Wednesday, May 1, 2024

సడలింపుల్లేవ్.. పొడిగింపే

- Advertisement -
- Advertisement -

CM KCR

మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్
మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్
కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో
యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు
92 % మంది లాక్‌డౌన్ కొనసాగించాలన్నారు
సర్వేలు చేశాకే ఈ కీలక నిర్ణయం
మే 5న మరోసారి మంత్రివర్గం భేటీ
స్విగ్గీ, జొమాటో సహా ఫుడ్ డెలివరీలన్నీ నిషేధం
3 నెలలు అద్దెలు అడగొద్దు, కిరాయిదార్లను సతాయించొద్దు, ఓనర్లు ఇబ్బందిపెడితే 100కు డయల్
సామూహిక ప్రార్థనలకు అనుమతిలేదు
మార్చి మాదిరే ఏప్రిల్‌లోనూ వేతనాల్లో కోత
ఫ్యామిలీ పెన్షనర్లకు 75 శాతం వేతనం
ప్రైవేటు స్కూళ్లు ట్యూషన్ ఫీజులే వసూలు చేయాలి
ప్రోత్సాహకాల్లో పోలీసులకూ 10% బోనస్
మే నెలలోనూ ఉచిత బియ్యం, రూ.1500
గచ్చిబౌలి స్టేడియం ఇక టిమ్స్
తాత్కాలిక గోడౌన్‌లుగా ఫంక్షన్ హాళ్లు
రాష్ట్రాలకు వెంటనే కేంద్రం నిధులివ్వాలి

 

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే నెల 7వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేంద్రం సోమవారం నుంచి కొన్ని రంగాలకు సడలింపులు ఇస్తున్నప్పటికీ తెలంగాణలో వాటికి ఎటువంటి సడలింపులు లేవన్నారు. ప్రస్తుతం ఏ నిబంధనలున్నాయో, ఎలాంటి ఆంక్షలున్నాయో అవన్నీ కొనసాగుతాయని చెప్పారు. నిబంధనలను ఉల్లఘించే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహిస్తామని ఆయన హెచ్చరించారు. స్థానిక పరిస్థితులను బట్టి తమ మార్గదర్శకాలకు మించి ఏ రాష్ట్రమైనా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, ఆ ప్రకారమే తెలంగాణలో సడలింపులు ఇవ్వరాదని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, కొనసాగుతున్న లాక్‌డౌన్ నిబంధనలు, వైరస్ సోకిన వారికి అందుతున్న వైద్య సేవలు, లాక్‌డౌన్‌పై కేంద్రం ఇస్తున్న సవరణలు తదతర అంశాలపై చర్చించేందుకు సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది.

పలు అంశాలపై కూలంకషంగా చర్చించిన అనంతరం సిఎం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను యథావిధిగా కొనసాగించడమా? లేక కేంద్రం ప్రకటించిన విధంగా కొన్ని రంగాలకు ఆంక్షలను సడలించడమా? అన్న అంశంపై వివిధ ఏజెన్సీలతో సర్వే చేయించినట్లు తెలిపారు. ఇందులో వివిధ వర్గాలకు చెందిన వ్యక్తుల అభిప్రాయాలను సేకరించగా సుమారు 92 శాతం మందికిపైగా లాక్‌డౌన్‌ను కొనసాగించడమే మంచిదన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. అవసరమైతే లాక్‌డౌన్‌ను మే నెల చివరి వరకు పొడగించాలని కూడా సూచించారన్నారు. దీనిపై మే 5వ తేదీన మరోసారి రాష్ట్ర మంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌పై సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్వారంటైన్ రోజుల గడువును 14 రోజుల నుంచి 28 రోజుల వరకు పొడగించాలన్న వాదన కూడా వినిపిస్తోందన్నారు. మే నెలలోనూ ఉచిత బియ్యం, రూ.1500 నగదు జమ ఉంటుందన్నారు.

అలాగే వైద్యులు, డాక్టర్లు, పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు ప్రోత్సాహకం ఉంటుందన్నారు. మూడు నెలల పాటు ఇంటి అద్దెకు యాజమానులు ఒత్తిడి తీసుకురావద్దని, లాక్‌డౌన్ తరువాత విడతలవారీగా వసూలు చేసుకోవాలని ఆదేశించారు. విద్యా సంవత్సరంలో ఎటువంటి ఫీజులు పెంచరాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టు సర్వీసులను (డొమెస్టిక్) కూడా మే 7 వరకు పనిచేయవన్నారు. పండగలు, ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. సామూహిక ప్రార్థనలకు అనుమతుల్లేవన్నారు. 7వ తేదీ తరువాత కూడా వివాహాలు, విందులకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. దేశ విత్త విధానం కేంద్రం చేతిలో ఉందని.. ఏం చేయాలన్నా కేంద్రమే చేయాలని, వెంటనే రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంచాలని ప్రధాని మోడీని కోరినట్లు చెప్పారు.

