Friday, September 26, 2025

భారతీయులుగా సిగ్గు పడదాం

- Advertisement -
- Advertisement -

పాలస్తీనా విషయమై ఐక్యరాజ్య సమితిలో ఈ నెల 23న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఏమన్నారన్నది అట్లుంచుదాం. అవి వారి పాత వైఖరులే గనుక. పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు అదే సమయంలో వరుసగా పది పాశ్చాత్య దేశాలు ప్రకటించటాన్ని కూడా అట్లుంచుదాం. వారి ఈ నిర్ణయం చాలా ఆలస్యంగా జరిగింది గనుక. పైగా తాము స్వయంగా పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ హత్యాకాండకు దీర్ఘకాలం పాటు సహకరించటమే గాక, ఇప్పటికీ దౌత్య, వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నారు గనుక. ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తించాలంటున్నది అవే పాశ్చాత్య దేశాలలోనేగాక పలు ఇతర దేశాల ప్రజలు, మేధావులు, వివిధ రంగాల వారు, రచయితలు, కళాకారులు, క్రీడాకారులు ఏ విధంగా స్పందిస్తున్నారనేది.

కొన్ని రోజులుగా వారంతా అట్టుడుకుతున్నారు. తమ తమ కార్యకలాపాలను నిలిపివేసి వీధులలో బలమైన నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రమాదకరం కాని పద్ధతులలో స్వల్పస్థాయి హింసకు కూడా పాల్పడుతున్నారు. ఇజ్రాయెల్‌ను ఖండించటం, పాలస్తీనాను గుర్తించటంతో సరిపోదని, అంతకు మించిన నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు ఇప్పటికీ ఆయుధాలు విక్రయిస్తూ, వాణిజ్యం కొనసాగిస్తున్న చోట్ల పూర్తిగా ఆపివేయాలని, అక్కడి విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలతో ఒప్పందాలు రద్దు చేయాలని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలో పాల్గొనరాదని తమ ప్రభుత్వాలను ఒత్తిడి చేయటం, తమ స్థాయిలో నిర్ణయించటం వంటివి చేస్తున్నారు. ఈ ఆందోళనలలో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి కార్మికుల వరకు, వృద్ధులు, స్త్రీలు సహా అన్ని వర్గాల వారు పాల్గొంటున్నారు. వారి ప్రదర్శనలలో మొక్కుబడితనం ఫోటోలలో, టివి ఛానళ్లలో కనిపిస్తే చాలుననే కృత్రిమత్వం ఏమీ కన్పించవు. అరవై సంవత్సరాల క్రితం వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా ఆ దేశాలలో జరిగిన తీవ్రమైన ప్రదర్శనలలో, విద్యార్ధులు, యువజనులలో ఎటువంటి ఆగ్రహం కనిపించిందో ఇప్పటికీ అదే గమనించవచ్చు.ప్రస్తుత వరుస ప్రదర్శనలకు ముందు మాసాలలో అమెరికాతోపాటు పలు పాశ్చాత్య దేశాలలోనూ గాజా, వెస్ట్‌బ్యాంక్‌లలో ఇజ్రాయెల్ మారణకాండకు వ్యతిరేకంగా విద్యాసంస్థల క్యాంపస్‌లు ఇదే విధంగా కల్లోలితంగా మారాయి. ప్రస్తుతం పశ్చిమాన బ్రిటన్ నుంచి తూర్పున ఆస్ట్రేలియా వరకు ప్రభుత్వాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయంటే ఈ విధమైన సామాజిక ఒత్తిడి కూడా ఒక కారణం అయే ఉండాలి.

సమస్య ఏమంటే, పౌరులుగా భారతీయులం ఒక ప్రభుత్వంగా భారతదేశం చేస్తున్నది ఏమిటనేది. పౌరులలో కనిపిస్తున్న స్పందనలు శూన్యం. గాజా మారణ కాండ సుమారు రెండు సంవత్సరాలుగా సాగుతుండగా, 140 కోట్ల జనాభా గల దేశంలో ఎప్పుడో, ఎక్కడో ఒకటీ అరా కార్యక్రమాలు మొక్కుబడిగా జరిగి ఉంటాయి. ఏ సామాజిక తరగతి చేసింది ఏమీ లేదు. రాజకీయ పార్టీల గురించి మాట్లాడకపోవటం మంచిది. చివరకు వామ పక్షాలనబడేవి కూడా భిన్నం కాదు. మనం వలస పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం జరిపి ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల వలస వ్యతిరేక పోరాటాలకు ఆదర్శప్రాయంగా నిలిచినట్లు చెప్పుకుంటాము. అలీనోద్యమ వ్యవస్ధాపకులమని చాటుకుంటాము. వర్తమానంలోనూ ‘భౌగోళిక దక్షిణం’ (గ్లోబల్ సౌత్) అనే వ్యవహార నామం పేరిట వర్ధమాన ప్రపంచానికి నాయకత్వం వహించేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నాము. మనది అంతర్జాతీయంగా ఏ వర్గానికి చెందని స్వతంత్ర పంథా అని చెప్పుకుంటున్నాము. కాని పాలస్తీనా, గాజాల విషయంలో ప్రభుత్వంగా కాని, పౌరులుగా కాని చేస్తున్నది లేదా చేయనిది ఏమిటి? యథాతథంగా ఏమిటి? పైన వివరించుకున్న వివిధ దేశాలలో జరుగుతున్న దానితో పోల్చుకున్నపుడు చేస్తున్నదేమిటి? రెండు విధాలుగానూ సిగ్గుచేటు.

