Sunday, April 28, 2024

హమాస్ యుద్ధం సముద్ర బాట

- Advertisement -
- Advertisement -

జెరూసలెం : ఇండియాకు వస్తున్న ఇజ్రాయెల్ సంబంధిత సరుకు రవాణా నౌక హైజాక్ అయింది. ఆదివారం రాత్రి యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ ఈ చర్యకు పాల్పడ్డారు. ఎర్రసముద్రంలోని అత్యంత కీలకమైన మార్గంలో దీనిని దారికాచి ఈ రెబెల్స్ తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఇందులోని 25 మంది వరకూ నౌకాసిబ్బందిని బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనానికి దారితీసింది. ఇప్పుడు రగులుకున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం దశలో నెలకొంటున్న వైరాలు ఇప్పుడు సముద్ర మార్గాలకు కూడా విస్తరించుకున్నట్లు ఈ నౌక హైజాక్ ఘటనతో స్పష్టం అయింది. ఈ నౌక ఇజ్రాయెల్ లింక్‌లతో ఉన్నందున దీనిని తాము పట్టుకున్నట్లు రెబెల్స్ తెలిపారు. ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని, దురహంకార వైఖరిని తాము సహించేది లేదని , ఇజ్రాయెల్ సొంత లేదా సంబంధిత నౌకలు అంతర్జాతీయంగా ఏ సముద్ర మార్గంలో తిరిగినా వాటిని హైజాక్ చేస్తామని హౌతీ రెబెల్స్ స్పష్టం చేశారు. గాజాలో ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాల్సి ఉంది.

అందుకు తగ్గట్లుగా తమ చర్యలను మరింతగా ఉధృతం చేస్తామని రెబెల్స్ హెచ్చరించారు. ఈ నౌక జపాన్‌కు చెందిన ఎన్‌వైకె లైన్ సంస్థకు చెందినది. హైజాక్ అయినప్పుడు నౌకలో సరుకులు లేవని ఈ కంపెనీ వర్గాలు తెలిపాయి. నౌక సిబ్బందిగా ఉక్రెయిన్, రొమేనియా, మెక్సికో , బల్గేరియా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వారు ఉన్నారు. బహమస్ నుంచి బయలుదేరిన ఈ గలాక్సీ లీడర్ నౌకపై దాడిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ఈ నౌక ఇజ్రాయెల్‌కు చెందిన ఓ బిలియనీరుకు చెందినదని వెల్లడైంది. దీనిని జపాన్‌కు చెందిన సంస్థకు లీజుకు ఇచ్చారు. నౌకలో ఇజ్రాయెలీలు ఎవరూ లేరని వెల్లడైంది. హౌతీలది కేవలం ఉగ్రవాద చర్యనే అని నెతన్యాహు ఖండించారు.

ఇజ్రాయెల్‌పై సముద్ర యుద్ధానికి ఇది ఆరంభం
తాము ఇప్పుడు ఈ నౌకను స్వాధీనం చేసుకోవడం ఇజ్రాయెల్‌ను సముద్ర మార్గంలో అన్ని విధాలుగా కట్టడి చేయడానికి అని హౌతీ రెబెల్స్ తెలిపారు.ఈ క్రమంలో తమ సముద్ర యుద్ధానికి ఇది కేవలం ఆరంభమే అని తెలిపారు. ఈ దిశలో తమ కార్యాచరణ ఆరంభమైందని , దీని పర్యవసానాలు ఏ విధంగా ఉన్నా లెక్కచేసేది లేదని హౌతీ రెబెల్స్ ప్రతినిధి తెలిపారు. కాగా జపాన్ ఈ హైజాక్‌ను తీవ్రంగా తప్పుపట్టింది. రెబెల్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు, సాధ్యమైనంత త్వరగా బందీలను విడిపించే ప్రయత్నాలకు దిగుతున్నట్లు జపాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒక్కరు తెలిపారు. అయితే ఈ నౌక బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీది అని ఓ వార్తా సంస్థ తెలిపింది. ఇక ఈ సరుకు రవాణా నౌక ఇండియాలోని ఏ రేవుకు వస్తుందనేది , ఎందుకు వస్తుందనేది స్పష్టం కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News