Saturday, April 27, 2024

లాక్‌డౌన్ – 2

- Advertisement -
- Advertisement -

Lockdown

 

ఊహించిందే జరిగింది, ఉత్కంఠతో ఎదురుచూసిన ఏప్రిల్ 14 నాటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే చేశారు. లాక్‌డౌన్ 2ను ప్రకటించారు. అయితే ఆయన ఈ నెల 30వ తేదీ దగ్గర ఆగకుండా మరి మూడు రోజులు అంటే మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఏప్రిల్ 30 గురువారం, మే 1శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినం, ఆ మర్నాడు శనివారం, 3వ తేదీ ఆదివారం. ఆ మరుసటి రోజు సోమవారం నాడు, ఇంత కాలం ఇంట్లో బందీగా ఉన్న ఇండియా బాహ్య ప్రపంచంలోకి రాగలదన్న మాట, లాక్‌డౌన్ 3 లేకపోతే! ప్రస్తుతానికైతే దేశంలో కరోనా వ్యాప్తి ఆగలేదు, నిరాఘాటంగా కొనసాగుతున్నది, అయితే అమెరికాలో, ఇటలీలో, స్పెయిన్ వంటి దేశాలలో మాదిరిగా అసంఖ్యాకంగా కపాలాలను మెడలో వేసుకొని మృత్యునాట్యం చేయకుండా నిదానంగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఏమైనప్పటికీ అది ఆగకుండా పెరుగుతూ ఉండడమే ఆందోళనకరమైన అంశం. ఈ నేపథ్యంలో దేశ పౌరులు మరి కొంత కాలం భౌతిక దూరాన్ని పాటించడం, స్వీయ గృహ నిర్బంధంలో కొనసాగడం తప్ప వేరే దారి లేదు.

దేశం కోసం, జాతి జనులందరి ప్రాణ రక్షణ కోసం చేయక తప్పని అసమాన త్యాగమిది. నిజానికి గత నెల 24 నుంచి నిర్విరామంగా సాగుతున్న ఈ పట్టపగటి చీకటిని మరి 19 రోజులు విధించుకోడమంటే మాటలు కాదు! ఈ స్వచ్ఛంద ఇంటి జైలు జీవితం వ్యక్తిగతంగా పౌరులందరినీ ఎంతగానో కుంగదీయడమే కాకుం డా ఇంత సుదీర్ఘ కాలం పాటు పని పాటు లేకుండా ఉన్నందు వల్ల దిన వేతనంపై బతికేవారికి, అసంఘటితరంగ కార్మికులకు ఎదురయ్యే గడ్డు పరిస్థితులు చెప్పనలవికానివి. చేతిలో చిల్లి గవ్వ లేక, పొయ్యిలో పిల్లి విశ్రాంతి తీసుకునే విషాద దృశ్యం గురించి ఏమని చెప్పగలం! అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు తగిలే దెబ్బ అంతాఇంతా కాదు. ఉదాహరణకు మహారాష్ట్రలో విరగపండిన ద్రాక్షకు మార్కెట్ లేక, నిల్వ ఉంచుకోనూలేక పారబోసుకుంటున్న రైతుల పరిస్థితి ఒక్కటి చాలు. అలాగే అప్పటికే గిరాకీ పడిపోయిన కార్ల పరిశ్రమకు లాక్‌డౌన్ వల్ల ఎదురైన గడ్డు పరిస్థితి అసాధారణమైనది. ఇంకా ఇతర చిన్న పెద్ద అనేక పారిశ్రామిక, వాణిజ్య రంగాలు అనుభవిస్తున్న దుస్థితి వివరంగా చెప్పుకోవాలంటే ఎంతైనా ఉంది.

