Friday, June 9, 2023

లింగాయత్‌ల ఆధిపత్యానికి సవాలు

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో మరో పది రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనే విషయమై కన్నా 1956లో ఆ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న లింగాయతుల ఆధిపత్యంకు ఒక రకంగా సవాల్ ఏర్పడినట్లు చెప్పవచ్చు. బహుశా మొదటిసారిగా, ఏ పార్టీ కూడా వారి రాజకీయ ఆధిపత్యంను ఆమోదించలేని లేని పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు కీలక నాయకులను ఎన్నికలలో పోటీ చేయనీయకుండా, వారు ఇతర పార్టీలకు వెళ్లేవిధంగా చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాలలో లింగాయతుల ఆధిపత్యానికి ముగింపు పలకాలని బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. గురువారం రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలతో వర్చ్యువల్ గా మాట్లాడుతూ కర్ణాటకను వచ్చే ఐదేళ్లలో ఎవరు పరిపాలిస్తారని కాకుండా, రాబోయే 25 ఏళ్లలో కర్ణాటక అభివృద్ధికి ఎవరు పనిచేయగలరో అనేవిధంగా ఒక యువ బృందం’ను ఈ ఎన్నికల ద్వారా బిజెపి అందిస్తున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం గమనార్హం.
స్వాతంత్య్ర పోరాటం నుండి రాష్ట్రంలో కీలక పాత్ర వహిస్తున్న లింగాయతులు 1990 వరకు కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటూ వచ్చారు. 1956 నుండి 1969 వరకు నలుగురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు – ఎస్ నిజలింగప్ప, బీడీ జెట్టి, ఎస్ ఆర్ కాంతి, వీరేంద్ర పాటిల్ ఆ సామాజిక వర్గంకు చెందినవారే కావడం గమనార్హం.

అయితే, అక్టోబర్, 1990లో వీరేంద్ర పాటిల్ ప్రత్యర్ధులు రాష్ట్రంలో మత ఘర్షణలకు కాలుదువ్వితే, అనాలోచితంగా నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ విమానాశ్రయంలోనే అవమానకరంగా రాజీనామా చేయమని ఆదేశించారు. అప్పటి నుండి ఈ వర్గంలో కాంగ్రెస్ మద్దతు కోల్పోయింది. కొంతకాలం లింగాయత్ లకు రాజకీయ ఆశ్రయం దొరకకపోయినా, ఆ తర్వాత జనతా దళ్ లో ఎస్ ఆర్ బ్మొ, జె హెచ్ పటేల్ వంటి నేతృత్వంలో ఆ పార్టీకి మద్దతుదారునిగా ఆన్నారు.
ఆ తర్వాత రాజకీయ ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్న వారికి అప్పుడప్పుడే బీజేపీలో ఎదుగుతున్న బిఎస్ యడ్యూరప్ప కనిపించారు. ఇప్పటివరకు యడ్డ్యూరప్ప ద్వారా బిజెపికి మద్దతుఇస్తూ వచ్చారు. లింగాయతుల మద్దతుతోనే ఒంటరిగా దక్షిణాదిలో బిజెపిని కర్ణాటకలో ఆయన అధికారంలోకి తీసుకు రాగలిగారు.

