Sunday, April 28, 2024

నిన్నటి మావోయిస్టు కోబాడ్ గాంధీ!

- Advertisement -
- Advertisement -

74 ఏళ్ల వయసున్న కోబాడ్ గాంధీ విద్యార్ధి దశలోనే మార్క్సిజానికి ఆకర్షితుడై సుమారు 4 దశాబ్దాలు మన దేశంలోని విప్లవ సంస్థలతో కలిసి పని చేసి మావోయిస్టు పార్టీ ముఖ్యనేతగా కొనసాగుతూ 2009 లో ఢిల్లీలో పోలీసుల చేతికి చిక్కారు. పదేళ్ల పాటు దేశంలోని పలు జైళ్లలో ఖైదీగా గడిపి బెయిలుపై బయటకొచ్చాడు. ఆయనపైనున్న 18 కేసుల్లో కొన్ని కొట్టుడుపోగా ఇంకా 10 కేసులు విచారణలో ఉన్నాయి. కోబాడ్ గాంధీ జీవన వివరాల్లోకి పోయేముందు ఆయన ఇంతకాలం పని చేసిన మావోయిస్టు పార్టీ నవంబర్ 27 న ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం ప్రస్తావించుకోవాలి.

నక్సలైట్లలో పెద్దగా చదువుకున్నవారు ఉండరనే భావన మామూలుగానే చాలా మందిలో ఉంటుంది. విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితం గడిపేవారంతా సామాజికంగా, ఆర్థికం గా దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే అని అనుకునేవారు ఉంటారు. ఇందులో వాస్తవం కూడా ఉంది. అయితే ఇందుకు భిన్నంగా, చిత్రంగా కొందరు సంపన్న కుటుంబాలకు చెందినవారు మార్క్సిజం సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉన్నత విద్యని, విలాస జీవన స్థితిని వదిలేసి తీవ్రవాద కమ్యూనిస్టులతో కలిసి ఏళ్ల తరబడి కష్టాలను, నష్టాలను భరిస్తూ ఉద్యమంలో కొనసాగడం ఓ విశేషమే. అలాంటి వారిలో మహారాష్ట్రకు చెందిన కోబాడ్ గాంధీ ఒకరు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసున్న కోబాడ్ గాంధీ విద్యార్ధి దశలోనే మార్క్సిజానికి ఆకర్షితుడై సుమారు 4 దశాబ్దాలు మన దేశంలోని విప్లవ సంస్థలతో కలిసి పని చేసి మావోయిస్టు పార్టీ ముఖ్యనేతగా కొనసాగుతూ 2009 లో ఢిల్లీలో పోలీసుల చేతికి చిక్కారు.
పదేళ్ల పాటు దేశంలోని పలు జైళ్లలో ఖైదీగా గడిపి బెయిలుపై బయటకొచ్చాడు. ఆయనపైనున్న 18 కేసుల్లో కొన్ని కొట్టుడుపోగా ఇంకా 10 కేసులు విచారణలో ఉన్నాయి. కోబాడ్ గాంధీ జీవన వివరాల్లోకి పోయేముందు ఆయన ఇంతకాలం పని చేసిన మావోయిస్టు పార్టీ నవంబర్ 27 న ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం ప్రస్తావించుకోవాలి. మావోయిస్టు కార్యకలాపాలున్న చోట వివిధ స్థాయి ల్లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన్ని పార్టీ నుంచి తొలగించడానికి ప్రధాన కారణం ఈ మధ్య కోబాడ్ గాంధీ రాసిన పుస్తకమే అని చెప్పుకోవాలి. అక్టోబర్ 2019లో జైలు నుంచి బయటికొచ్చిన ఆయన ‘ది ఫ్రాక్చర్డ్ ఫ్రీడమ్: ఏ ప్రిజన్ మెమోర్’ అని ఇంగ్లీషులో 300 పేజీల పుస్తకం రాశారు. ఈ పుస్తకం రోలీ బుక్స్ అనే ప్రచురణ సంస్థ మార్చి 2021 లో ముద్రించి మార్కెట్లోకి తెచ్చింది.
