Sunday, May 5, 2024

జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -
JEE Advanced results released

 

టాప్ టెన్‌లో తెలుగు విద్యార్థికి 2వ ర్యాంకు
నగరానికి చెందిన హార్ధిక్ రాజ్‌పాల్‌కు ఆలిండియా 6వ ర్యాంకు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్‌ఐటిలలో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా గత నెల 27వ తేదీన నిర్వహించిన పేపర్- 1 పరీక్షకు 1,51,311 మంది విద్యార్థులు హాజరుకాగా, పేపర్ – 2 పరీక్షకు 1,50,900 మంది హాజరయ్యారు. జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాలలో 43,204 మంది అర్హత సాధించారు. వీరిలో 6,707 మంది బాలికలు, 36,497 మంది బాలురు ఉన్నారు. గత ఏడాది 38,705 మంది అర్హత సాధించగా, ఈ ఏడాది అర్హత సాధించిన వారి సంఖ్య పెరిగింది. ఈ ప్రతిష్టాత్మక పరీక్షల్లో మహారాష్ట్రలోని పూణెకు చెందిన చిరాగ్ ఫలోర్ 352/396 స్కోర్ సాధించి ఆలిండియా టాపర్‌గా నిలవగా, ఎపిలోకి కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి ద్వితీయ ర్యాంకు సాధించారు.

315 మార్కులు సాధించిన కనిష్క మిట్టల్ బాలికల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో జనరల్ కేటగిరీలో 17,823 మంది ఉత్తీర్ణత సాధించగా, జనరల్ కేటగిరీ(ఇడబ్లూఎస్) కేటగిరీలో 5,087 మంది, ఒబిసి-ఎన్‌సిఎల్ కేటగిరీలో 9,195 మంది, ఎస్‌సి కేటగిరీలో 7,852 మంది, ఎస్‌టి కేటగిరీలో 2,811 మంది ఉత్తీర్ణత సాధించారు. జనరల్ కేటగిరీలో బల్లర్‌పూర్‌కు చెందిన గుప్త కార్తికేయ చంద్రేష్ మొదటి ర్యాంకు సాధించగా, జనరల్ కేటగిరీ(ఇడబ్లూఎస్) కేటగిరీలో గంగుల భువన్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించారు. అలాగే ఒబిసి-ఎన్‌సిఎల్ కేటగిరీలో లండ జితేంద్ర, ఎస్‌సి కేటగిరీలో అవి ఉదయ్, ఎస్‌టి కేటగిరీలోప్రన్‌జాల్ సింగ్‌లు మొదటి ర్యాంకు సాధించారు.

టాప్ టెన్‌లో తెలుగుతేజం

జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో టాప్ 2 ర్యాంకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంగుల భువన్‌రెడ్డి ఆలిండియా స్థాయిలో రెండవ స్థానం సాధించగా, హైదరాబాద్‌కు చెందిన హార్ధిక్ రాజ్‌పాల్ ఆరవ ర్యాంకు సాధించారు. ఎపిలోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి తండ్రి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తున్నారు. తల్లి వరలక్ష్మి గృహిణి. మధ్యప్రదేశ్‌కు చెందిన హార్ధిక్ రాజ్‌పాల్ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. హార్ధిక్ రాజ్‌పాల్ తండ్రి జితేంద్ర రాజ్‌పాల్ ఇంటర్నేషనల్ ట్రావెల్ హౌస్‌లో సీనియర్ ట్రావెల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి విభ రాజ్‌పాల్ రాక్‌వెల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సీనియర్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నారు. హుజుర్‌నగర్‌కు చెందిన నిమ్మల అభిలోకేష్ ఒబిసి కేటగిరీలో జాతీయ స్థాయిలో 71వ ర్యాంకు సాధించారు.

కొంతమంది ఉపాధి కల్పిస్తా : ఆకాష్‌రెడ్డి, ఆలిండియా 4వ ర్యాంకు

ముంబయి ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చేరతానని ఆలిండియా స్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన భువన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభించి కొంతమందికి ఉపాధి కల్పిస్తానని తెలిపారు. జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో రెండవ ర్యాంకు వచ్చింనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మా తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో కష్టపడి చదవడం వల్లనే ఆలిండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకు లభించిందని పేర్కొన్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవుతా : హార్ధిక్ రాజ్‌పాల్, ఆలిండియా 6వ ర్యాంకు

ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీగ్ అవుతానని జాతీయ స్థాయిలో ఆరవ ర్యాంకు సాధించిన హార్ధిక్ రాజ్‌పాల్ తెలిపారు. ప్రణాళికాబద్దంగా కష్టపడి చదివానని అన్నారు. జాతీయ స్థాయిలో ఆరవ ర్యాంకు రావడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

నేటి నుంచి ప్రవేశాలకు చాయిస్ ఫిల్లింగ్

జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు నుంచే ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందే సంస్థల్లో (జిఎఫ్‌టిఐ) ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా 23 ఐఐటిలు, 32 ఎన్‌ఐటిలు, 26 ట్రిపుల్‌ఐటిలతో పాటు మరో 30 ప్రభుత్వ ఆర్థిక సహాకారంతో నడిచే జెఎఫ్‌టిఐల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ, నవంబర్ 9 వరకు కొనసాగనుంది.

రిజిస్ట్రేషన్ నుంచి సీట్ అలాట్‌మెంట్,రిపోర్టింగ్ వరకూ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ప్రవేశాల ప్రక్రియ ఈ సారి ఆలస్యమైనందున ఈ సారి ఒక విడతను తగ్గించారు. ఈ సారి ఆరు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. విద్యార్థులు జోసా వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకుని అందుబాటులో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సుల ఆధారంగా ఆసక్తి మేరకు ప్రాధాన్యతలు ఎంపిక చేసుకోవాలి. ఇలా ప్రాధాన్యతలు ఇచ్చిన అభ్యర్థుల ర్యాంకు,వారు పేర్కొన్న బ్రాంచ్, ఇన్‌స్టిట్యూట్ ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News