మనకు ఒకప్పటి స్ఫూర్తి ఏమైంది? ఎందుకు లేకుండా పోయింది?. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించటం, ఇజ్రాయెల్‌తోపాటు రెండు దేశాల ఉనికి అవసరమనే వైఖరిని తొలినాళ్లలోనే తీసుకోవటం వరకు మంచి నిర్ణయాలే. అవి ఎప్పుడో కాంగ్రెస్ పరిపాలనలో జరిగిన మాట. కాని తర్వాత సుమారు పాతికేళ్లుగా వైఖరి నెమ్మదిగా మారుతూ వస్తున్నది. ఇజ్రాయెల్‌తో సంబంధాల మెరుగుదల వరకు అభ్యంతర పెట్టవలసింది లేదు. కాని, స్వతంత్ర దేశంగా పాలస్తీనా ఏర్పాటుపై కొంత కాలం దోబూచులాడిన ఇజ్రాయెల్, అమెరికాలు ముఖ్యంగా గత 1015 సంవత్సరాలుగా అందుకు వ్యతిరేక వైఖరిగా బాహాటంగానే తీసుకుంటు వస్తున్నాయి. అందులో భాగంగా వెస్ట్‌బ్యాంక్‌లో యూదుల సెటిల్‌మెంట్లను అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా విస్తరించటం, ఇటీవలి కాలంలో మరొక అడుగు ముందుకు వేసి అసలు వెస్ట్ బ్యాంక్ అనేది వేరుగా లేదని, అది ఇజ్రాయెల్‌లో భాగమని, అదే విధంగా గ్రేటర్ ఇజ్రాయెల్ సృష్టికోసం గాజాను పూర్తిగా ఆక్రమించగలమని ప్రకటించటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. గాజా మారణకాండ గురించి చెప్పనక్కర లేదు. ఇవన్నీ జరుగుతుండగా భారత ప్రభుత్వం మాటలు, చేతలు ఏ విధంగా ఉన్నాయన్నది ప్రశ్న.

ఐక్యరాజ్య సమితిలో తీర్మానాలు వచ్చినపుడు మొక్కుబడిగా ఒకసారి అనుకూలంగా ఓటువేసి ఒకసాగి గైర్‌హాజర్ కావటం, పాలస్తీనా స్వతంత్ర దేశం కావాలని పొడిపొడిగా మాట్లాడటం మినహా మరేమీలేదు. అంతకన్న దారుణం ఏమంటే, భారత దేశంలో తయారైన ఆయుధాలు ఇజ్రాయెల్‌కు సరఫరా అవుతున్నాయి. అవి ప్రభుత్వానివా, ప్రైవేట్ కంపెనీలవా అన్నది అర్ధం లేని ప్రశ్న. ఈ సరఫరాలు ఆపాలని పలువురు ప్రముఖులు ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదు. ఈ సరఫరాలు ఆపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన సూచనలూ లేవు. ఈ పరిస్థితుల కారణంగా భారతదేశం అంతర్జాతీయంగా ఇప్పటికే అప్రతిష్ట పాలైంది. ఆ వార్తలు వ్యాఖ్యలు ఏమీ ఇక్కడ రాకుండా ఎవరైతేనేమి తొక్కిపెడుతున్నారు. సమాజ వ్యవహరణ కూడా ఇదే ధోరణిలో ఉండటం సిగ్గు చేటవుతున్నది. మరొక వైపు చూస్తే, పాలస్తీనాను గుర్తించటమంటే హమాస్‌కు ఒక ‘బహుమతి’ ఇవ్వటమే అవుతుందని, అందువల్లనే తామందుకు అంగీకరించలేమని వాదిస్తూ వస్తున్న నెతన్యాహూ, ట్రంప్‌లు ఇపుడు ఐక్యరాజ్య సమితి సమావేశాలలో అదే మాట వల్లె వేసారు. అది ఏ పరిశీలనకూ నిలవని దొంగ సాకు మాత్రమే. వారి మాట నిజమని వాదన కోసం అనుకున్నా, అసలు హమాస్ అన్నదే లేని 1987కు ముందు గాని, ఆ సంస్థ ఎన్నికలలో గెలిచి అధికారానికి వచ్చిన 2007 వరకు గాని పాలస్తీనాను ఎందుకు గుర్తించలేదు? వారు తమ సాకులతో తమకు అత్యంత సన్నిహితులు, మొదటి నుంచి మద్దతుగా నిలిచిన వారు అయిన యూరోపియన్ దేశాలనే ఇపుడు ఒప్పించలేకపోతున్నారు.

