Friday, May 3, 2024

చినుకు పడదు…చింత తీరదు

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుణుడి జాడ కనిపించడం లేదు. రుతుపవనాల రాకతో మేఘామృతం అవుతున్నా వర్షం చుక్కలు మాయమవుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇంత వరకు కొన్ని వందల ఎకరాల్లో విత్తనంకు నోచుకోలేదు. వర్షం కోసం రైతులు చేయని పూజలు లేవు,మొక్కని దేవుళ్లు లేరు. వరుణుడి కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.అయినప్పటికీ వాన జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో రైతన్న పరిస్థితి రోజు రోజుకు దీన స్థితికి చేరుకుంటోంది. ఒక వైపు ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల భీభత్సం సృష్టిస్తుండగా, ఇక్కడేమో కరువు చాయలు అలుముకుంటున్నాయి. ఇప్పటికే విత్తులు వేసుకున్న రైతులు సరైన వర్షాలు రాక పోవడంతో విత్తులు భూమిలోనే పాడై పోవడంతో లక్షలాది రూపాయలు నష్టపోయారు.

మరో వారం రోజుల్లో వర్షాలు కురువక పోతే మరింతగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ఆదేవన చెందుతున్నారు. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలో కాస్త వర్షాలు కురవగా, మిగతా జిల్లాలో వర్షం చుక్క జాడ లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే రైతుల కోసం రైతు బంధు నిధులు జమ చేసి కొంత ఉపశమనం కల్గించినప్పటికీ తీవ్ర వర్షాభావ పరిస్ధితుల నేపథ్యంలో దిక్కుతోచని స్థ్ధితిలో రైతాంగం ఉంది. మరో వైపు కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతుండడం, నిత్యావసర సరుకులు కూడా క్రమంగా పెరుగుతుండడంతో రైతుల పరిస్ధితులు మరింత అగమ్య గోచరంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 3,77,917 హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్ పంటలైన పాడి,రెడ్ గ్రాం,క్యాస్టర్, జవార్, మిజ్రా, రాగి, గ్రీన్ గ్రాం, కాటన్ తదితర పంటలు రైతులు పండించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది అత్యధికంగా రైతులు పత్తి పంటకే మెగ్గు చూపారు.

అత్యధికంగా 1,15,845 ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశాలు ఉండగా అందులో 50 శాతం ఇప్పటికే పత్తి పింటలు వేసుకున్నారు. కొందరు రైతులు వర్షాలు రాక ముందే వట్టి భూముల్లోనే నాటుకున్నారు. సరైన వర్షాలు కురువక పోవడంతో పత్తి రైతులు నట్టేట మునిగిపోయారు. పత్తి 750 గ్రాములు రూ. 800 నుంచి నుంచి రూ,. 1000 చొప్పున ఎకరాకు రూ. 3 ప్యాకెట్లు అనుకున్నా, విత్తనం కే ఎకరాకు రూ. 3 వేలు, నాటేందుకు ఎకరాకు రూ. 2 వేలు, ఇతర ఎరువులు, వ్యవసాయ సేద్యం ఇలా మెత్తం ఎకరంకు రైతులు సుమారుగా రూ. 10 వేలకు పైగా ఖర్చు పెట్టుకున్నారు. సరైన వర్షాలు రాక పోవడంతో పత్తి రైతులు తీ వ్రంగా నష్టపోయారు. గద్వా ల, నారాయణ పేట జిల్లాలో ఇప్పటికీ వట్టి భూములే కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటికే పచ్చని పంట పొలాలతో కళకళలాడాల్సిన పంట పొలాలు నేడు బీడు భూములుగా కనిపిస్తున్నాయి.
జలకళ లేని ప్రాజెక్టులు : గత ఏడాది ఇప్పటికే జూరాల, శ్రీశలైం డ్యాంలు నీటి కలకలలాడేవి. అయితే ఈ సారి కర్నాటక, మహారాష్ట్రలో కూడా సరైన వర్షాలు కురవక పోవడంతో నదులుకు వరద నీరు లేక పోవడంతో ప్రాజెక్టులు నీటి నిల్వలు లేక విలవిల లాడుతున్నాయి. జూరాల ప్రాజెక్టు కెపాసిటి 11.941 టిఎంసిల కెపాసిటి ఉండగా, శ్రీశైలం డ్యాం కెపాసిటి 216 టిఎంసిలు ఉంది. అయితే ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవక పోవడంతో రెండు ప్రధాన ప్రాజెక్టులు వెలవెల బోతున్నాయి. గత ఏడాది రెండు ప్రాజెక్టులు కూడా నిండుకుండలను తలపించే విధంగా ఉండేవి.

