Sunday, April 28, 2024

ధరల పెరుగుదల… వామపక్ష పార్టీల రాష్ట్రవ్యాప్త నిరసనలు

- Advertisement -
- Advertisement -

ధరల పెరుగుదలకు నిరసనగా
మే 25 నుండి 31 వరకు వామపక్ష పార్టీల రాష్ట్రవ్యాప్త నిరసనలు

Left wing parties protest state wide

 

మన తెలంగాణ/హైదరాబాద్ : పెరుగుతున్న నిత్యా వసర వస్తువుల ధరలతో పాటు భూముల రిజిస్ట్రేషన్, విద్యుత్, ఆర్టీసి ఛార్జీలపై సమావేశం చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్షాల ఆధ్వర్యంలో మే 25 నుండి 31 వరకు మూడు విడతలుగా ఆందోళనా పోరాటాలు చేయాలని తెలంగాణ వామపక్ష పార్టీ సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి సంబంధించిన వివరాలను బుధవారం చాడ వివరించారు. ఇందులో భాగంగా మే 27న మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, ధర్నాలు, మే 30న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు, మే 31న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధర్నాలకు సమావేశం నిర్ణయం తీసుకుందన్నారు.

ఈ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని వామపక్షశ్రేణులు, ప్రజాసంఘాలు, మేధావులకు, ప్రజాతంత్య్రవాదులకు సమావేశం పిలుపునిచ్చిందని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్, పప్పులు, మంచినూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుకుంటూ పోతోందన్నారు. పేద,మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం విధించిన అన్ని రకాల సెస్సులను రద్దు చేసి, ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, పెంచిన వంటగ్యాస్, నిత్యావసర ధరలతో పాటు, బట్టలు, చెప్పులపై జిఎస్‌టిని తగ్గించాలని, స్టీల్, సిమెంట్, ఇసుక ధరలను అదుపు చేయాలని, దేశంల ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి 14 రకాల నిత్యావసరాలు పేదలకందించాలని, అసంఘటిత రంగ కార్మికులందరికీ నెలకు రూ.7,500లు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి, దీన్ని పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాలని, ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేసి, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అసంఘటిత కార్మికులకు కనీస వేతనం రూ.26,000లు చెల్లించాలన్నారు.

పెంచిన విద్యుత్, ఆర్‌టిసి బస్సు, భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించిందన్నారు. సమావేశంలో వామపక్షాల రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, డిజి నరసింహారావు(సిపిఎం). చాడ వెంకటరెడ్డి, బాల మల్లేష్(సిపిఐ), రమ, హన్మేష్ (సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా), కె.గోవర్థన్ (సిపిఎంఎల్ న్యూడెమోక్రసి), జెవి చలపతిరావు(సిపిఎంఎల్ న్యూడెమోక్రసి), మురహరి(ఎస్‌యుసిఐ(సి), జానకిరాములు(ఆర్‌ఎస్‌పి), బి సురేందర్‌రెడ్డి (ఫార్వర్‌బ్లాక్), జి.రవి(ఎంసిపిఐ), రాజేష్ (సిపిఐఎంఎల్ లిబరేషన్) నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News