Thursday, May 16, 2024

పోరాడి ఓడిన కోల్‌కతా.. చెన్నై హ్యాట్రిక్ విజయం

- Advertisement -
- Advertisement -

పోరాడి ఓడిన కోల్‌కతా.. చెన్నై హ్యాట్రిక్ విజయం

గైక్వాడ్, డుప్లెసిస్ స్వైర విహారం

IPL 2021: CSK win by 18 runs against KKR

ముంబై: ఐపిఎల్ సీజన్14లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో చెన్నై 18 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సిఎస్‌కె 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కోల్‌కతా 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కోల్‌కతాను ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్ ఆదుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రసెల్ 22 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 54 పరుగులు చేశాడు. ఇక కార్తీక్ 24 బంతుల్లో రెండు సిక్స్‌లు, మరో 4 ఫోర్లతో 40 పరుగులు సాధించాడు. చివర్లో కమిన్స్ అసాధారణ పోరాట పటిమతో కోల్‌కతాకు దాదాపు విజయం అందించినంత పని చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన కమిన్స్ 34 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, మరో 4 ఫోర్లతో అజేయంగా 66 పరుగులు చేశాడు. అయితే మిగతావారు విఫలం కావడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు.
ఓపెనర్ల జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచుల్లో ఘోరంగా విఫలమైన యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈసారి చెలరేగి ఆడాడు. ఇక డుప్లెసిస్ కూడా తన జోరును కొనసాగిస్తూ ముందుకు సాగాడు. ఇటు గైక్వాడ్ అటు డుప్లెసిస్ తమదైన శైలీలో చెలరేగి పోవడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఈ జోడీని కట్టడి చేసేందుకు కోల్‌కతా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఓపెనర్లు ఇద్దరు పోటీ పడి బారీ షాట్లతో విరుచుకు పడడంతో స్కోరు సునామీల ముందుకు సాగింది. గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో శివమెత్తినట్టు ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చూడచక్కని షాట్లతో అలరించాడు. అతన్ని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి కెప్టెన్ తరచూ బౌలర్లను మార్చినా ఫలితం కనిపించడం లేదు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన గైక్వాడ్ 42 బంతుల్లో ఆరు ఫోర్లు, మరో నాలుగు భారీ సిక్సర్లతో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే డుప్లెసిస్‌తో కలిసి తొలి వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. మరోవైపు డుప్లెసిస్ కూడా తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. మొయిన్ అలీ కూడా దూకుడుగా ఆడాడు. రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 12 బంతుల్లోనే 25 పరుగులు సాధించాడు. మరోవైపు చెలరేగి ఆడిన డుప్లెసిస్ 60 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, మరో 9 బౌండరీలతో 95 పరుగులు చేశాడు. కెప్టెన్ ధోనీ(17) కూడా తనవంతు పాత్ర పోషించడంతో చెన్నై స్కోరు 220 పరుగులకు చేరింది.

IPL 2021: CSK win by 18 runs against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News