పిజ్జాలు తినకపోతే చచ్చిపోతామా !
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో సేవలకు తెలంగాణలో అనుమతి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మే 7 వరకు అన్ని ఫుడ్‌డెలివరీ సంస్థలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఈ 15 రోజులు బయటి పదార్థాలు(ఫుడ్) జోలికి వెళ్లొద్దని, ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదని వ్యాఖ్యానించారు. నిత్యావసరాలు సరఫరా చేసేవాళ్లకు ఇబ్బందులు ఉండవని, కానీ స్విగ్గీ, జొమాటో వాళ్లపై కొన్నిరోజులు నిషేధం విధిస్తున్నామని అన్నారు. ఒక పిజ్జా సరఫరా చేసే వ్యక్తితో 69 మందికి ఇబ్బందులొచ్చాయని ఢిల్లీలో అన్నారని పేర్కొన్నారు. ఈ పిజ్జాలెందుకు బొజ్జాలెందుకు..? ఏదో ఇంత పప్పు ఉడకేసుకుని వేడివేడిగా తింటే సరిపోదా అని వ్యాఖ్యానించారు.

నాలుగు రోజుల కష్టపడితే ఏమవుతుంది..? పిజ్జాలు తినకపోతే చచ్చిపోతామా..? అని ప్రశ్నించారు. బయటి నుంచి తినుబండారాలు తెప్పించుకోవద్దని చెప్పారు. కంటైన్‌మెంట్ జోన్లలో ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని కోరా రు. కరోనా వైరస్‌ను నిలవరించడానికే కంటైన్‌మెంట్ జోన్లు పెట్టామని పేర్కొన్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో ఉండే ప్రజలకు పాలు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

పండుగలు ఇళ్లలోనే జరుపుకోవాలి
ఎలాంటి పండగలైనా పరిమిత సంఖ్యలో ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. రంజాన్ మాసం అయినప్పటికీ ఎలా ంటి సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదని తెలిపారు. హిందూ, ముస్లీం, క్రిస్టియన్ మతాలతో పాటు అన్ని మతాల్లో సామూహిక కార్యక్రమాలు, ప్రార్థనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని అన్నారు. ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో ఉన్నవాళ్లు మే 7వ తేదీ వరకు తెలంగాణకు రావొద్దని, వచ్చినా ఇక్కడ క్యాబ్‌లు ఉండవు, ట్యాక్సీలు ఉండవని, చాలా కష్టమవుతుందని అన్నా రు. జిఎంఆర్ ఎయిర్ పోర్టు వాళ్లకు కూడా స్పష్టం చేశామని తెలిపారు.

ఇంటి అద్దె మూడు నెలలు వసూలు చేయొద్దు
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటి యజమానులు, కిరాయిదారుల నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలల అద్దె వసూలు చేయొద్దని సిఎం కెసిఆర్ ఆదేశించారు. తర్వాత నెలల్లో వాయిదాల వారీగా వసూలు చేసుకోవాలని సూచించారు. ఇది అప్పీల్ కాదని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారమని చెప్పారు. విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం అద్దెకు ఉండేవారి నుంచి డబ్బులు వసూలు చేయరాదని అన్నారు. ఇంటి అద్దె విషయంలో యజమానులు ఎవరైనా ఇబ్బంది పెడితే 100కి ఫోన్ చేసి చెప్పాలని తెలిపారు. కిరాయిదారులను సతాయిస్తే ఇంటి యజమానులపై కఠిన చర్యలుంటాయన్నారు. కిరాయి వాయి దా వేశామంటూ వడ్డీ వసూలు చేయాలని చూస్తే ఊరుకోమని సిఎం హెచ్చరించారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారని, దీంతో చాలా మంది ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి నెలకొందని అన్నా రు. ఉపాధి కోల్పోయి జీవనం సాగించడం కష్టంగా మారడం తో వారి పరిస్థితులను అర్థం చేసుకుని యజామానులు ఇంటి అద్దెను మూడు నెలల పాటు వాయిదా వేయాలని తెలిపారు.

