Tuesday, May 14, 2024

నేడు పాతనగర బోనాలు

- Advertisement -
- Advertisement -

lal darwaza bonalu 2020 in telangana

 ముస్తాబైన ఆలయాలు, భక్తులకు నో ఎంట్రీ, రాత్రికి శాంతికల్యాణం, రేపు రంగం, ఊరేగింపు

చాంద్రాయణగుట్ట : తెలంగాణలోనే చారిత్రక ప్రసిద్ధిగాంచిన లాల్‌దర్వాజా బోనాలు ఆదివారం జరుగనున్నాయి. ఇందు కోసం ఆలయ నిర్వాహకులు సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ 19 నేపథ్యంలో సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండగను పాతనగర ప్రజలు ఆషాఢ మాస ప్రారంభం నుండే జరుపుకుంటున్నారు. నిత్యం స్థానిక ఆలయాలలో బోనాలు సమర్పించి సాకలు పెడుతున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆది, సోమవారాలలో భక్తులను ఆలయాలలోకి అనుమతించరు. ఇప్పటికే పోలీసులు ఆలయాల ప్రధాన రహదారుల వెంబడి ప్రత్యేక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, గౌలిపురా శ్రీ భారతమాత కోటమైసమ్మ దేవాలయం, సుల్తాన్‌షాహి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, బేలా చందూలాల్ శ్రీ ముత్యాలమ్మ దేవాలయం, హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం, బేలా శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, మీరాలంమండీ శ్రీ మహంకాళేశ్వర దేవాలయం, దూద్‌బౌలి శ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయం, అలియాబాద్ శ్రీ దర్భార్ మైసమ్మ దేవాలయం, మేకలబండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్ట కుమ్మర్‌వాడి శ్రీ కనక దుర్గ దేవాలయం, హరిజనబస్తీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం తదితర ప్రధాన ఆలయాలలో ఆయా ఆలయ నిర్వాహకులు, పూజారులు కలిసి అమ్మవారికి పూజలు, అర్చనలు, అభిషేకాలు, అలంకరణ వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించి బోనాలు, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

రాత్రికి అమ్మవారికి శాంతి కల్యాణం, మహా హారతి నిర్వహిస్తారు. సోమవారం పోతరాజు స్వాగతం, రంగం, అనంతరం నయాపూల్ ఢిల్లీ దర్వాజ వరకు మాతేశ్వరి ఘటాల సామూహిక ఊరేగింపు ఉంటుంది. కాగా దక్షిణ మండల ఇంచార్జ్ డీసీపీ గజారావు భూపాల్, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, ఇన్‌స్పెక్టర్ ఆర్.విద్యాసాగర్‌రెడ్డిలతో కలిసి ప్రధాన ఆలయాల వద్ద బందోబస్తును పరిశీలించారు.

ఇళ్లల్లోనే బోనాలు జరుపుకోవాలి

ఈ నెల 19వ తేదీన చిలకలగూడతో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలతో సహా జంట నగరాల్లో జరిగే బోనాలు వేడుకలను ప్రజలు తమ ఇళ్లల్లో జరుపుకోవాలని, కరోనా వ్యాప్తి నివారణలో సహకరించాలని శాసనసభ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏటా చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో జరిగే బోనాలు వేడుకలకు లక్షల మంది భక్తులు హాజరవుతారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి వల్ల ఈ వేడుకలను నిర్వహించడం లేదు. ప్రజలు తమ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని, ఆలయాలకు రావద్దని, సురక్షితంగా ఉండాలని పద్మారావుగౌడ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News