Tuesday, April 30, 2024

‘ఏదో ఒకరోజు మీ అహంకారం కూడా ధ్వంసమవుతుంది’..

- Advertisement -
- Advertisement -

కంగన ఆఫీసును కూల్చివేసిన బిఎంసి
కార్యాలయం కూల్చివేతపై బొంబాయి హైకోర్టు స్టే
కట్టుదిట్టమైన భద్రతతో ముంబయి చేరుకున్న రనౌత్
వీడియో సందేశంలో సిఎం ఉద్ధవ్‌పై కంగన ఫైర్

ముంబయి:  ముంబయిలోని బాంద్రాలో ఉన్న కంగనా రనౌత్ కార్యాలయాన్ని అక్రమ కట్టడంగా నిర్ధారిస్తూ బృహన్‌ముంబయి మునిసిపల్ కార్పొరేషన్(బిఎంసి) అధికారులు బుధవారం కూల్చివేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కల్పించిన వై ప్లస్ క్యాటగిరి భద్రత మధ్య బుధవారం మధ్యాహ్నం ముంబయి చేరుకున్న కంగనకు విమానాశ్రయం వెలుపల శివసేన కార్యకర్తలు నల్ల జెండాలతో స్వాగతం పలికారు. సిఆర్‌పిఎఫ్ భద్రత నడుమ ఆమె నేరుగా నగర శివార్లలోని ఖర్‌లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. ఆమె ఇంటి వద్ద కూడా శివసేన కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడ కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. తన నివాసం నుంచే కంగన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఒక వీడియో సందేశాన్ని పంపించారు. తన కార్యాలయాన్ని కూల్చివేయడంపై ఆమె స్పందిస్తూ.. నా ముంబయి ఇప్పుడు నిజంగానే పాక్ ఆక్రమిత కశ్మీరుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. తన కార్యాలయంలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు జరగలేదని ఆమె స్పష్టం చేశారు. తన పట్ల చూపించిన క్రౌర్యానికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానని ముఖ్యమంత్రికి ఆమె చెప్పారు. ఏదో ఒక రోజు మీ అహంకారం కూడా నా ఇల్లు ధ్వంసమైనట్లుగా ధ్వంసమవుతుందని ఆమె ఠాక్రేను ఉద్దేశించి అన్నారు. తన పరిస్థితిని కశ్మీరీ పండితులతో ఆమె పోలుస్తూ తాను అయోధ్యపైనే కాక కశ్మీరుపై కూడా ఒక సినిమా తీస్తానని తెలిపారు. పాక్షికంగా కూల్చివేసిన తన కార్యాలయానికి సంబంధించిన వీడియోలను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డెత్ ఆఫ్ డెమాక్రసి(ప్రజాస్వామ్య హత్య) అని వాటికి ఆమె కామెంట్ పెట్టారు.

కాగా, కంగనా రనౌత్ తన కార్యాలయ భవనాన్ని కూల్చివేయడంపై తన న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖి ద్వారా బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కూల్చివేతపై బుధవారం స్టే ఇచ్చినప్పటికీ అప్పటికే బిఎంసి అధికారులు కార్యాలయాన్ని కూల్చివేయడం పూర్తయింది. కంగన తరఫున న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం కోరుతూ బిఎంసికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. గురువారం సాయంత్రం 3 గంటలకు ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనున్నది. కంగనా తన బంగళాలో చట్టవిరుద్ధంగా మార్పులు చేశారంటూ బిఎంసి అధికారులు మంగళవారం నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.

https://twitter.com/KanganaTeam/status/1303636961131782147?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1303636961131782147%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Fi-will-take-revenge-on-cm-uddhav-thackeray-says-kangana-ranaut-77636

Kangana Ranaut fires on CM UDdhav Thackeray

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News