ప్రైవేట్ స్కూళ్లు ఫీజు పెంచొద్దు
ప్రైవేట్ స్కూళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 20-20-21విద్యా సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా ఫీజులు పెంచకూడదని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. నెలవారీగా ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యాసంస్థల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ట్యూషన్ ఫీజు కాకుండా ఎలాంటి ఇతర ఫీజులు వసూలు చేయకూడదని పేర్కొన్నారు. ఫీజులు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టకూడదని, .ఫీజుల కోసం ఎవరైనా ఇబ్బందిపెడితే డయల్ 100కి ఫోన్ చేయాలని సూచించారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలా ంటి అపరాధ రుసుం లేకుండా మే 30 వరకు ఆస్తిపన్ను చెల్లించవచ్చని తెలిపారు.

మే నెలలోనూ ఉచిత బియ్యం,రూ.1,500
రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి మే నెలలో కూడా రూ.1,500 చొప్పున నగదు సాయం అందిస్తామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. అలాగే ప్రతి తెల్లరేషన్ కార్డుదారుల కుటుంబాలకు ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యం అందిస్తామన్నారు. అలాగే వలస కార్మికులకు కూడా ఒకరికి రూ.500 నగదు, 12 కిలోల బియ్యం అందిస్తామని చెప్పారు. ఒకరి కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులున్న వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతోపాటు రూ.1,500 నగదు సాయం చేస్తామని తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి పోవని, ఈ విషయలో వదంతులు నమ్మవద్దన్నారు. బ్యాంకుల వద్ద కూడా సామాజిక దూరం పాటించాలని కోరారు.

పోలీసులకు 10 శాతం బోనస్
లాక్‌డౌన్ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు అద్భుతంగా పనిచేస్తున్నారని సిఎం కెసిఆర్ కొనియాడారు. నిత్యావసర సరుకుల పంపిణీ, అన్నదానాలు చేయడం ద్వారా పేదలను ఆదుకుంటున్నారని చెప్పారు. కంటైన్‌మెంట్ జోన్లను బాగా పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో ఒక్కరు కూడా ఉపవాసం ఉండకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్కరు ఉపవాసం ఉన్నా మనకు గౌరవం కాదని వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన వేతనాలనే ఏప్రిల్ నెలలోనూ ఇస్తామని తెలిపారు. గతంలో పెన్షనర్లకు ఇచ్చిన 50 శాతం వేతనాన్ని 75 శాతానికి పెంచుతున్నామని సిఎం వెల్లడించారు. రాష్ట్రంలో 1.11 లక్షల కుటుంబాలు పెన్షనర్ల కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత నెలలో ఇచ్చిన మాదిరిగానే మే నెలలో కూడా సిఎం ప్రోత్సాహకం కింద పోలీసులకు వారి మూల వేతనంలో 10 శాతం ఎక్కువగా చెల్లిస్తామని చెప్పారు. అలాగే వైద్య, మున్సిపల్, గ్రామపంచాయతీ సిబ్బందికి నగదు ప్రోత్సాహం కొనసాగిస్తామని తెలిపారు. విద్యుత్ కార్మికులు, జెన్ కో, ట్రాన్స్ కో సంస్థల్లో పనిచేస్తున్న చిన్న స్థాయి ఉద్యోగులు 34,512 మంది ఉన్నారని, వారికి ఈ నెల వంద శాతం వేతనాలు ఇస్తామని వెల్లడించారు.

గచ్చిబౌలి స్టేడియం…ఇక టిమ్స్
గచ్చిబౌలిలో ఉన్న క్రీడా భవనాన్ని పూర్తిగా అగ్ర స్థాయి ఆస్పత్రిగా మార్చనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. దీని పేరు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్) అని పెట్టనున్నట్లు వివరించారు. తెలంగాణలో ఒక ప్రతిష్ఠాత్మక సంస్థగా దీన్ని మార్చుతామని చెప్పారు. అయితే, దీన్ని ప్రస్తుతానికి 1500 పడకల కొవిడ్ ఆసుపత్రిగా వాడతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ ఆస్పత్రికి అనుబంధంగా పిజి వైద్య కళాశాల కూడా ఉంటుందని చెప్పారు. నిమ్స్ తరహాలో దీన్ని రూపొందిస్తామని వెల్లడించారు.

