ఇజ్రాయెల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గాజా సిటీని మిలిటరీ ఆధీనంలోకి తీసుకోవాలన్న ఆ దేశ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు ప్రణాళికకు పచ్చజెండా ఊపింది. గాజా స్వాధీనానికి భద్రత వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపిందని శుక్రవారంనాడు నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఐదు సూత్రాల ఆధారంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో హమాస్‌ను పూర్తిగా నిరాయుధీకరణ చేయడం ప్రధానమైంది. మరో నాలుగు సూత్రాల్లో బందీలను విడిచిపెట్టడం, గాజాలో నిస్సైనికీకరణ, పౌర పాలన పునరుద్ధరణ (హమాస్ లేదా పాలస్తీనా అథారిటీ),
ఇజ్రాయెల్ నియంత్రణలో గాజా అనేవి మిగతా సూత్రాలుగా ఉన్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో తాజా నిర్ణయం ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉంది. గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ బలగాలు సర్వసన్నద్ధమవుతున్నాయని నెతన్యాహూ కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ఇదిలావుండగా ఇజ్రాయెల్ ప్రకటనపై బ్రిటన్ తీవ్రంగా స్పందించింది. బ్రిటన్ ప్రధాని స్టార్ కీర్మర్ మాట్లాడుతూ నెతన్యాహూ నిర్ణయం తప్పిదమైనదన్నారు. ఇలాంటి నిర్ణయంలో ఆ ప్రాంతంలో మరింత రక్తపాతం పెచ్చరిల్లే ప్రమాదం ఉందన్నారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.