Sunday, April 28, 2024

పంజాబ్‌కు సవాల్.. నేడు ఢిల్లీతో కీలక పోరు

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: ఐపిఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ బుధవారం కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఢిల్లీ ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. దీంతో ఆ జట్టుకు ఈ మ్యాచ్ నామా మాత్రంగానే మిగిలింది. అయితే పంజాబ్‌కు ఇంకా ప్లేఆఫ్ అవకాశాలు మిగిలేవున్నాయి. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే నాకౌట్ రేసులో నిలుస్తోంది. ప్రస్తుతం పంజాబ్ 12 పాయింట్లు సాధించింది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ భారీ తేడాతో గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై పంజాబ్ నాకౌట్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇక పంజాబ్ కిందటి మ్యాచ్‌లో కూడా ఢిల్లీతోనే తలపడింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడడంతో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.

ఇక ఢిల్లీని ఓడించిన పంజాబ్ నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి రేసులో నిలువాలని తహతహలాడుతోంది. అయితే పంజాబ్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. కీలక బ్యాటర్లు జట్టుకు అండగా నిలువలేక పోతున్నారు. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో దాంట్లో తేలిపోతున్నారు. ఇది జట్టుకు ప్రతికూలంగా మారింది. ఢిల్లీపై ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కళ్లు చెదిరే శతకం సాధించడం మాత్రం పంజాబ్‌కు ఊరటకలిగించే అంశమే. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. లివింగ్‌స్టోన్, కెప్టెన్ శిఖర్ ధావన్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, శామ్ కరణ్, హర్‌ప్రీత్ బ్రార్, సికిందర్ రజా, షారుక్ ఖాన్ వంటి హార్డ్ హిట్టర్లు జట్టులో ఉన్నారు. అయితే వీరు నిలకడగా ఆడడంలో విఫలమవుతున్నారు.

ఇదే జట్టు పరాజయాలకు ప్రధాన కారణంగా మారుతోంది. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే పంజాబ్‌కు ఢిల్లీని ఓడించడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. ఇదిలావుంటే బౌలింగ్‌లో మాత్రం చాలా బలంగా ఉంది. చాలా మ్యాచుల్లో స్వల్ప లక్ష్యాలను సయితం కాపాడుకుని బౌలర్లు జట్టుకు విజయాలు సాధించి పెట్టారు. ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్‌లో కూడా బౌలర్లు సత్తా చాటారు. ఈసారి కూడా బౌలర్లు పంజాబ్‌కు కీలకంగా మారారు. హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, శామ్ కరణ్, అర్ష్‌దీప్, సికందర్ రజా, రాహుల్ చాహర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. కిందటి మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించి పంజాబ్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు.

పరువు కోసం..
మరోవైపు వరుస ఓటములతో ఇప్పటికే నాకౌట్‌కు దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన రెండు మ్యాచుల్లోనైనా గెలిచి కాస్తయినా పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. కిందటి మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో కూడా ఢిల్లీ విఫలమైంది. ఈ మ్యాచ్‌లో మాత్రం అలాంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్త పడాలని భావిస్తోంది. డేవిడ్ వార్నర్, ఫిలిప్ సాల్ట్, మిఛెల్ మార్ష్, రొసొ, మనీష్ పాండే, అక్షర్ పటేల్ వంటి స్టార్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే వీరు నిలకడగా బ్యాటింగ్ చేయడంలో విఫలమవుతున్నారు. కిందటి మ్యాచ్‌లో కెప్టెన్ వార్నర్ ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్లు రాణించలేక పోయారు. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ఈ మ్యాచ్‌లో కూడా ఢిల్లీకి ఓటమి తప్పక పోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News