Thursday, May 2, 2024

కెసిఆర్ మైనారిటీల బాంధవుడు

- Advertisement -
- Advertisement -

Minorities

 

వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు
ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్‌లో
రూ. 2వేల కోట్లు కేటాయించారు
టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది
అందుకే రెండో సారి కూడా కెసిఆర్‌కు జై కొట్టారు
శాసనసభలో అక్బరుద్దీన్

హైదరాబాద్ : శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మజ్లిస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ, రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు అపార నమ్మకముందన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వానికి రెండోసారి కూడా ప్రజలు జై కొట్టారన్నారు. మైనార్టీల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్దమొత్తంలో నిధులు కేటాయించిన దాఖలాలు లేవన్నారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి సహకరం అందించడం లేదన్నారు. దేశానికే ఆదర్శఁగా మారిన కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా రాకపోవడం విచారకరమన్నారు. పైగా కేంద్రం తీసుకొచ్చిన జిఎస్‌టి వల్ల రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు భారీగా నష్టపోయాయన్నారు. కాగా కృష్ణా ఫేస్…2 జలాలు పాతబస్తీ నుంచి పోతున్నప్పటికీ అక్కడ నీరివ్వకుండా శివారు ప్రాంతాలకు తరలించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పాతబస్తీకి కూడా తాగునీరిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పాతబస్తిలో మెట్రోరైల్ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని సూచించారు.

అంబర్‌పేట్‌లో రోడ్డు విస్తరణ సందర్భంగా తొలగించిన మజిద్‌ను తిరిగి పునర్ నిర్మించాలన్నారు. పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉస్మానియ ఆసుపత్రి ప్రస్తుతం దయనీమైన పరిస్థితిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగినన్ని నిధులు కేటాయించి తిరిగి పునర్‌వైభవం కల్పించాలని సూచించారు. అలాగే తెలంగాణ వాదం పుట్టిన ఉస్మానియా యూనివర్సిటీలో చాలా కాలంగా విసిల భర్తీ కాకపోవడం వల్ల యుజిసి గుర్తింపుకే ప్రమాదం ఏర్పడిందని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సిఎం అగమేఘాల స్పందించి యూనివర్సిటీలకు తగు నిధులతో పాటు ఖాళీగా ఉన్న విసిల భర్తీ ప్రక్రియను త్వరగా చేపట్టాలని సూచించారు.

ఆర్ధిక మాంద్యం ఉన్నా….
దేశం మొత్తం ఆర్థిక మాంద్యంతో సతమతం అవుతున్నా రాష్ట్రంలో మాత్రం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క రూపాయి కూడా కోత విధంచకుండా సిఎం కెసిఆర్ పాలన సాగిస్తున్నారని ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ అన్నారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆర్థికసాయం అంతంతమాత్రంగానే ఉన్నా ఏ ఒక్క సంక్షేమ పథకానికి ప్రభుత్వం కోత విధించలేదని గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లోని ప్రజల సంతోషం గవర్నర్ ప్రసంగంలో ప్రతిబింబించిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాసులకు న్యాయం జరగలేదన్నారు. ఆసరా పింఛన్ లక్షల మంది అభ్యాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. గతంలో నెలకు రూ.200గా ఉన్న పెన్షన్‌ను టిఆర్‌ఓఎస్ హయంలో దానిని రూ.2 వేలకు పెంచామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల కళ్లలో ఆనందం చూస్తున్నాం.

పేద పిల్లలకు నాణ్యమైన చదువు, సంపూర్ణ భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. గురుకుల, సంక్షేమ పాఠశాలల్లో వసతులు కల్పించినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లతో నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. టిఆర్‌ఎస్ హయాంలోనే రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. వ్యవసాయం దండగ అన్నమాట నుంచి వ్యవసాయం పండగ దిశకు ప్రభుత్వం తీసుకెళ్తోందన్నారు. రైతు బీమాతో పేద రైతులను ఆదుకుంటున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీరు అందుతోందన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో టిఎస్ ఐపాస్ విజయవంతమైందన్నారు. అభివృద్ధి విషయంలో సిఎం కెసిఆర్ మంత్రులతో సమానంగా పార్టీలతో సంబంధం లేకుండా శాసనసభ్యులకు నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు.