వారంతా అంటున్నది, తాము పాలస్తీనాను గుర్తించిన సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో వివరించినది ఏమిటి? యథాతథంగా రెండు స్వతంత్ర దేశాలన్నది, 1917లో బాల్ఫర్ డిక్లరేషన్‌తో పాటు 1947లో ఇజ్రాయెల్‌ను సృష్టించినప్పటి నుంచి గల విధానం. తర్వాత 1993లో స్వయంగా అమెరికా చొరవతో జరిగిన ఓస్లో ఒప్పందం కూడా అదే. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి తీర్మానాలు చేసింది. ఇప్పటికి 150 దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. ఈ సుదీర్ఘ నేపథ్యం అట్లుండగా, పాలస్తీనా ప్రభుత్వంలో హమాస్ పాత్ర ఉండబోవటం లేదు. హమాస్ పేరిట, 2023 ఇజ్రాయెల్‌పై వారి దాడి పేరిట ఇజ్రాయెల్ సేనలు గాజా, వెస్ట్‌బ్యాంక్‌లలో సాగిస్తున్న దారుణాలు ఎంతమాత్రం ఆమోదించలేనివి. ఈ సమస్యకు ఎప్పటికైనా పరిష్కారం రెండు స్వతంత్ర దేశాలు ఏర్పాటు మాత్రమేనని అందరూ స్పష్టం చేస్తున్నారు. పాలస్తీనా ఏర్పడితే తాము వైదొలగుతామని హమాస్ సైతం పరోక్షంగా సూచించింది.
కాని, ఇజ్రాయెల్, అమెరికాలు కేవలం స్వప్రయోజనాలు కోసం హమాస్‌ను సాకుగా చూపుతూ, యావత్ ప్రపంచ అభిప్రాయానికి, మొత్తం చరిత్రకు, సకల అంతర్జాతీయ చట్టాలకు, అంతర్జాతీయ సంస్థల తీర్మానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.

ఇజ్రాయెల్ లక్షం గ్రేటర్ ఇజ్రాయెల్ సృష్టితో పాటు, మొత్తం పశ్చిమాసియా రూపురేఖలనే మార్చి తన అధీనంలోకి తెచ్చుకోవటం. ఈ మాట నెతన్యాహూ పలుమార్లు బాహాటంగానే ప్రకటించారు. అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఈ విధమైన ఇజ్రాయెల్ ప్రయోజనాలతో అల్లుకుపోయి ఉన్నాయి. అందువల్లనే ఇరువురూ ఆ అజెండాను ఉమ్మడిగా అమలు పరుస్తున్నారు. ప్రపంచాభిప్రాయాన్ని ధిక్కరిస్తున్నారు. దీనంతటి వెనుక అమెరికాలోని బలమైన యూదు లాబీ పనిచేయటం అందరికీ తెలిసిందే. విషాదం ఏమంటే అరబ్ రాజ్యాలలోనూ అనేకం తమ ప్రయోజానాల కోసం అమెరికా, ఇజ్రాయెల్‌లకు లొంగిపోయాయి. ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి సైతం వారికి తగిన వివేకాన్ని కలిగించలేకపోయింది. తిరిగి భారతదేశం విషయానికి వస్తే, గ్లోబల్ సౌత్ నాయకురాలు కాగోరే ఇక్కడి ప్రభుత్వంగాని, గత రికార్డులు అనేకం చెప్పుకుని గర్వించే పౌర సమాజంగాని ఈ విధంగా చేష్టలుడిగి వ్యవహరించటం అవమానకరమైన స్థితి.

టంకశాల అశోక్

Also Read: సుంకాల దెబ్బతో ‘స్వదేశీ’ గానం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News