Monday, May 6, 2024

‘నాలా’ చెల్లించని వ్యవసాయేతర భూములపై ప్రభుత్వం ఆరా

- Advertisement -
- Advertisement -

Government inquires about Nala unpaid non-agricultural land

 

ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టిన పలువురు రియల్టర్‌లు
కొరడా ఝుళిపించడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం
ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం కానున్న భూముల వివరాలు
రానున్న రోజుల్లో ఆ భూములు రిజిస్ట్రేషన్‌లు కాకుండా మార్గదర్శకాలు

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండా(నాలా చెల్లించకుండా) వెంచర్లు చేసిన భూములకు సంబంధించి ప్రభుత్వం ఆరా తీస్తోంది. వాటిని కూడా ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. చాలామంది రియల్టర్లు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోకుండా (నాలా) పన్ను చెల్లించకుండానే వాటిని వెంచర్లుగా చేసి అమ్మివేస్తున్నారు. ఈ సంవత్సరం గతంలో దీనిపై ఆర్థిక శాఖ ‘నాలా’ ఎగ్గొట్టిన వివరాలను సేకరించి వారికి నోటీసులు సైతం జారీ చేసింది.

సుమారు రూ.800 కోట్లను రియల్టర్లు చెల్లించాలని అప్పట్లో ఆ శాఖ అధికారులు ప్రకటించారు. అయినా ఇప్పటివరకు చాలామంది దీనిపై స్పందించలేదని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీనిపై ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో ధరణి వెబ్‌సైట్‌లో ఆ భూముల వివరాలను చేర్చి తదనంతరం వాటి విక్రయించకుండా ఆపివేయాలని ప్రభు త్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. రానున్న రోజుల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ భూముల సమాచారాన్ని ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం చేసేలా పక్కా ప్రణాళికలను రూపొందిస్తోంది.

1.42 కోట్ల ఎకరాల వివాదరహిత వ్యవసాయ భూమి

అందులో భాగంగా ‘నాలా’ చెల్లించకుండా వ్యవసాయ భూము లను ప్లాట్లుగా చేసిన వారిపై కొరడా ఝుళిపించాలని వాటి రిజిస్ట్రేషన్‌లను ఆపివేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. త్వరలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘నాలా’ చెల్లించని భూముల రిజిస్ట్రేషన్‌ల ను ఆపివేయాలని మార్గదర్శకాలను సబ్ రిజిస్ట్రార్‌లకు జారీ చేయనున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వం గతంలో నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర భూ భాగానికి సంబంధించి 1,12,077 చదరపు కిలోమీటర్ల వివరాలను ఖాతాల వారీగా ప్రభుత్వం సేకరించింది. 2.80 కోట్ల ఎకరాల భూభాగంలో 1.42 కోట్ల ఎకరాల వివాదరహిత వ్యవసాయ భూమి ఉందని, 17.89 లక్షల ఎకరాల భూమి వివిధ న్యాయపరమైన వివాదాల్లో ఉన్నట్టుగా రికార్డుల ప్రక్షాళనలో వెల్లడయ్యింది. దీంతోపాటు రైతుల వద్ద 11.95లక్షల ఎకరాల భూమి రైతుల వద్ద (సేద్యానికి పనికిరాని) భూమి ఉందని తేలింది.

రాష్ట్రంలో వ్యవసాయ భూమి 1.42 కోట్ల భూమి ఉండగా, 31 జిల్లాల్లో అనుమతులు లేకుండా సాగేతర రంగాలకు చెందిన భూమి 11,95,889 ఎకరాలుగా ఉందని ప్రభు త్వం గుర్తించింది. అయితే ఇందులో నాలా కన్వెర్షన్ చేయని భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయించి వారి నుంచి పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు చాలామంది రియల్టర్లు భారీగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర రంగాలకు మళ్లీంచడంతో వ్యవసాయానికి ఇబ్బంది కలుగుతోంది. వ్యవసాయ భూములను అడ్డగోలుగా కొనుగోలు చేసి ఓపెన్‌ప్లాట్ల్‌గా మారుస్తున్న నేపథ్యంలో క్రమంగా జిఎస్‌డిపిలో వ్యవసాయ వాటా తగ్గుతోంద ని ఆర్థికశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యవసాయ భూము లను ఇతర రంగాలకు మళ్లీంచడం వలన రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులపై రానున్న రోజుల్లో ప్రభావం చూపుతుందని అర్థగణాంక శాఖ తన నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో వ్యవసాయేతర భూములుగా మారిన భూముల వివరాలపై ప్రభు త్వం ఆరా తీస్తోంది.

అయితే రాష్ట్రంలోని 61.96 లక్షల హెక్టా ర్ల సాగు భూమిలో 62 శాతం కమతాల వాటా ఉండగా, 247 శాతం కమతాల సాగు భూమిలో 30 శాతం వాటా కలిగి ఉన్నాయి. కమతాల కింద 15.85లక్షల హెక్టార్ల భూమి ఉంది. 5 నుంచి 10 ఎకరాల భూములు కలిగిన కమతాలు 6.02 లక్షలు ఉన్నాయి. రాష్ట్ర కమతాల్లో పెద్ద కమతాలు 3 శాతం ఉన్నట్టుగా తేలింది. వీరి చేతుల్లో భూమి 15శాతం వాటా కలి గి ఉంది. ఇదే నేడు వ్యవసాయ రంగానికి దూరంగా ఉంది.

భూ కమతాల ఏకీకరణ చట్టం 1956కు సవరణ

ఈ నేపథ్యంలో భూ కమతాల ఏకీకరణపై కీలక నిర్ణయం తీసుకోవాలని భావించిన ప్రభుత్వం భూ కమతాల ఏకీకరణ చట్టం 1956ను సవరించింది. దీనిద్వారా భూ వివాదాల నివారణ, సాగు విస్తీర్ణం పెంచుకోవాలన్న భావనలో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. భూ కమతాల ఏకీకరణలో అక్రమాలు జరగకుండా పటిష్టమైన కార్యాచరణను ప్రభుత్వం చేపట్టింది. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకోవడంతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్)లను బాధ్యులుగా చేసింది. వీరు చేసిన నిర్ణయం ఆధారంగా తహసీల్దార్‌లు ఆర్‌ఓఆర్ ద్వారా రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు, కాస్తు కాలంలో యజమాని పేరును ఉచితంగా మార్చనున్నారు. ఈ పరిణామం వ్యవసాయ రంగానికి మరింత ఊతం ఇస్తుందని అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News