ఇందులోని తొలి అధ్యాయాల్లో మన దేశంలోని జైళ్ల పరిస్థితిపై వివరణాత్మక పరిచయం ఉంది. ఉత్తరాది జైళ్లకన్నా దక్షిణాది వాటిలో సౌకర్యాలు, భోజన వసతి, అధికారుల ప్రవర్తన కాస్త మేలని రాశారు. జైలు జీవితంలో భాగంగా అక్కడ పరిచయమైన నేరస్థులు, అధికారులతో తనకు ఏర్పడ్డ స్నేహ సంబంధాల గురించి ప్రస్తావించారు. జైలు జీవితం మనిషిలో పరివర్తనను తెస్తుందని రాశారు. మొత్తానికి ఇన్నాళ్లు నమ్మినడిచిన బాటపై విశ్వాసం తగ్గినట్లు, ప్రస్తుత సమాజంలో సమూల మార్పును సాధించే దిశగా ఉద్యమాలు లేవు అన్న రీతిలో ఆయన అందులో వ్యాఖ్యానించారు. పదేళ్ల జైలు జీవనం ఆయన్ని తిరిగి తన పుట్టుక, మూలాల్లోకి తీసికెళ్ళవచ్చు. కోబాడ్ గాంధీ ముంబైలోని శ్రీమంతులైన పార్శి కుటుంబంలో పుట్టాడు.
తండ్రి గ్లాక్సో కంపెనీలో సీనియర్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆయన చదువంతా దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థ అయిన డూన్ స్కూల్లో సాగింది. ఆ తర్వాత 1970 లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఛార్టర్డ్ అకౌంటెన్సీ చదవడానికి ఆయన ఇంగ్లాండుకు వెళ్ళాడు. అక్కడే మార్క్సిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై చదువు మధ్యలోనే వదిలేసి ఇండియాకు వచ్చేశాడు. ముంబై కేంద్రంగా పదేళ్ళ పాటు కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ అనే సంస్థతో కలిసి పనిచేశారు. అదే క్రమంలో 1981లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎంపికై పూర్తికాలపు అజ్ఞాత జీవితంలోకి వెళ్లిపోయారు. 2004లో పీపుల్స్‌వార్ మరిన్ని విప్లవ సంస్థలతో కలిసి మావోయిస్టు పార్టీ ఏర్పాటులోను ప్రముఖ భూమిక పోషించారు. పార్టీ ఇంగ్లీషు ప్రచార విభాగానికి సారథిగా ఉన్నారు. 2005 లో నేపాల్ లో మావోయిస్టు నేత అయిన ప్రచండతో జరిగిన సమావేశంలో పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. దక్షిణ ఢిల్లీలోని ఓ బస్టాండు వద్ద 17 సెప్టెంబరు 2009 అరెస్టయ్యేనాటికి ఆయన మావోయిస్టు పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీలోని తీహార్ జైలులో సహా దేశంలోని 6 రాష్ట్రాల జైళ్లలో గడిపినా ఎక్కువ కాలం విశాఖ జైల్లో గడిపారు. ఈయనకు నవంబర్ 1983 లో అనురాధ షాన్బాగ్ తో పెళ్లయింది. ఆమె కూడా మావోయిస్టు పార్టీలో ప్రధాన నేతగా పనిచేశారు. ముంబైకి చెందిన కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన ఆమె 1970 లో విద్యార్ధి దశలోనే విప్లవ రాజకీయాలకు ఆకర్షితురాలై పార్టీలో వివిధ బాధ్యతలను చేపట్టి సెంట్రల్ కమిటీ సభ్యురాలుగా ఎదిగారు. 2008 లో అనురాధ అజ్ఞాత జీవితంలోనే సెలెబ్రల్ మలేరియా సోకి 54 వ ఏట మరణించారు.
కోబాడ్ గాంధీని బహిష్కరిస్తూ మావోయిస్టు పార్టీ పలు అంశాలను ముందుకు తెచ్చింది. కోబాడ్ గాంధీ 2019 లో జైలు నుంచి బయటికొచ్చాక పార్టీతో ఎలాంటి సంప్రదింపుల ప్రయత్నం చేయలేదు. పుస్తకంలో రాసిన విషయాలపై పార్టీతో చర్చించలేదు. పుస్తకంలో ఉన్న చాల విషయాలు మార్క్సిజమ్ లెనినిజమ్ మావో ఆలోచన విధానాలకు భిన్నంగా, విరుద్ధ్దంగా ఉన్నాయి. మార్కిస్టు జీవన విధానంలో శాంతి, తృప్తి, స్వేచ్ఛ లేవని రాశాడు. ఉద్యమం తన లక్ష్యం చేరుకోవడంలో విఫలమైందని, వివిధ మాఫియాలతో పార్టీకి సంబంధాలున్నాయని అందులో ఉంది. తమ పార్టీ సిద్ధాంతాన్ని బలపరుస్తున్నట్లుగా, మద్దతుగా కాకుండా వాటిని వదిలేసినట్లుగా పాలకపక్షానికి వత్తాసుగా, నేటి ప్రభుత్వాలను వెనుకేసుకొస్తున్నట్లుగా పుస్తకంలో వ్యాఖ్యానాలున్నాయి. వీటి ఉటంకిస్తూ పార్టీ చిరకాల అనుయాయిని దూరం పెట్టింది.