2006-07లో బీజేపీ-, జేడీఎస్‌ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు హెచ్ డి కుమారస్వామి ముఖ్యమంత్రిగా, యడ్యూరప్ప ఉపముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత యడ్డ్యూరప్పను ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఒప్పుకొనక పోవడంతో సంప్రదాయంగా రాష్ట్రంలో లింగాయత్‌లు, వక్కలింగల మధ్య వివాదాన్ని రగిల్చినట్లయింది. మే, 2008లో జరిగిన ఎన్నికలు ఈ రెండు సామాజిక వర్గాల మధ్య పోరాటంగా మారి యడ్డ్యూరప్ప ముఖ్యమంత్రి కాగలిగారు.
మొత్తం మీద కర్ణాటకలో బీజేపీ తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉండగా నలుగురు ముఖ్యమంత్రులు ఉంటె, వారిలో సదానంద్ గౌడ్ మినహా మిగిలిన ముగ్గురు యడ్డ్యూరప్ప, జగదీష్ షెట్టర్, బసవరాజ్ బ్మొ లింగాయత్ లే కావడం గమనార్హం. దేశం మొత్తం మీద ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మినహా బీజేపీలో ప్రజాకర్షణగల ఏకైక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాత్రమే కావడం గమనార్హం.
ఆయనకు గల ప్రజాకర్షణే బిజెపి జాతీయ నాయకత్వంలో అభదతాభావంకు కారణమైనది. అందుకనే ఎల్ కె అద్వానీ సమయం నుండి ఆయనను రాజకీయంగా అణిచివేసేందుకు ఎత్తులు వేస్తూనే వస్తున్నారు. చివరకు చాలా అవమానకరమైన రీతిలో ఆయన ముఖ్యమంత్రి పదవిని కన్నీళ్లతో వదులుకోవలసి వచ్చింది. దానితో లింగాయత్ లలో బీజేపీ నాయకత్వం పట్ల అసంతృప్తి నెలకొంది.

ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మైకి గానీ, బీజేపీలో మరే నాయకుడికిగాని అటువంటి ప్రజాకర్షణ లేదు. లింగాయత్ లు రాష్ట్ర జనాభాలో 12 నుండి 15 శాతం వరకు మాత్రమే ఉన్నప్పటికీ వారు దాదాపు రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్నారు. దాదాపు 100 నియోజకవర్గాలలో ప్రభావితం చేయగలరు. అందుకనే ఏ రాజకీయ పార్టీ కూడా వారిని నిర్లక్ష్యం చేయలేదు. మరోవంక, ఎక్కువగా జేడీఎస్ కు మద్దతు ఇస్తున్న వొక్కలింగలు ఆరు జిల్లాలకు మాత్రమే పరిమితమై ఉన్నారు.
బిజెపి అభ్యర్థులలో సుమారు 30 శాతం మంది (60 మందికి పైగా) లింగాయత్ లు ఉన్నారు. వొక్కలింగలకు 40 సీట్లు ఇచ్చారు. తద్వారా ఈ రెండు సామాజిక వర్గాలలో తమ పార్టీ పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజాకర్షణ గల నాయకులు యడ్యురప్ప మాదిరిగా ఎవరు ఎదగకుండా, ఢిల్లీలో పార్టీ నాయకత్వం చెప్పుచేతలలో ఉండేవారు మాత్రమే ఉండేవిధంగా అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త పడ్డారు.

కనీసం లింగాయత్ ల నుండే తదుపరి ముఖ్యమంత్రి ఉంటారని ప్రకటించమని యడ్డ్యూరప్ప కోరినా పార్టీ అగ్రనాయకత్వం వినిపించుకోలేదు. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కు సీటు ఇవ్వరాదన్న నిర్ణయం ప్రధాని మోదీ, అమిత్ షాల స్థాయిలో జరిగిన్నట్లు స్వయంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించడం గమనార్హం.
లింగాయత్ ల పట్ల బీజేపీ నాయకత్వం అసహనంతో వ్యవహరించడాన్ని ఆసరాగా తీసుకొని, వారిలో ఏమాత్రం ఓట్లను తెచ్చుకోగలిగినా రాష్ట్రంలో అధికారం తమదే అనే అంచనాతో కాంగ్రెస్ వారు పనిచేస్తున్నారు. గతంలోకన్నా భిన్నంగా, పార్టీకి అంతగా బలం లేని, కొంచెం కష్టపడితే గెలుపొందగల 70 నియోజకవర్గాలను గుర్తించి, దేశవ్యాప్తంగా పార్టీ నాయకులను వాటికి ఇన్ ఛార్జ్ లుగా రప్పించి, సూక్ష స్థాయిలో ప్రణాళికాయుతంగా కాంగ్రెస్ మొదటిసారిగా ప్రచారం నిర్వహిస్తోంది.
మరోవంక, బిజెపి కేవలం ప్రధాన మంత్రి మోదీ ప్రచారంపై ఆధారపడుతుంది. 22 ర్యాలీలతో పాల్గొంటారని బీజేపీ ప్రకటించింది. దేశంలోకెల్లా పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో సహితం అన్ని ర్యాలీలతో ఆయన పాల్గొనలేదు.

