Monday, May 20, 2024

కేజ్రీవాల్… లీగల్ వార్

- Advertisement -
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్బంధం కొనసాగింపు కఠినమైన రాజకీయ వాస్తవాలను వెలుగులోకి తెస్తోంది. అవినీతి ఆరోపణలపై ఏ నాయకుడిని ప్రాసిక్యూట్ చేయాలో లేదా అరెస్ట్ చేయాలో ముందుగానే నిర్ణయించినట్టు కనిపిస్తోంది. సుప్రీం కోర్టు త్వరలోనే కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వవచ్చన్న సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మధ్యంతర బెయిల్ మంజూరైతే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఎలాంటి అధికార విధులూ నిర్వర్తించరాదని సుప్రీం ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది. గురువారం (ఈ నెల 9) కానీ, వచ్చేవారం కానీ బెయిల్‌పై విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. బెయిల్‌కు ఇడి అభ్యంతరం చెబుతుండగా, బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తులో ఎలాంటి ప్రభావం ఉండబోదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడుతోంది.

ఈ నేపథ్యంలో సిక్కు ఉగ్రవాదిని విడిపించడానికి ఖలిస్థాన్ అనుకూల వర్గాల నుంచి కేజ్రీవాల్ నిధులు పొందారన్న అభియోగం తెరపైకి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా సిఫార్సు చేయడం గమనార్హం. కేజ్రీవాల్‌ను బయటకు రానీయకుండా అడ్డంకులు కల్పించడంలో కేంద్ర బిజెపి హస్తం ఉందన్న ఆప్ ఆరోపణల్లో కొంతవరకు నిజాలు ఉండవచ్చన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏదేమైనా మంగళవారం గుజరాత్ పోలింగ్‌కు ముందటి ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొనలేకపోయారు. గత కొన్ని దశాబ్దాలుగా తమకు మిత్రత్వం కాని పాలనలోని సాధారణంగా కీలక రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలను కొనసాగించడం పరిపాటిగా వస్తోంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మధ్య గల సంబంధాల స్థాయిని బట్టి దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు జారీ అవుతున్నట్టు అనుమానించవలసి వస్తోంది.

నేరారోపణలున్న అనేక మంది నాయకులు పాలక ప్రభుత్వ పార్టీలోకి చేరగానే లేదా వారికి మిత్రులు కాగానే వారి నేరాలన్నీ విస్మరించే పరిస్థితి రానురాను పెరుగుతోంది. లిక్కర్ పరిశ్రమదారులకు లాభదాయకంగా మద్యం పాలసీని రూపొందించి, భారీగా ముడుపులు తీసుకోవడంలో కేజ్రీవాల్ పాత్ర ఉందన్న ఆరోపణలపై అతని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఆశ్చర్యపరిచే రాజకీయ అంశం ఇమిడి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి నేతృత్వం వహిస్తున్న కేజ్రీవాల్‌ను ఈ సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వీలు కల్పించడం లేదు. ఎన్నికల సమయమైనప్పటికీ నేరపరిధి నుంచి రాజకీయ నేతలను ఏ చట్టం ఉపేక్షించదన్నది వాస్తవమే. అయినా ఈ ప్రచార సమయంలో ఆయన లేకపోవడం ప్రతికూల చిక్కులకు దారి తీస్తోంది.

ఈ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ సవాలు చేయగా దానిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు గత రెండేళ్లుగా ఈ కేసు సాగుతున్నప్పుడు దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడానికి కారణమేమిటని ఇడిని కోర్టు ప్రశ్నించింది. జీవితం, స్వేచ్ఛ అనేవి అత్యంత ముఖ్యమైనవని, వాటిని నిరాకరించలేమని స్పష్టం చేసింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసు 2022 ఆగస్టులో నమోదైంది. సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఛార్జిషీట్లు నమోదు చేశాయి. దర్యాప్తు మాత్రం అడపాదడపా ముక్కలు ముక్కలుగ సాగుతోంది. సాక్షులు అనేక వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఒక్కొక్కటీ ఒకో కొత్త సమాచారంతో ఉంటోంది. అనుమానితుడిని అరెస్ట్ చేసే అధికారం అతడు న్యాయం నుండి పారిపోకుండా నిరోధించడానికి, సాక్షులను బెదిరించి లేదా ప్రభావితం చేసి సాక్షాలను తారుమారు చేయకుండా ఉండడానికే అవసరమవుతుంది.

అరెస్ట్ చేసే అధికారానికి, అరెస్ట్ తప్పనిసరి అవసరమనడానికి మధ్య చాలా తేడా ఉంది. ఈ కేసు లో స్వతంత్రంగా వాంగ్మూలాలు ఇచ్చే సాక్షుల నుంచి కాకుండా అప్రూవర్ల వాంగ్మూలాల ఆధారంగా రాజకీయ నాయకులు అరెస్ట్ కావడం కలవరపరుస్తున్న వాస్తవం. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసే సమయం కూడా వివాదాస్పదమైంది. ఇడి అనేక సార్లు జారీ చేసిన సమన్లకు కొన్ని నెలలుగా కేజ్రీవాల్ స్పందించకపోవడం వల్లనే ఇప్పుడు అరెస్ట్ చేయడం ఒక కారణంగా ఉదహరించవచ్చు. ఏదేమైనా నిందితుడు దర్యాప్తు సంస్థకు సహకరించాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. నిందితుల ప్రకటనలతో నిమిత్తం లేకుండా దర్యాప్తు సంసలకు విచారించే అధికారం ఉంది.

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 ఇడికి ఒక ఆయుధం వంటిదని తెలిసిందే. నిందితుల వాంగ్మూలం రికార్డు చేయడానికి, అరెస్ట్ చేయడానికి అది వీలు కల్పిస్తుంది. సమన్లకు హాజరు కాకపోవడం అరెస్ట్‌కు ఆధారం కావడం, బెయిలుకు నిరాకరించడం ఈ కేసులో ప్రశ్నార్ధకమవుతోంది. ఇదే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రులను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయడం కూడా ప్రశ్నార్థకమవుతోంది. బహుదశల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో వారిని నిర్బంధంలో కొనసాగించడం మాత్రం ఫెడరలిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం కిందకు రాదని న్యాయవర్గాల నుంచి వాదన వినిపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News