అయితే ఈ సారి ఇప్పటి వరకు వరద జాడ కనిపించడం లేదు. అటు తుంగభద్ర డ్యాంలో కూడా నీరు లేక పోవడంతో తుంగభద్ర, కృష్ణా నదులకు నీరు రావడం లేదు. కనీసం ప్రాజెక్టులకైనా నీరు వచ్చి ఉంటే నీటిని చిన్న చిన్న చెరువులుకు, ప్రాజెక్టులకు తరలించుకొని రైతులకు నీరు ఇచ్చే అవకాశాలు ఉండేవి. డ్యాంలలో నీరు లేక పోవడంతో అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు.
కూలీలు పస్తులే : అన్నింటికి మూలం వ్యవసాయమే. వ్యవసాయం సక్రమంగా ఉంటేనే అందరు సుఖంగా ఉంటారు. వ్యవసాయం బాగ లేక పోతే అందరకి నష్టమే. ప్రస్తుతం వర్షాలు లేక పోవడంతో ఆ ప్రభావం కూలీలపైన పడుతోంది. వ్యవసాయ పనులు లేక పోవడంతో కూలీలలకు పనులు లేకుండా పోతున్నాయి. ఉపాధి హామీ పనులు ఉన్నా అనేక మంది వ్యవసాయ పనులపైనే ఆధారపడుతుంటారు.రైతులకే పనులు లేక పోవడంతో కూలీలకు పనులు లేకుండా పోయాయి., వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరో వైపు కొండెక్కుతున్న టమోట, పచ్చిమిర్చి : ఒక వైపు వర్షం జాడ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరో వైపు కాయగూరల ధరలు వెక్కిరిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ట మోట,పచ్చిమిర్చి కొండెక్కి కూర్చున్నాయి. కిలో టమోట రూ. 150 నుంచి 180 కి పలుకుతోంది. పచ్చిమిర్చి కూడా రూ. 130 దాక పలుకుతోంది. వీటితో పా టు ప్రతి కాయగూరల ధరలు కిలో రూ. 100 దాక పలుకుతున్నాయి.

దీంతో సామాన్య మద్య తరగతి ప్రజలతో పాటు రైతు కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు నిత్యావసర సరుకులు కంది పప్పు, నూనె, ఆల్లం వెల్లుల్లి, ఉల్లిగడ్డలు ధరలు సైతం పెరుగుతున్నాయి. దీంతో పేదలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. అయితే రైతులు కాయగూరల పంటలు పండిద్దామనుకుంటున్నా వర్షం కురవక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కాయగూరలు వేసుకున్న రైతులు మాత్రం కొంత వరకు లాభ పడుతున్నారు.
ఎప్పటి కప్పుడు పరిశీలిస్తున్నాం : వ్యవసాయ శాఖ జెడి
జిల్లాలో ఖరీఫ్‌లో సరైన వర్షాలు కురవ లేదని, అయితే ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులతో పరిశీలించి అంచనాలు వేసి ప్రభుత్వంకు నివేదికల అందిస్తామని వ్యవసాయ శాఖ జెడి వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అన్ని సిద్ధ ంగా ఉంచామని, నకిలీ విత్తనాల అమ్మే వారిపై కూడా నిఘా ఉంచి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో వర్షాలు కరిసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News