Tuesday, April 30, 2024

ఇది లిల్లిపుట్ల ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెం డు సీట్లు కూడా రావన్న భయం సిఎం రేవంత్‌రెడ్డికి పట్టుకుందని, అందుకనే నారాయణపేట సభలో భయంతో ఇష్టానుసారం మాట్లాడిండని బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సిఎం కెసిఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా, సుల్తాన్‌పూర్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన జహీరాబాద్, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిద్దిపేట తరహాలో రాష్ట్రంలోని రైతులంతా పోస్టు కార్డు ఉద్యమం చేపట్టాలని పిలపునిచ్చారు. ‘ఒక స ర్వేలో కాంగ్రెస్‌కు రెండు ఎంపి సీట్లు కూడా రావన్న సంగతి తేలిందట, సి ఎంతో పాటు, ఆయన మనుషులు  భయపడుతున్నారు’..అని కెసిఆర్ అన్నారు. ఈ సిఎం ఇక్కడ ఒక మాట, ఢిల్లీపోయి ఒక మాట మాట్లాడుతుండని విమర్శించారు.

‘వాళ్లు గెలిచినందుకు మాకు ఎలాంటి ఈర్ష లేదు…బద్ధ శత్రువు మోడీతో రేవంత్ దోస్తీ చేస్తున్నారని అందువల్ల ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండకపోవచ్చు’ అని కెసిఆర్ అన్నారు. నారాయణపేట సభలో వాళ్ల భయం చూస్తే అలాగే కనపడిందని అన్నారు. ఈ లిల్లీపుట్‌గాళ్ల పాలన అంతా ఆగమాగం అని ఎద్దేవా చేశారు. ‘ఎవరూ భయపడొద్దు..మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తెస్తాను. రైతులతో పాటు, అన్ని వర్గాల ప్రజలకు రైతుబంధు, దళిత బంధు ఇతర పథకాలన్నింటినీ ఇస్తాను’ అని అన్నారు. రైతులకు బోనస్ ఏమయింది? డిసెంబర్ 9న ఇస్తామన్నారు, ఇప్పుడేమో పంద్రాగస్టు అంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి తమ పార్టీ తరపున ఎలాంటి ఫిర్యాదు చేయబోమని, ప్రభుత్వం వెంటనే బోనస్ ఇవ్వాలని సూచించారు. ఈ ప్రభుత్వానికి దేనిమీదా నియంత్రణ లేదని మండిపడ్డారు. పొలాలన్నీ బీళ్లు పడ్డాయని, కొద్దొగోప్పో పండిస్తే, ధాన్యాన్ని కొనే నాధుడే లేడని అన్నారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు రైతును కంటికి రెప్పలాగా కాపాడుకున్నామని గుర్తు చేశారు. మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఎందుకు కాలిపోతున్నాయి? కరెంటు ఎందుకు పోతున్నది? రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఒక్కరికైనా వచ్చిందా ? అని అడిగారు. ఎన్నికలప్పుడు వాళ్లు ఇచ్చిన హామీలు మెడలు వంచి అమలు చేయించాలంటే…ఓటును బిఆర్‌ఎస్‌కే వేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిని, ఉద్యమకారుడు గాలి అనిల్‌కుమార్‌ను గెలిపించాలన్నారు. కరీంనగర్ జిల్లాలో తమ కార్యకర్తపై అక్రమ కేసు పెట్టారని, ఇది తగదని డిజిపికి సూచించారు. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రజలతో కలిసి తిరగబడతామని హెచ్చరించారు. ఈ సభకు వచ్చేటప్పుడు ప్రజల్ని కొందరు పోలీసులు అడ్డుకున్నారని, ఫ్లెక్సీలను కొందరు చించివేశారని, ఇది మంచి పద్ధతి కాదని పోలీస్‌లను హెచ్చరించారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయలేదని అన్నారు. తాము కూడా రికార్డు రాస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు.

‘రాజకీయాలు మీకు అక్కర్లేదు.. అరాచకాలు బంద్ చేయండి’ అని పోలీసులను ఉద్దేశించి అన్నారు. అంబేద్కర్ జయంతి నాడు ఆ మహానుభావుడికి ఒక్క దండ కూడా వేయకుండా అవమానించారు. ఇంత అహంకారమా? ఇంత అజ్ఞానమా? కండ కావరమా? అని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాము కట్టించినందుకే సిఎం ఇలా చేసిండని, అలాంటప్పుడు తాము కట్టించిన సెక్రటేరియట్‌లో సిగ్గు లేకుండా ఎలా కూర్చుంటున్నారని, యాదగిరిగుట్టకు పోయి ఎలా మొక్కుతున్నారని ప్రశ్నించారు. ‘అప్పుడప్పుడు ప్రజా స్వామ్యంలో లిల్లీపుట్‌గాళ్లకు అధికారం వస్తది, వారి గుణమేందో తెలుస్తది, ఇప్పుడదే జరుగుతున్నది’ అని అన్నారు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రజలను నానా ఇబ్బందులుపెట్టిందని, ప్రజలు తిరగపడ్డారని గుర్తు చేశారు. బిజెపికి ఓటు వేసినా, మంజీరా నదిలో వేసినా ఒకటే అని అన్నారు. ఆ పార్టీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని అన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, ఎంఎల్‌సిలు షేరి సుభాస్‌రెడ్డి, దేశపతి శ్రీనివాసరావు, ఎంఎల్‌ఎలు చింతా ప్రభాకర్, సునితా లకా్ష్మరెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు పద్మాదేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్, నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, మఠం బిక్షపతి, దేశపతి శ్రీనివాస్, మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News