Friday, May 3, 2024

‘స్థానిక’ ఎంఎల్‌సి పదవులకు ముగిసిన నామినేషన్లు

- Advertisement -
- Advertisement -

Local body quota MLC election nominations have expired

నిజామాబాద్ నుంచి రెండోసారి నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత

కరీంనగర్‌లో భానుప్రసాద్, ఎల్.రమణ
ఆదిలాబాద్‌లో దండె విఠల్ నామినేషన్
చివరిరోజు 80 స్వతంత్రుల నామినేషన్‌లు
రెండు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ
పోటీకి దూరంగా ఉన్న బిజెపి
నేడు నామినేషన్ల పరిశీలన
ఉపసంహరణ గడువు 26

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి ఎన్నికల నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లో జరుగనున్న 12 ఎంఎల్‌సి స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్థానానికి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.45 నిమిషాలకు నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందించారు. అంతకుముందు ఎంఎల్‌సి కవిత తరఫున మరో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎంఎల్‌ఎలు, ఇతర ప్రజాప్రతినిధులు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. గత ఏడాది స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఉపఎన్నికల్లో గెలుపొందిన కవిత మరోసారి పోటీ చేస్తున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్‌టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎంఎల్‌సి ఆకుల లలిత, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. తనకు ఎంఎల్‌సిగా పోటీ చేసేందుకు మరోసారి అవకాశమిచ్చిన టిఆర్‌ఎస్ పార్టీకి ఈ సందర్భంగా కవిత కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నిక కోసం స్థానిక సంస్థల సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్‌లో భానుప్రసాద్, ఎల్.రమణ

కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికకు భానుప్రసాద్, ఎల్.రమణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా ఎంఎల్‌ఎలు హాజరయ్యారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎంఎల్‌సి ఎన్నికకు దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థిగా దండె విఠల్ నామినేషన్ వేశారు. టిఆర్‌ఎస్ పార్టీ తరఫున అనూహ్యంగా అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న ఆయన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్, ఖానాపూర్, బోథ్ ఎంఎల్‌ఎలు జోగు రామన్న, రేఖానాయక్, రాథోడ్ బాపూరావులతో కలిసి ఆదిలాబాద్‌లో తొలి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన తరఫున ఎంఎల్‌సి పురాణం సతీష్, ఎంఎల్‌ఎలు దివాకర్‌రావు, విఠల్‌రెడ్డి, చిన్నయ్య, మంచిర్యాల జెడ్‌పి ఛైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి, మాజీ ఎంఎల్‌ఎ నల్లాల ఓదెలు వేర్వేరుగా మరో మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్‌ఎష్‌కు సంపూర్ణమైన బలం ఉన్నందున ఎంఎల్‌సి విజయం ఇప్పటికే ఖాయమైందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శాసనమండలిలో స్థానిక సంస్థల వాణిని బలంగా వినిపిస్తానని ఎంఎల్‌సి అభ్యర్థి విఠల్ చెప్పారు.

రెండు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి ఎన్నికలకు బిజెపి పార్టీ దూరంగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఖమ్మం, మెదక్ స్థానాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలిచారు. మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి సతీమణి నిర్మల, ఖమ్మంలో నాగేశ్వరరావు నామినేషన్ సమర్పించారు. ఉమ్మడి ఖమ్మం స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థులుగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండ్రు సుధ నామపత్రాలు సమర్పించారు.

పెద్ద సంఖ్యలో స్వతంత్రులు

స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ చేశారు. కరీంనగర్‌లో అత్యధికంగా 23 మందికిపైగా ఇండిపెండెంట్లు పోటీ చేయగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కావలి శ్రీశైలం, సార బాయికృష్ణ, షేక్ రహీం పాషా, మహ్మద్ గౌస్, సంద రేణుక, బెజ్జం మల్లికార్జున రావు, రామాంజనేయులు, సుధాకర్‌రెడ్డిలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ సమర్పించారు. అలాగే ఉమ్మడి ఖమ్మం స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థులుగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండ్రు సుధ నామపత్రాలు సమర్పించారు. ఉమ్మడి వరంగల్‌లో బొమ్మగాని భాస్కర్, శ్రీశైలం, అన్నారపు యాకయ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే సిద్దిపేట జిల్లాకు కొండల్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లాకు చెందిన బానోతు రూప్ సింగ్, పి.రాజు, బుర్ర సంజయ్ కుమార్, వి.అశోక్, ఉష పేర్ని, పాల్వాయి లక్ష్మీనారాయణ,బీరం దేవేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

నేడు నామినేషన్ల పరిశీలన

స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి ఎన్నికల నామినేషన్ల గడువు మంగళవారం ముగియగా, బుధవారం నామినేషన్లను పరీశీలిస్తారు. మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లో 12 ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువు ఉంది. డిసెంబర్ 10 ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News