Sunday, April 28, 2024

అద్దెబాబుల రుబాబ్

- Advertisement -
- Advertisement -

lease and rental cases are on rise in hyderabad

గడువు ముగిసినా అక్కడే తిష్ట
సివిల్ కేసులంటూ పట్టించుకోని పోలీసులు
దీనిని సాకుగా చూపి కదలని నిందితులు
న్యాయం చేయాలనుకునే పోలీసులపై ఆరోపణలు చేస్తున్న నిందితులు
ఖాళీ స్థలాన్ని లీజుకు ఇస్తే ఇక అంతే

హైదరాబాద్: మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో లీజ్, అద్దెకు దిగుతున్న వారి అరాచకాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లోకి, ఖాళీ ప్రాంతంలో అగ్రిమెంట్ చేసుకుని వచ్చి చేరుతున్నారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లి పోయేందుకు యజమానులకు చుక్కలు చూపిస్తున్నారు. పెట్టుబడి పెట్టామని, బయట అద్దె కట్టేందుకు డబ్బులు లేవని ఇలా వివిధ కారణాలు చూపి తిష్ట వేస్తున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఇది సివిల్ కేసని తాము ఏమి చేయలేమని, కోర్టుకు వెళ్లాలని చెబుతున్నారు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి కేసులు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఇంటిని విక్రయిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా, రిజిస్ట్రేషన్ చేసినా ఇంట్లో నుంచి వెళ్లకుండా కొనుగోలు చేసిన వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు.

కష్టపడి సంపాదించిన డబ్బులను మోసగాళ్లకు ఇవ్వడం, రిజిస్ట్రేషన్ చేసినా స్వాధీనం చేయకపోవడం, కొందరు నిందితులు రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్‌కు చెందిన దిలీప్ కుమార్ సింగ్ ఇంటిని విక్రయించేందుకు స్థానికంగా ఉంటున్న రాములుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధితుడు రాములు రూ.22లక్షలు ఇచ్చినా కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకుని తిరిగాడు. స్థానిక పెద్దలతో చెప్పించినా వినకుండా ఇంటి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా నాచారం పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు దిలీప్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అప్పటి నుంచి అతడి కుటుంబ సభ్యులు పోలీసులను బ్లాక్‌మేయిల్ చేయడం ప్రారంభించారు. బాధితుడికి న్యాయం చేయాలనుకుని ముందుకు వచ్చిన నాచారం పోలీసులపై రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

మరి డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకు తిరుగుతున్నప్పుడు కుటుంబ సభ్యులు ఎందుకు ఇది తప్పని చెప్పలేదు. పోలీసులు కేసు పెట్టగానే తమపై అక్రమంగా కేసులు పెట్టారని నెత్తినోరుబాదుకున్న వారు ముందు ఎందుకు స్పందించలేదు. అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడలోని ఓ ఫుడ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు భూమి యజమానులతో లీజ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. గత ఎనిమిది నెలల నుంచి రూ.8లక్షల అద్దె ఇవ్వకపోవడమే కాకుండా గడువు ముగిసినా ఖాళీ చేయడంలేదు. దీనిపై శేరిలింగంపల్లి మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందించడంలేదు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు, ఇది సివిల్ వివాదం అని మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఇక్కడ అక్రమంగా కన్‌స్ట్రక్షన్ ఉన్నా కూడా శేరిలింగం పల్లి మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. సైబరాబాద్ పోలీస్ కమినరేట్ పరిధిలో ఓ కాలనీలో బాధితుడు రూ.2.8కోట్లకు ఇంటిని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా కొరడంతో వివాదం మొదలైంది. ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు కొనుగోలు చేసిన వ్యక్తి వెళ్లగా తాము ఖాళీ చేయమని భీష్మించుకుని కూర్చున్నారు. వారు బజారుకు వచ్చి దుస్తులు చింపుకుని తమ దాడి చేశారని గొడవ చేస్తున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబానగర్‌లో సురేష్ అనే బాధితుడు ఇంటిని రూ.65లక్షలకు కొనుగోలు చేశాడు.

యజమానులు వారి వారసుల అంగీకారంతో కొనుగోలు చేయడమే కాకుండా అందరి సంతకాలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిగా ఇంటిని విక్రయించిన వారు తాము ఇంట్లో నుంచి వెళ్లమని బయటికి వెళ్లగొడితే దుస్తులు చింపుకుని కేసు పెడుతామని బెదిరిస్తున్నారు. దీంతో చేసేది లేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి కేసులు నగరంలో పెరుగుతున్నాయి. దీంతో బాధితులు అనేక వ్యయప్రయాసలకు ఓర్చి డబ్బులు కట్టినా, ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవకుండా చేస్తున్నారు. కోర్టులకు వెళ్లాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నా కోర్టులకు వెళ్లితే కేసుపై తుది తీర్పు వచ్చే వరకు ఏళ్లకు ఏళ్లు పడుతోంది. అంతేకాకుండా కోర్టులకు వెళ్లడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. దానిని భరించే స్థితిలో బాధితులు లేరు, ఇది కూడా సమస్యగా మారింది.

చట్టంలో మార్పులు తీసుకురావాలి : పోలీసులు

బాధితులకు అన్యాయం జరుగుతోందని తెలుసినా, న్యాయం చేయలేకపోతున్నామని, సివిల్ కేసు కాబట్టి ఎక్కువ తాము జోక్యం చేసుకోలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళా బాధితులకు న్యాయం చేసేందుకు య త్నిస్తే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ కేసులో బాధితుడికి న్యాయం చేయాలనుకుని పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తే, పోలీసులపై లేనిపోని ఆరోపణలు చేశారు. వెంటనే చట్టంలో మార్పులు చేయాలని, నిజమైన బాధితులకు న్యాయం జరగాలంటే చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News