మరోవంక, కాంగ్రెస్ ప్రచారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అంతా తామే అయి తిరుగుతున్నారు. రాహుల్ 12 రోజులు ప్రచారం చేయబోతున్నారు.
ఇతర రాష్ట్రాలలో మాదిరిగా హిందుత్వ ప్రయోగం కర్ణాటకలో చేసేందుకు బిజెపి సాహసించడం లేదు. మొదట్లో అటువంటి ప్రయత్నాలు జరిగినా ఎన్నికల సమయంలో మాత్రం అభివృద్ధి మంత్రం పైననే, వివిధ సామాజిక వర్గాల సమీకరణపైననే దృష్టి సారిస్తున్నారు. హిజాబ్, హలాల్ వివాదాలు ఎన్నికల అంశాలు కావని స్వయంగా ముఖ్యమంత్రి బ్మొ స్పష్టం చేశారు.
ఈ ఎన్నికలు వీర్ సావర్కర్ – టిప్పు సుల్తాన్ లను విశ్వసించేవారి మధ్య అంటూ రాష్త్ర బీజేపీ అధ్యక్షుడు నళిని కటిల్ ఒక సందర్భంలో అన్నప్పటికీ బీజేపీ నాయకత్వం ఆ వాదనను తోసిపుచ్చింది. ఎందుకంటె, ఉత్తరాది రాష్ట్రాలలో పనిచేసే హిందుత్వ ప్రచారం దక్షిణాదిన ఎటువంటి ప్రభావం చూపుతుందో అనే విషయంలో బీజేపీ ఒక నిర్ధారణకు రాలేకపోతుంది. ప్రధానంగా ౠడబల్ ఇంజిన్’ ప్రభుత్వం ద్వారా సమకూరే ప్రయోజనాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంది.

మరోవంక, కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వంపై చెలరేగిన ప్రతి అవినీతి ఆరోపణలను ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకుంటుంది. ప్రతి పనిలో 40 శాతం కమీషన్ అడుగుతున్నారని స్వయంగా రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం నేరుగా ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసింది. ఒక ఎమ్యెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ పట్టుబడటం, అతని ఇంట్లో లోకాయుక్త ఆదేశంపై సోదాలు జరిగితే రూ 7 కోట్ల నోట్ల కట్టలు బయటపడటం ఒక విధంగా బిజెపిని ఆత్మరక్షణలో ఇప్పటి వరకు ఆ ఎమ్యెల్యేను పార్టీ నుండి సస్పెండ్ కూడా చేయకపోవడంతో అవినీతి పరులకు ప్రభుత్వం రక్షణ ఇస్తున్నట్లు సందేశం ప్రజలలోకి వెళ్ళింది.
కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య కుమ్ములాటలు తమకు అవకాశంగా మారగలవని బిజెపి నాయకత్వం భావించింది. అయితే వారిద్దరూ కలిసి ఏమైనా పార్టీని గెలిపించాలని పనిచేయడం, ఇటువైపు బీజేపీలో అంతటి సామర్థ్యం గల నాయకులు కనిపించకపోవడం కనిపిస్తున్నది. సీట్ల పంపిణీ తర్వాత యడ్డ్యూరప్ప ఎక్కువగా తన కుమారుడి గెలుపుకోసం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. ఏదేమైనా బిజెపి నాయకత్వంపై కర్ణాటక ఎన్నికలు ఒక సవాల్ గా మారాయి.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News