Tuesday, May 21, 2024

24 గంటల్లో గాజాను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడి చేసి 250 మందిని బందీలుగా చేసుకోవడంతో గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకు పడుతోంది. ఇప్పటికే 1500 మందికి పైగా మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. హమాస్ చెరలో ఇంకా దాదాపు 150 మంది ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరులు బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని టన్నెళ్లలో బంధించినట్లు తెలుస్తోంది. వారికి విడిపించడానికి ఇజ్రాయెల్ గౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే గాజాలోని పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 24 గంటల్లో ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పౌరులు ఆ ప్రాంతాన్ని వీడాలని ఐడిఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ మిలిటెంట్లు పౌరులను రక్షణ కవచాలుగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని, రాబోయే రోజుల్లో గాజానగరంపై ఐడిఎఫ్ దాడులను పెంచనుందని, ఇందులో అమాయకులైన పౌరులకు నష్టం వాటిల్లకూడదని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ విషయాన్ని తాము ఐక్యరాజ్య సమితికి కూడా తెలియజేసినట్లు పేర్కొంది. ఈ ప్రకటన ఇప్పటికే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న పాలస్తీనియన్లలో మరింత భయాందోళనలను రేకెత్తిస్తోంది. అయితే ఈ ఆదేశాలపై ఐక్యరాజ్య సమితి తీవ్ర అభ్యంతరాలు తెలియజేసింది. ఈ పరిణామాలు దారుణమైన మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో స్కూళ్లు, క్లినిక్‌లు నడుపుతున్న ఐరాస కేంద్రాలు, సిబ్బంది కూడా ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి ఉంటుందని, ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని ఐరాస పేర్కొంది.

అంతేకాకుండా ఆస్పత్రుల్లోని క్షతగాత్రులను, ఇతర రోగులను తక్షణం తరలించడం సాధ్యం కాని పనని వైద్యులు అంటున్నారు. ఉత్తర గాజాలో హమాస్ మిలిటెంట్లు టన్నెళ్లలో దాగి ఉన్నారని, వారిని పట్టుకునేందుకే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఐడిఎఫ్ పేర్కొంది. తాజా పరిణామాలను గమనించినట్లయితే గాజాపై గ్రౌండ్ ఆపరేషన్‌కే ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆస్పత్రులు, సూళ్లు, పౌరనివాసాలపై దాడులు జరపకుండా సైన్యం రక్షణ కల్పిస్తుందా అన్న విలేఖరుల ప్రశ్నలకు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి హగరీ సమాధానమిస్తూ అది ‘వార్ జోన్’ అని చెప్పారు. కాగా ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటికే దాదాపుగా 4.23 లక్షల మంది గాజా ప్రాంతంలోని తమ ఇళ్లను చేసి పారిపోయారని ఐరాస వర్గాలు అంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News