Tuesday, May 7, 2024

చెత్త డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం.. రూ.100 కోట్ల జరిమానా

- Advertisement -
- Advertisement -

కొచ్చి: కేరళ లోని కొచ్చిలో డంపింగ్ యార్డ్ వద్ద జరిగిన అగ్నిప్రమాద సంఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో అధికారుల నిర్లక్షానికి కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్ల జరిమానా విధించింది. కొచ్చి శివారు లోని బ్రహ్మపురం ప్రాంతంలో ఓ భారీ చెత్తకుప్ప వద్ద మార్చి 2న సాయంత్రం మంటలు చెలరేగాయి. మూడు రోజుల పాటు శ్రమించి మార్చి 5 నాటికి మంటలు ఆర్పారు. 30 అగ్నిమాపక యంత్రాలు, 14 భారీ వాటర్ పంపులు, నాలుగు హెలికాప్టర్లతో 350 మంది సిబ్బంది, 150 మంది సహాయక సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి వెలువడిన పొగ కొచ్చినగరమంతా దట్టంగా కమ్మేసింది. విషపూరిత వాయువుల వ్యాప్తి నగరం గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవ్వడంతో కొచ్చిలో రాష్ట్రప్రభుత్వం ఆరోగ్య మార్గదర్శకాలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.

మాస్క్‌లు ధరించాలని సూచించింది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడేవారి కోసం మెడికల్ క్యాంప్‌లు, ఆక్సిజన్ పడకలను అందుబాటులో ఉంచింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీ నిఘా లేదు. ఆ డంపింగ్ యార్డ్ నిర్వహణ బాధ్యతలను బ్రహ్మపురం వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ చూసుకుంటోంది. ఘటన నేపథ్యంలో ఆ ప్లాంట్‌ను మూసేశారు. ఈ ప్రమాదం కొచ్చిలో సంక్షోభ తరహా పరిస్థితులకు దారి తీసినట్టు మీడియా కథనాలు రావడంతో ఈ ఘటనపై ఎన్‌జీటీ సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. చెత్త కుప్పల వద్ద అగ్నిప్రమాదాలను నిరోధించడంలో కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విఫలమైనందుకు రూ.100 కోట్లు జరిమానా విధిస్తున్నట్టు ఎన్‌జీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పర్యావరణ పరిహారాన్ని నెలరోజుల్లోగా కేరళ చీఫ్ సెక్రటరీకి జమ చేయాలని ఎన్‌జీటీ ఛైర్‌పర్శన్ జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News