Thursday, May 2, 2024

ఈటలపై కెటిఆర్ ఈటెలు

- Advertisement -
- Advertisement -

KTR Comments on Etela Rajender

ఆయనది ఆత్మగౌరవం కాదు.. ఆత్మవంచన

హుజూరాబాద్‌లో పోటీ వ్యక్తుల మధ్య కాదు.. పార్టీల మధ్యనే
టిఆర్‌ఎస్ గెలుపుమాత్రం ఖాయం
పోటీ ప్రధానంగా టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది
గతంలో కంటే భారీ మోజారిటీతో హుజూరాబాద్‌పై గులాబీ జెండా ఎగురుతుంది 
బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలి? 
జల వివాదంలో న్యాయమే గెలుస్తుంది: మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కెటిఆర్

రాజేందర్ తనకు తానుగానే పార్టీకి దూరమయ్యారు, పార్టీ ఆయనకు ఎటువంటి నష్టం చేయలేదు. టిఆర్‌ఎస్‌లో పదవులు అనుభవిస్తూ ఇతర పార్టీల నేతలతో మంతనాలు సాగించారు. మంత్రివర్గ నిర్ణయాలపై వ్యక్తిగత సానుభూతి కోసం ప్రజల వద్ద మాట్లాడారు. ఇవి ఒక బాధ్యతగల మంత్రి చేయవలసిన పనులు కావు, టిఆర్‌ఎస్ తనకు ఎంతో గౌరవం ఇచ్చిందో, ఏమి చేసిందో ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. 2003లో ఎంత కష్టమైన ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది, ఒక విధంగా చెప్పాలంటే పార్టీలో ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత లభించింది, ఈ విషయాలు బయటకు చెప్పుకోలేక ఇప్పుడాయన ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఆధారాలున్నందునే ఆయనపై కెసిఆర్ చర్యలు తీసుకున్నారు. ఈటలను టిఆర్‌ఎస్‌లో కొనసాగించేలా చివరి వరకు ప్రయత్నించాను. సిఎంను కలవనని ఆయన బహిరంగంగా ప్రకటించిన తర్వాత నేను చేసేదేముంటుంది.

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్‌పై టిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ తొలిసారిగా స్పందించారు. ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటలది ఆత్మ గౌరవం కాదు.. ఆత్మ వంచన అని హాట్ కామెంట్స్ చేశారు. ఈటలకు టిఆర్‌ఎస్ ఎలాంటి నష్టం చేయలేదన్నారు.ఆయనకు ఆయనే పార్టీకి దూరమయ్యారన్నారు. టిఆర్‌ఎస్‌లో పదవులు అనుభవిస్తూ ఇతర పార్టీ నేతలతో ఈటల సంప్రదింపులు జరిపారన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ భేటీలోనే మాట్లాడకుండా… వ్యక్తిగత సానుభూతి కోసం ప్రజల దగ్గర మాట్లాడారన్నారు. ఇది ఒక బాధ్యతగల మంత్రిగా చేయాల్సిన పనులు కాదన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం కెటిఆర్ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఈటలకు టిఆర్‌ఎస్ ఎంత గౌరవం ఇచ్చిందో, ఏమి చేసిందో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. 2003లో ఎంత కష్టమైనా పార్టీ టికెట్ ఇచ్చిందని కెటిఆర్ గుర్తు చేశారు. టిఆర్‌ఎస్‌లో ఆయనకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పాలన్నారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీలో ఆయనకే ఎక్కువగా అన్ని విషయాలలో ప్రాధాన్యత లభించిందన్నారు.

ఈ విషయాలను బయటకు చెప్పుకోలేక ఈటల ప్రస్తుతం ఆత్మవంచన చేసుకుంటున్నారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉండి కేబినేట్ నిర్ణయాలను తప్పుబట్టారన్నారు. ఒక అనామకుడు లేఖ రాస్తే ఈటలపై సిఎం కెసిఆర్ చర్యలు తీసుకోలేదన్నారు. తగు ఆధారాలు ఉన్నాయి కాబట్టే బాధ్యత గల ప్రభుత్వంగా ఆయనపై ధైర్యంగా చర్యలకు పూనుకున్నా మన్నారు. ఐదేళ్ల క్రితమే ఆత్మగౌరవం దెబ్బతింటే ఎందుకు ఈటల మంత్రిగా ఎలా కొనసాగారని ఈ సందర్భంగా కెటిఆర్ నిలదీశారు. పలుమార్లు ఈటల అడ్డంగా మాట్లాడినా కెసిఆర్ ఎంతో ఓర్పుతో సహించారన్నారు. ఆయనను చివరి వరకు మంత్రిగా కొనసాగించారన్నారు. ఆయన చేసిన తప్పును ఆయనే ఒప్పుకుని టిఆర్‌ఎస్‌ను వీడారన్నారు. ఈటలను టిఆర్‌ఎస్‌లో కొనసాగేలా చివరి వరకు ప్రయత్నించానని కెటిఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సిఎంను కలువనని ఆయన బహిరంగంగా ప్రకటన చేసిన తరువాత తాను చూసేది ఏముంటుందన్నారు. ఈటల టిఆర్‌ఎస్‌లోకి రాకముందు కూడా కమలాపురంలో పార్టీ బలంగానే ఉందని, ఇప్పుడు కూడా హుజురాబాద్ బలంగానే ఉందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఈటల బిజెపి ఖాతాలో ఎలా వేసుకుంటారని ఒక ప్రశ్నకు సమాధానంగా కెటిఆర్ చెప్పారు.

పార్టీల మధ్యనే పోటీ
రానున్న హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని వ్యక్తుల మధ్య కాదని కెటిఆర్ అన్నారు. ఈ ఉప ఎన్నికలోనూ టిఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. అయినప్పటికీ గతంలో కంటే భారీ మెజార్టీతో మరోసారి హుజురాబాద్ నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగురవేస్తామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ఎంత తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు టిఆర్‌ఎస్ వైపే ఉన్నారన్నారు. సిఎం కెసిఆర్‌ను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు.

ఆయన ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారో….
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రజలకు ఏం అన్యాయం చేశామని పాదయాత్ర చేస్తున్నారని నిలదీశారు. ఏడేళ్లలో కేంద్రం ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్యపై తప్ప ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ఏ సబ్జెక్ట్ లేదని కెటిఆర్ విమర్శించారు. కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చిందని ప్రశ్నించారు. జలజీవన్ మిషన్ కింద అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుందని, తెలంగాణకు మాత్రం కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదన్నారు. ఈ సీజన్‌లో అందరూ వ్రతాలు చేస్తారని, అలాగే వైఎస్‌ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల ఒక రోజు పాదయాత్ర పెట్టుకున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు.

న్యాయమే గెలుస్తుంది
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల్లో న్యాయమే గెలుస్తుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఎపి ఎన్ని కేసులు వేసినా న్యాయబద్ధంగా ముందుకు వెళ్తామన్నారు. కృష్ణా జలాల వివాదంలో న్యాయం తెలంగాణవైపే ఉందని చెప్పారు. ఏ కోర్టుకు వెళ్లినా న్యాయం మన వైపే ఉంటుందన్నారు. ఈ విషయంలో ఎపి ప్రభుత్వం అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు.

KTR Comments on Etela Rajender

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News