మన తెలంగాణ/ఇల్లందు టౌన్‌ః రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల హమీలలో భాగంగా వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెంచుతామన్న పెన్షన్స్‌ను పెంచకుండా కాలయాపన చేస్తుందని సామాజిక ఉద్యమనేత ఎమ్‌ఆర్‌పిఎస్ వ్యవస్ధాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహిత మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం స్ధానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నందు ఆసంఘ నాయకులు మెంతెన వసంతరావు అధ్యక్షతన నిర్వహించిన మహగర్జన సభలో పాల్గోని మాట్లాడారు.
తమకు ఓటేస్తే అధికారంలోకి రాగానే వికలాంగులకు పెన్షన్ ఆరువేలు, ఇతరులకు నాలుగువేలు ఇస్తామని అధికారం చేపట్టి ఇరువై నెలలు గడుస్తున్న ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. ప్రభుత్వ పెన్షన్‌పై జీవించే పేదప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రేస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే ప్రతిపక్ష నాయకులు కనీసం అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్నారన్నారు. రేవంత్ సర్కార్ పూర్తిగా లేనోని పొట్టనుకోట్టి ఉన్నోనికి పెడుతుందని, అందాల పోటీలకు అడ్డగోలుగా వందల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. పేద ప్రజలకు పెంచాల్సిన పెన్షన్స్‌ను పెంచాల్సినోడు పెంచడు అడగాల్సినోడు అడుగడుని ఎద్ధేవా చేశారు. ప్రజలు కేసిఆర్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పిస్తే దానిని సక్రమంగా నిర్వర్తించకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడంలో నెంబర్‌వన్ మోసగాడు రేవంత్‌రెడ్డి అయితే, ప్రతిపక్ష నాయకుడై ప్రజా సమస్యలను గాలికొదిలేసిన నెంబర్‌వన్ మోసగాడు కేసిఆర్ అని అన్నారు. అందులో భాగంగానే వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల ఆసరా పెన్షన్స్‌ను పెంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 3వ తేదిన హైద్రాబాద్ నిర్వహించే భారీ బహరంగసభకు ప్రతిఒక్కరు హజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ దివ్యాంగుల హక్కుల వేదిక అధ్యక్షులు తేల్ల ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి చెలిమల్ల రాజేందర్, కోశాధికారి రాంచందర్, మహిళ అర్గనైజర్ కామళ్ళ యశోద, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎమ్‌ఆర్‌పిఎస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.