14 అంతస్తుల భవనం ఆరోగ్యశాఖకు అప్పగింత
గచ్చిబౌలిలోని స్పోర్ట్ కాంప్లెక్స్ భవనం ఖాళీగా ఉన్నందున మొత్తం 14 అంతస్తుల్లో 540 గదుల భవనాన్ని పూర్తిగా క్రీడాశాఖ నుంచి ఆరోగ్యశాఖకు బదిలీ చేసేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని సిఎం చెప్పారు. అంతేకాకుండా 9 ఎకరాల 16 గుంటల భూమిని కూడా ఆరోగ్యశాఖకు బదిలీ చేశామని అన్నారు. ఆ తర్వాత కూడా ఆ ఆస్పత్రికి అనుబంధంగా 10 లేదా 15 ఎకరాల భూమిని కూడా జత చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు తోడుగా ఈ ఆస్పత్రిని కూడా రూపొందించనున్నట్లు తెలిపారు. దీంతో నగరానికి నాలుగు వైపులా అగ్ర ఆసుపత్రులు ఉంటాయని చెప్పా రు.

ఇప్పటికే హైదరాబాద్ తూర్పున బీబీనగర్‌లో ఎయిమ్స్ వచ్చిందని, ఇప్పుడు పశ్చిమ హైదరాబాద్‌లో తాజా ఆసుపత్రి రూపొందిందని వివరించారు. ఈ టిమ్స్‌లో 750 పడకలు ఉస్మానియా, గాంధీ తరహాలో జనరల్ ఆస్పత్రిగా ఉంటుందని, మరో 750 పడకలు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిగా ఉండబోతుందని తెలిపారు. ఈ భవనాన్ని శాశ్వతంగా ఆసుపత్రిగా మార్చే ప్రక్రియను వైద్యశాఖకు అప్పగించామని వెల్లడించారు. సోమవారం నుంచి అన్ని హక్కులు ఆరోగ్యశాఖకే ఉంటాయని వెల్లడించారు. శామీర్‌పేట్‌లోని 300 ఎకరాల స్పోర్ట్ స్థలాలను కూడా వైద్య సేవలకే వినియోగిస్తామన్నారు.

మే 5 నుంచి ఎరువులు కొనుగోలు చేసుకోండి
రాబోయే ఖరీఫ్‌కు 21.50 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని సిఎం కెసిఆర్ చెప్పారు. మే 5 నుంచి రైతులు ఎరువులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఎరువుల దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని, రద్దీలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిలకు, ఫంక్షన్లకు ఎలాంటి అనుమతిలేదని, ఈ క్రమంలో రాష్ట్రంలో నెల రోజుల పాటు వేడుకలుండవని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఎరువుల నిల్వకు గోదాముల కొరత ఉన్న ఫంక్షన్ హాళ్లలను తాత్కాలిక గోదాములుగా వినియోగిస్తామన్నారు. ఫంక్షన్ హాళ్లను గుర్తించి వాటిని గోదాములుగా మార్చే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తున్నామని, ఇందుకు ప్రత్యేక కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో కాళేశ్వరం పూర్తయ్యిందని, ప్రాజెక్టు నీళ్లు సిద్దిపేటకు చేరుకున్నాయని చెప్పారు. ఈ ఏడు జూన్ నెల నుంచి నీరు సమృద్ధిగా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

100కు డయల్ చేయండి
రాష్ట్ర ప్రజలను కాపాడుకునే క్రమంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పోలీసులు అనేక మందిపై కేసులు నమోదు చేసి దాదాపు 50వేల వాహనాలు సీజ్ చేశారన్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని,ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ సహకారం కోసం డయల్ 100కి ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు, వైద్యాధికారులు స్పందిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా భారీ నుంచి కాపాడుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలను నుంచి అభినందనలు వస్తున్నాయని చెప్పారు.

దేశంలో అన్నానికి కొదవలేదు
ఇండియాకు అన్నం పెట్టే దేశం ప్రపంచంలో ఏ దేశం లేదని, 130 కోట్ల జనాభాకు మనమే వ్యవసాయం చేసుకుని పంటలను పండించుకోవాలని సిఎం అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా వ్యవసాయ పనులు ఆగకుండా కొనసాగించాలని ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. దీంతో ఆహార నిల్వలలో భారతదేశం ముందుంటుందని తెలిపారు. అలాగే దేశం ఆర్థిక పరంగా దేశం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

 

Lockdown extension in Telangana till May 7th
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News