీకి కలిసి వచ్చే అంశంగా మారింది. రహానె కిందటి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈసారి కూడా మెరుగైన ఆటను కనబరిచేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలావుండగా రిషబ్ పంత్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లు ఆశించిన స్థాయిలో ఆడక పోవడం జట్టును వెంటాడుతోంది. ఈసారైన వీరు మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. రబడా, నోర్జే, అశ్విన్, అక్షర్ పటేల్ తదితరులతో ఢిల్లీ బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. చివరి లీగ్ మ్యాచ్‌లో బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. కాగా, రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.

IPL 2020: MI vs DC First Qualifier Match Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News