నవ్వుల పాలైన రాజాసింగ్….
అసెంబ్లీలో ఏకైక బిజెపి శాసనసభ్యుడు రాజ్‌సింగ్ సరైన వివరాలతో రాకుండా ప్రసంగం చేసి నవ్వులపాలయ్యారు. కెసిఆర్
కిట్ పథకం గురించి మాట్లాడుతూ, గర్భిణీలకు ఆరు వేలు రూపాయలు ఇస్తున్నారని అనగానే టిఆర్‌ఎస్ సభ్యులు రూ.
12వేల అంటూ పెద్దగా అరిచారు. అలాగే రైతుబీమా పథకం కింద చనిపోయిన రైతుల కుంటుంబాలను ఆదుకునేందుకు కేవలం రెండు లక్షల రూపాయలే ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై కూడా సభలో ఉన్నవారంతా సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. రైతుబీమా కింద రెండు లక్షలు కాదని ఐదు లక్షల రూపాయలను ఇస్తున్నామని అధికార పార్టీ సభ్యులు చెప్పారు. దీంతో రాజాసింగ్ మరోసారి తన ప్రసంగాన్ని సరిచేరుకోవాల్సి వచ్చింది. వెంటనే ఐదు లక్షలు కాదని….పది లక్షలు ఇవ్వాలని సూచించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి… వాటిని ఏ మేరకు ఖర్చు చేస్తున్నారన్న విషయాన్ని కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పించి ఉండాల్సిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గొప్పుగా చెప్పుకుంటున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు కూడా కేంద్రం నుంచి ఆర్ధిక సాయం అందుతోందన్నారు. ఇక తన నియోజకవర్గంలోని గుడుంబా తయారీదారుల గురించి తనకు తెలుసన్న సిఎం కెసిఆర్.. వారి మాటే మర్చిపోయారన్నారు. ధూల్‌పేట్‌కు వస్తానని స్వయంగా తనతో సిఎం కెసిఆర్ చెప్పారని.. ఎంతో మంది గుడుంబా తయారీదారులు ఉన్నారని చెప్పిన ఆయన.. వారిని ఆదుకుంటామని మాటిచ్చారన్నారు.కానీ ఇప్పటి వరకు అక్కడకు రాలేదన్నారు. గుడుంబా తయారీని అరికట్టేందుకు ఎంతమందికి ఆర్థికసాయం అందించారన్న విషయం గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు. అలాగే తెలంగాణ రావాలని ఎంతో మంది యువకులు ప్రాణం త్యాగం చేశారన్నారు. అమరుల కుటుంబాలకు పది లక్షలు ఇచ్చారని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారన్నారు. అయితే ఎంత మందికి ఇచ్చారన్న వివరాలు గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు.

ఇంకా గత పాలకులపై విమర్శలు చేయడం మంచిది కాదు
గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గత పాలకులపై విమర్శలు చేయించడం సబబుగా లేదని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సీతక్క వ్యాఖ్యానించారు. గత పాలకులు తీసుకున్న నిర్ణయాలలో ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న చాలా మందికి భాగస్వామ్యం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వాల హయంలో అసలు అభివృద్దే జరగనట్లు అధికార పార్టీ సభ్యులు, మంత్రులు మాట్లాడడం తగదన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పాలన ఆరేళ్ళుగా కొనసాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేప్టటిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పాలే కాని గత ప్రభుత్వాలపై ఆడిపోసుకోవడం వృధా అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించాలని ఆమె సూచించారు.

KCR contributes to Welfare of Minorities
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News