పుస్తకంలోని అంశాలపై, పార్టీ వెలివేతపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాల్లో కోబాడ్ గాంధీ తన వాదనను సమర్థించుకున్నారు. పదేళ్ల జైలు జీవితకాలంలో తన ఆలోచనల్లో వచ్చిన మార్పును వ్యక్తపరచడానికి పుస్తకం రాశానన్నారు. భారతీయ మార్క్సిస్టులు ఉత్త పిడివాదులని, కొత్త ఆలోచనలను అంగీకరించడానికి సిద్ధంగా లేరని, కమ్యూనిజం ప్రపంచ వ్యాప్తంగా వెనుకడుగు వేస్తోందని అన్నారు. సిద్ధాంతం బాగానే ఉంది, సామ్యవాదం అణగారిన జనాల ఉన్నతికి సరియైనదే కాని ఆచరణ, విధానం విఫలమైందని ఆయన వాదన. విప్లవం అనివార్యం, ఏకైక మార్గం అనే పాత మాటలు వల్లించడం ఆపేసి తక్షణం ప్రజా సంక్షేమానికి కావలసినదేమిటో ఆలోచించాలి. 40 ఏళ్ళుగా సాగుతున్నా విప్లవోద్యమంపై ఈనాటి యువతకు దీని గురించి ఏమి తెలియదు, ఆసక్తి కూడా లేదు.
దీర్ఘకాల పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమే చివరికి ప్రజా రాజ్యం వచ్చితీరుతుంది అంటారుగాని ఆ మాటను విశ్వసించేవారు కరువైనారు. శ్రామికవర్గం పోరాటాల్లో అగ్రగామిగా నిలిచినపుడే అది ముందుకు పోతుంది అయితే ప్రస్తుతం దేశంలో సంఘటిత శ్రామిక శ్రేణులు లేవు. అందరు ఒప్పంద కార్మికులే. చేసి పని ఎంతకాలముంటుందో ఎవరికీ ఎలాంటి హామీ లేదు. ఆ బెంగతో వారు చేస్తున్న పనిని కాపాడుకోవడంలోనే తలమునకలై ఉంటున్నారు. రేపు ఎవరెక్కడ పనిచేస్తారో తెలియక కార్మిక ఐక్యత పూర్తిగా చెడింది. వర్గ దృక్పథం కూడా తగ్గిపోయింది. కుటుంబం పోషణ కోసం యజమాని ముందు రాజీ పడి బతుకుతున్నారు.జైలు జీవితం చట్టబద్ధమైనది, అదేమీ పరువు తక్కువ పని కాదు. పైగా జైల్లో చాలా మందికి సహజంగానే బుద్ధి మారిపోతుంది, భ్రమలు తొలిగిపోతాయంటారు. తనకు అదే జరిగింది అని అంటాడు కోబాడ్ గాంధీ. నమ్మిన సిద్ధాంతం నుండి దూరం జరిగేందుకు అనేక కారణాలుంటాయి. విశ్వాసం సడలిపోవచ్చు, మనోనిబ్బరం తగ్గిపోవచ్చు, అజ్ఞాతం కష్టమనిపించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో విప్లవోద్యమం నుంచి బయటికి రావడం కొత్తేమి కాదు. అయితే మేధావి వర్గానికి చెందిన కోబాడ్ గాంధీ 40 ఏళ్ల పోరాట జీవనంలోంచి బయటికొచ్చి ఉద్యమం సరైన దిశలో లేదని అంటూ, పార్టీని ఇరుకునపెట్టే రాతలు కొన్ని తన పుస్తకంలో రాయడం కొత్తగా ఉంది. తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుంది అనే సైద్ధాంతిక భూమిక ఒకవైపు, పరిస్థితులు సామూహిక తిరుగుబాటుకు అనుకూలంగా లేవు అని మాజీ మావోయిస్టు కోబాడ్ గాంధీ వాదన ఇంకో వైపు తక్కెడలో ఇరువైపులా ఉన్నాయి. ఇందులో ఎవరి వాదనలు వారికున్నా అశేష జనానికి ఏది సరిపోతే అదే కాలగమనాన్ని నిర్దేశిస్తుంది.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News