మంగళవారం నాడు ముంబై బాంద్రాలో వందలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జరిపిన ప్రదర్శన గమనించదగినది. ప్రధాని మోడీ ఈ లాక్‌డౌన్‌ను పొడిగించడానికి ముందు తెలంగాణ, ఒడిశా, పంజాబ్ వంటి పలు రాష్ట్రాలు అదే పని చేశాయి. రెండు రోజులక్రితం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగిన వెంటనే ప్రధాని మోడీ ప్రకటన వెలువడి ఉండవలసింది. ఎందుకైనా మంచిదని ఆయన ఆగి మొదటి దశ లాక్‌డౌన్ ముగిసిపోతున్న 14వ తేదీ మంగళవారం నాడు రెండో దశకు సంబంధించిన ప్రకటన చేశారు. కరోనా వ్యాప్తి ఆగకపోడమే అందుకు కారణం. మంగళవారం నాటికి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 10,815కి చేరుకున్నది. కోలుకున్నవారు 1190 మంది, మృతుల సంఖ్య 353కి పెరిగింది. ప్రధాని మోడీ ప్రసంగంలో హర్షించదగిన ఒక అంశం ఏప్రిల్ 20 నాటి పరిస్థితిని బట్టి కొన్ని సడలింపులు ఇస్తామన్నది. లాక్‌డౌన్ వల్ల దేశంలోని 15 రాష్ట్రాల్లో గల 25 జిల్లాలలో 2 వారాలుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదన్న తాజా సమాచారం తొందరలోనే సడలింపులను ప్రకటించగలరనే ఆశ కలిగిస్తున్నది.

దిన వేతనాలపై పని చేసేవారు, రోజువారీ శ్రమ మీద ఆధారపడి బతికేవారు తన కుటుంబ సభ్యులతో సమానమని మోడీ అన్నారు. ఏదైనా జిల్లాలోగాని, ప్రాంతంలోగాని పరిస్థితి మెరుగైతే 20వ తేదీ నుంచి అక్కడ మినహాయింపులు, రాయితీలు ఇవ్వాలనుకుంటున్నామని ఉల్లంఘనలు జరిగినా కొత్త కేసులు మితిమించి నమోదయినా ఇచ్చిన వెసులుబాట్లను ఉపసంహరించుకుంటామని కూడా ప్రధాని ప్రకటించారు. 20వ తేదీ వరకు అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచుతామని కూడా చెప్పారు. అందుచేత ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ పొడిగింపు ప్రకటనలను గౌరవించి ఇప్పటి నుంచి మరింత నిష్ఠతో లాక్‌డౌన్‌ను పాటించాలి. ఆ విధంగా వీలైనంత వేగంగా కరోనా నుంచి దేశానికి విముక్తి కలిగేలా చూడాలి. అయితే ఈలోగా కేంద్ర ప్రభుత్వం పేదలకు చేయవలసినది ఎంతో ఉంది.

వలస కూలీలు, అవ్యవస్థీకృత రంగం కార్మికులు, చిరు వ్యాపారులు, గ్రామీణ పేదల కోసం అలాగే రైతులు, డీలాపడిపోయిన పారిశ్రామిక వాణిజ్య రంగాల కోసం భారీ చేయూత ప్యాకేజీని ప్రకటించాలి. ‘కరోనా వైరస్ కనిపించని హంతకురాలు’ అని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. 70 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న జాతీయ రెస్టారెంట్ల సంఘం తమకు సాయం చేయకపోతే సామాజిక కల్లోలమే చెలరేగుతుందని హెచ్చరించింది. ఇవన్నీ కాదనలేని కఠోర వాస్తవాలే. అయితే అమెరికా, ఇటలీ, చైనాలలో మాదిరిగా కరోనా విజృంభిస్తే కలిగే ప్రాణ నష్టం కూడా చిన్నది కాదు. అందుచేత ఎన్ని బాధలనైనా ఎదుర్కొని లాక్‌డౌన్ 2ను విజయవంతం చేయడమే శరణ్యం.

 

Lockdown until May 3rd
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News